కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: తాను పనిచేస్తూ.. కింది స్థాయి ఉద్యోగులనూ పని చేయించే దిశగా జిల్లా కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రెండు నెలలుగా పాలనలో స్తబ్ధత నెలకొంది.
ఉద్యోగులంతా ఉద్యమంలో పాల్పంచుకోవడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. అధికారులు మొదలు అన్ని స్థాయిల సిబ్బంది కేంద్ర ప్రభుత్వ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. సమ్మెకు తాత్కాలికంగా విరమణ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు కూడా పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బరితెగించి సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాపై గురువారం కలెక్టర్ ప్రత్యక్షంగా దాడులు చేపట్టి ఇసుకాసురుల భరతం పట్టారు.
ఇతకపై తరచూ తనిఖీ చేపడతానని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావుతో కలిసి కర్నూలు మండలం మిలటరీ కాలనీలోని జిల్లా పరిషత్ పాఠశాల.. గార్గేయపురం, నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రైమరీ స్కూల్‌లను, చివరగా నందికొట్కూరు జిల్లా పరిషత్ బాలికలు, ప్రభుత్వ బాలుర పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ స్కూల్ హెచ్‌ఎం డిప్యూటీ డీఈవో అనుమతి తీసుకోకుండానే సెలవు పెట్టడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయనకు మెమో జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో ప్రార్థనా సమయంలో ఉపాధ్యాయులు వస్తుండటాన్ని గుర్తించి మందలించారు. విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే ముందుండాలని సూచించారు. దాదాపు అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 50 శాతం లోపే ఉండటాన్ని కలెక్టర్ గుర్తించారు. ఆయా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల నోట్స్‌ను పరిశీలించారు. వారికి ఎంత వరకు సిలబస్ పూర్తయ్యిందో తెలుసుకుని.. ఇకపై తరచూ కొన్ని పాఠశాలలను సందర్శిస్తానని తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి, పబ్లిక్ పరీక్షల్లో ఫలితాల శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
పాలనలో పరుగులు
Published Sat, Oct 19 2013 4:15 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement