జిల్లాలో వేలాది మంది విద్యార్థుల గొంతుకలు ఒక్కటై సమైక్య నినాదాన్ని మారుమోగించాయి. రాష్ట్రం ముక్కలు కాకుండా ఒక్కటిగానే ఉండాలంటూ
విద్యార్థి గర్జన
Published Thu, Oct 3 2013 5:15 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
సాక్షి, కడప : జిల్లాలో వేలాది మంది విద్యార్థుల గొంతుకలు ఒక్కటై సమైక్య నినాదాన్ని మారుమోగించాయి. రాష్ట్రం ముక్కలు కాకుండా ఒక్కటిగానే ఉండాలంటూ నినాదాలతో హోరెత్తించారు. శాంతి ర్యాలీలు, ధర్నాలు,రాస్తారోకోలు, మానవహారాలతో జిల్లా దద్దరిల్లింది. గాంధీ జయంతి రోజున సత్యాగ్రహ బాటలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆయన స్ఫూర్తితో, క్రమశిక్షణతో శాంతియుతంగా సమైక్యాంధ్రను సాధించగలమని ముక్తకంఠంతో నినదించారు. కడపలో వేలాదిమంది విద్యార్థులు సమైక్య నినాదాలతో గర్జించారు. 500 మీటర్ల జాతీయ పతాకంతో జిల్లా పరిషత్ ఆవరణం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి కోటిరెడ్డి కూడలిలో మానవహారం నిర్మించారు. కలెక్టరేట్ వద్ద దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ట్రెజరీ ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలతో ర్యాలీ నిర్వహించి మహత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్, నీటిపారుదలశాఖ, వాణిజ్యపన్నులశాఖ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల సమాఖ్య, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల దీక్షలు కొనసాగాయి.
జమ్మలమడుగు పట్టణంలో మహాత్మాగాంధీ 1869లో జన్మించినందున అందుకు గుర్తుగా 1869మంది మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఇందులో డ్వాక్రా మహిళలు, ఐసీడీఎస్, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, నర్సులు, క్యాంప్‌బెల్ ఆస్పత్రికి చెందిన నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సతీమణి అరుణ, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సతీమణి సరస్వతితోపాటు పలువురు పాల్గొన్నారు. దీక్షా శిబిరం వద్ద సమైక్యాంధ్ర పాటలు, అంజలిబృందం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జేఏసీ కన్వీనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, ఆర్డీఓ రఘునాథరెడ్డి, అల్లె ప్రభావతి సంఘీభావం తెలిపారు.
రాయచోటిలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ, న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. రైల్వేకోడూరు పట్టణంలో జేఏసీ, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీరికి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు సంఘీభావం తెలిపారు. విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి 64 ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శివలింగానికి పాలాభిషేకం చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
బద్వేలు పట్టణంలో డ్వామా సిబ్బంది 24 గంటల దీక్షలు చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులతోపాటు అన్ని వర్గాల ప్రజలు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోరుమామిళ్ల పట్టణంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు సాగాయి. ప్రొద్దుటూరు పట్టణంలో ప్రతి ఇంటిపై, వాహనాలపైన సమైక్య జెండాలు రెపరెపలాడాయి. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహశీల్దార్ శ్రీనివాసులు నేతృత్వంలో ఎన్జీఓలు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు గాంధీ విగ్రహం వద్ద ధర్నాను చేపట్టారు. శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇరిగేషన్, వస్త్ర భారతి, మున్సిపాలిటీ, వైద్యులు,న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.
కమలాపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వినతిపత్రం సమర్పించారు. పులివెందులలో ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఉపాధ్యాయ, ఆర్టీసీ, ఎన్జీఓలు వీరికి మద్దతు తెలిపారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పాలాబిషేకం చేశారు. మైదుకూరులో ఉపాధ్యాయులు, న్యాయవాదులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు.
Advertisement
Advertisement