బంగారం కుదువబెట్టి..
Published Sun, Sep 29 2013 2:55 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర కోసం ఉద్యమబాట పట్టిన ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతాలు నిలిచిపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు పడుతున్నారు. సమైక్యాంధ్ర కోసం చావోరేవో అంటూ.. కష్టాలను పంటిబిగువన భరిస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ అవసరాలను తీర్చుకునేందుకు ఆభరణాలను బ్యాంకుల్లో కుదువబెడుతున్నారు. బంగారంపై అప్పు తెచ్చుకుని కుటుంబాల్ని నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క ఉద్యోగులకే పరిమితం కాలేదు. వ్యాపారులు.. వృత్తులపై ఆధారపడి జీవించే వారూ బ్యాంకులు లేదా తాకట్టు వ్యాపారుల వద్దకు వెళుతున్నారు.
45 రోజుల్లో రూ.300 కోట్లు
ఉద్యమం ప్రారంభించిన 45 రోజుల్లో జిల్లాలోని బ్యాంకుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తిదారులు బ్యాంకుల్లో బంగారాన్ని కుదువబెట్టి సుమారు రూ.300 కోట్లను రుణాలుగా తీసుకున్నా రు. ఈ విషయూన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి ‘న్యూస్‌లైన్’కు ధ్రువీకరించారు. తాకట్టు, ప్రైవేటు సంస్థలు, వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అప్పులు దీనికి అదనం. సాధారణ రోజులతో పోలిస్తే బంగారంపై ఇస్తున్న అప్పులు ఇటీవల విపరీతంగా పెరిగాయని ఆ అధికారి వెల్లడించారు. గెజిటెడ్ అధికారుల నుంచి ఆఫీస్ సబార్డినేట్ స్థాయి వరకు చాలామంది బంగారు ఆభరణాలపై అప్పులు తీసుకుంటున్నట్టు వివరించారు. వ్యాపారులు, వృత్తిదారులు తీసుకుంటున్న మొత్తాలు కూడా అధికంగానే ఉన్నాయని చెప్పారు.
ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి జిల్లాలోని అన్ని బ్యాంకులు కలిపి బంగారంపై సుమారు రూ.1,000 నుంచి రూ.1,200 కోట్ల రుణాలు తీసుకుంటారని తెలిపారు. ఈ లెక్కన చూస్తే నెలకు సగటున రూ.100 కోట్లను గోల్డ్ లోన్స్‌గా ఇస్తుంటామన్నారు. దీనికి భిన్నంగా గడచిన 45 రోజుల్లో బంగారంపై రూ.300 కోట్లమేర రుణాలు ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నా రు. రానున్న రోజుల్లో ఆభరణాలపై ఇచ్చే రుణాల మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నామన్నారు. సా ధారణంగా రైతులు, వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు బంగారంపై రుణాలు తీసుకుంటారని, ఉద్యోగులు అప్పుడప్పుడూ మాత్రమే ఈ రుణాలను వినియోగించుకుంటారని వివరించారు. అందుకు భిన్నంగా గడచిన 45 రోజుల్లో రుణాలు తీసుకుంటున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉన్నట్టు స్పష్టం చేశారు.
రియల్టర్లదీ అదేదారి
సమైక్యాంధ్ర ఉద్యమంతో మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. విభజన నిర్ణయం వెలువడగానే సీమాంధ్రలోని భూముల ధరలకు బూమ్ వచ్చింది. వ్యాపారం లాభసాటిగా ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు భావించారు. అయితే భూములు కొనగోలు చేసేందుకు అవసరమైన నగదు లేక, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయ క లావాదేవీలు నిలిచిపోయూయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రైవేటు, జాతీయ బ్యాంకుల్లో సుమారు రూ.50 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement