అత్తారింటికి వెళ్లే ముందు..
అమ్మాయిల్లో ఉద్యోగం చేయని వారు, చేసేవారు... ఇద్దరూ ఉంటారు. వీరిద్దరినీ దృష్టిలో పెట్టుకుంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన ఆర్థిక అవసరాలను నాలుగు కేటగిరీల కింద వర్గీకరించొచ్చు.
1. వ్యక్తిగత ఖర్చులు
2. గృహ అవసరాల ఖర్చులు
3. అత్యవసర పరిస్థితుల కోసం డబ్బు
4. భవిష్యత్‌లో సొంత ఇల్లు, కారు లాంటివి కొనుక్కోవడం, విదేశీ టూర్లకు వెళ్లడం వంటి అవసరాలకు నిధులు.
ఉద్యోగిని అయినా, ఉద్యోగం చేయనివారైనా ఎవరైనా సరే! అవసరాలను గుర్తెరిగి, ముందస్తుగా ప్రణాళిక వేసుకుంటే, భవిష్యత్‌లో రెండు కుటుంబాలకూ మంచిదే.
ఉద్యోగం చేయని వారి సంగతి తీసుకుంటే ఆర్థిక నిర్వహణపై వారికి కొంత ఎక్కువగా అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవటం నేర్పాలి. అమ్మాయి పెళ్లి కావడానికి ముందే.. ఆమె కుటుంబ సభ్యులు లేదా ఆమే స్వయంగా ఈ ప్లానింగ్‌కి పూనుకోవాలి. విద్యాబుద్ధులు నేర్పడంతోపాటు వివాహయోగ్యమైన వయసు వచ్చినప్పట్నుంచీ ప్రతినెలా కొంత ఆదాయం వచ్చేలా ఆమె పేరిట ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది తల్లిదండ్రుల బాధ్యత. ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్ లాంటి వాటిలో శిక్షణనిప్పించడమూ మంచిదే.
పెళ్లి కాకముందైనా.. అయ్యాకైనా ఇతరులపై ఆధారపడ కుండా ఆమె నిలదొక్కుకోవడానికివి ఉపయోగపడతాయి. పెళ్లి తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తినా ఎదుర్కొనగలిగే ధీమా ఆమెకు లభిస్తుంది. అలాగే, అమ్మాయికి ప్రత్యేకంగా బ్యాంకు అకౌంటుతో పాటు బ్యాంకింగ్ లావాదేవీలు ఎలా జరపాలన్నదీ తెలిసుండాలి. పెళ్లికి ముందు నుంచే పొదుపు చేయడం మొదలు పెట్టడం సర్వదా అభిలషణీయం. ఇక ఉద్యోగం చేసేవారి సంగతి చూస్తే... వారు పెళ్లి నాటికి కూడా ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆర్థిక భద్రతకు సంబంధించి వారి సమస్యలు సగం తీరినట్లే.
ఆర్థిక నిర్వహణ గురించి వర్కింగ్ ఉమెన్‌కి కొంతైనా అవగాహన ఉంటుంది. వీరు తమ జీతంలో కనీసం 25-30 శాతమైనా పొదుపు చేయాలి. అలాగని దాచిపెట్టుకున్నదంతా పెళ్లి వేడుకలకు ఖర్చు చేసేయడం ఎంతమాత్రం సరికాదు. దుస్తులు, ఇతర హడావుడి వ్యయాలను కాస్త తగ్గించుకుని కొంత పక్కన పెట్టడం మేలు. పెళ్లైన తొలినాళ్లలో ఖర్చుల కోసం ఇంట్లో వారిని అడగాలంటే మొహమాటం ఉంటుంది గనుక... అప్పుడు ఈ డబ్బులు అక్కరకొస్తాయి.
భార్యా, భర్తలు ఇరువురికి జీవిత బీమా, వైద్య బీమా పాలసీలుండాలి. ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగితే.. బీమా మొత్తం సిసలైన వారసులకు దక్కేలా వారి పేర్లను చేర్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో సాధ్యమైనంత వరకూ ఇతర కుటుంబ సభ్యుల మనస్సు నొప్పించని విధంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల కోసం ప్రమాద బీమా, వైద్య బీమా తీసుకోవడం మంచిది. ఇక, బ్యాంక్ అకౌంట్లు, ఇతరత్రా ఆస్తులకు నామినేషన్ ఉండేలా చూసుకోవాలి.
ఇదంతా భర్తను, అతని కుటుంబసభ్యుల నిబద్ధతను అనుమానిం చటం కాదు. అలాంటి భావన కలిగేలా వ్యవహరించకూడదు కూడా. భవిష్యత్‌లో ఒడిదుడుకులు ఎదురుకాకుండా భార్య, భర్త ఆర్థికంగా స్థిరపడగలిగేలా చూసుకోవాలన్నదే దీని సారాంశం.