సాక్షి, అనంతపురం : జిల్లా అంతటా సమైక్య నినాదం.. అదే జనగళమైంది. 86 రోజులుగా ఎవరి నోట విన్నా.. సమైక్యాంధ్ర నినాదమే మారుమోగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు యథావిధిగా నడుస్తున్నా సామాన్య ప్రజలు మాత్రం మొక్కవోని దీక్షతో ఉద్యమం కొనసాగిస్తున్నారు. గురువారం అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయ జాక్టో రిలే దీక్షకు ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ మద్దతు తెలిపారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
సమైక్య ఉద్యమం మొదలై 86 రోజులు కావడంతో ఎస్కేయూ వద్ద పాఠశాల విద్యార్థులు జాతీయ రహదారిపై 86 ఆకారంలో కూర్చుని ఆందోళన చేశారు. ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తనకల్లులో విద్యార్థులు రాస్తారోకో చేశారు. నంబులపూలకుంటలో ఎంపీడీఓ కార్యాలయం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో ప్రభుత్వ నార్త్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఓడీ చెరువులో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి, నాయకుడు కొత్తకోట సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్లమాడలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధనగ్నంగా ర్యాలీ చేశారు. రొద్దంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
మహాత్మా నీవైనా రాష్ట్రం సమైక్యంగా ఉండేలా దీవించు అంటూ రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కళ్లకు గంతలు కట్టుకుని టవర్‌క్లాక్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి విన్నవించారు. విశ్వభారతి విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో చేశారు. కనగానపల్లిలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాప్తాడులో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. తాడిపత్రిలో పోలీసుస్టేషన్ సర్కిల్‌లో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలేదీక్ష కొనసాగింది. ఉరవకొండలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రోడ్డుపై మోకాళ్లపై నిలుచుని ఆందోళన చేశారు.
సమైక్య నాదం.. అదే జన గళం
Published Fri, Oct 25 2013 2:46 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement