వైఎస్సార్ సీపీ రోడ్ల దిగ్బంధం సక్సెస్
Published Thu, Nov 7 2013 1:39 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
సాక్షి, గుంటూరు : సమైక్యంపై కేంద్రానికి, జీవోఎం(గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్)కు కనువిప్పు కలిగించడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన రహదారుల దిగ్భంధం మొదటి రోజు విజయవంతమైంది. సమైక్య రాష్ట్రమే కావాలనే ప్రజల బలీయమైన ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు తెలియజెప్పేందుకు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రోజైన బుధవారం జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో పలు చోట్ల హైవేలపై వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కి నిరసన తెలియజేశాయి. పార్టీ శ్రేణులతో పాటు సమైక్యవాదాన్ని కాంక్షించే వారంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. పలు చోట్ల పోలీసులు ఓవరాక్షన్ చేసి జులుం ప్రదర్శించారు. చిలకలూరిపేటలో జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో జాతీయరహదారి దిగ్బంధం జరిగింది. చిలకలూరిపేట మండలం బొప్పూడి, యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి, చిలకలూరిపేట మండలం కోమటినేనివారి పాలెంలో రాష్ట్ర రహదారిపై ఈ కార్యక్రమం జరిగింది. రోడ్లపైనే వంటా వార్పు నిర్వహించి నిరసన తెలిపారు.
మంగళగిరి వద్ద కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్
నియోజకవర్గ కేంద్రం మంగళగిరిలో జాతీయ రహదారిపై కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో తెనాలి జంక్షన్ వద్ద కార్యకర్తలు ఉదయం 10 గంటలకు చేరుకుని రెండు గంటల పాటు బైఠాయించారు. ఈ సందర్భంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఆర్కే సహా 28 మంది కార్యకర్తలను అరెస్టు చేసి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద గుంటూరు-మాచర్ల రహదారిని దిగ్బంధించారు. ట్రాక్టర్లు అడ్డుపెట్టి ధర్నా చేశారు. రాజుపాలెం మండలం కొండమోడు వద్ద మాచర్ల-గుంటూరు ప్రధాన రహదారిపై వంటావార్పు చేశారు. పోలీసులు అంబటి రాంబాబును అరెస్టు చేసి పిడుగురాళ్ల స్టేషన్‌కు తరలించారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేను పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగ్బంధం చేశారు. దాచేపల్లి మండలం నడికుడి పంచాయతీలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద పార్టీ కేంద్రపాలక మండలిసభ్యులు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి రాస్తారోకోలో పాల్గొన్నారు. మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించిన తరువాత జంగాతో పాటు మరికొంతమంది నాయకులను పోలీస్‌లు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత పార్టీ నాయకులు శ్రీనగర్, పొందుగల గ్రామాల్లో హైవేను దిగ్బంధం చేశారు. పిడుగురాళ్లలో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు.
పోలీసుల ఓవరాక్షన్
పొన్నూరు నియోజకవర్గంలో రావి వెంకటరమణ ఆధ్వర్యంలో పెదకాకాని వద్ద చెన్నై జాతీయ రహదారిని పార్టీ శ్రేణులు దిగ్బంధిం చాయి. పోలీసులు ఓవరాక్షన్‌తో డీఎస్పీ మధుసూదనరావు వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని దూషించారు. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఇదేంటని ప్రశ్నించిన రావి వెంకటరమణతోనూ డీఎస్పీ వాగ్వాదానికి దిగారు. డీఎస్పీ తీరుపై పార్టీ నేతలు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. బాపట్లలో దిగమర్రు జాతీయరహదారిపై సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధం చేశారు. పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్, వెదుళ్లపల్లి, కర్లపాలెం మండల కేంద్రం, పిట్టలవానిపాలెంలో చందోలు వద్ద రహదారులపై ఆందోళన చేశారు.
పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ అడ్డరోడ్డు వద్ద గుంటూరు-హైదరాబాద్ హైవేపై నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 1.30 గంటల సమయంలో పోలీసులు బలవంతంగా నాయకులను స్టేషన్‌కు తరలించారు. ఆయా మండలాల కన్వీనర్లు షేక్ మస్తాన్, మీరయ్య, కోటేశ్వరరావు, మర్రి ప్రసాదరెడ్డిలు సత్తెనపల్లి-మాదిపాడు, అమరావతి-బెల్లంకొండ రోడ్లను దిగ్బంధం చేసి నిరసన వ్యక్తం చేశారు. మాచర్ల , విజయపురిసౌత్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది. రెంటచింతల రహదారి పై రాస్తారోకో చేపట్టారు. నరసరావుపేటలో సమన్వయకర్త డాక్టరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. వేమూరు సమన్వయకర్త మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం చేపట్టారు. వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
రాష్ట్ర రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు
వినుకొండలో సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో చీకటీగలపాలెం వద్ద రహదారులను దిగ్బంధం చేశారు. సుమారు 2గంటలు పాటు జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు- కర్నూలు రాష్ట్ర రహదారిపై వాహనాలు అధిక సంఖ్యలో నిలిచి పోయాయి. డాక్టర్ సుధతో పాటు డాక్టర్ లతీష్‌రెడ్డి, మండల కన్వీనర్ అనుమాల నాసర్‌రెడ్డి, నూజెండ్ల మండల కన్వీనర్ తుమ్మా వెంకటరెడ్డి, తిప్పిశెట్టి కోటేశ్వరరావుతో పాటు నాయకులు, కర్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో సమన్వయకర్త గుదిబండి చినవెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగి ంది. రైతు విభాగం నాయకులు మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. నందివెలుగు రోడ్డులో గళ్లా చందు ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ జిలానీ, రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయసారధి ఆధ్వర్యంలో పాత మద్రాసు రోడ్డులో రహదారులను దిగ్బంధించారు. తాడికొండలో సమన్వయకర్త మందపాటి శేషగిరిరావు, మేడికొండూరులో కొల్లిపర రాజేంద్రప్రసాద్, ఫిరంగి పురంలో ఈపూరు అనూప్‌ల ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని రహదారులను దిగ్భంధం చేశారు. రేపల్లెలో మోపిదేవి హరనాథబాబు ఆధ్వర్యంలో పెనుమూడి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
గుంటూరు నగరంలో..
గుంటూరులో పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన నేతలు అంకిరెడ్డి పాలెం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తూర్పు నియోజకవర్గ కన్వీనర్లు షౌకత్, నసీర్ అహ్మద్‌లు కూడా దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నాయకుడు ముస్తఫా జాతీయ రహదారిపై వంటా వార్పు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించి పలువురిని అరెస్ట్ చేసి తాలూకా స్టేషన్‌కు తరలించారు. పార్టీ యూత్ విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు నేతృత్వంలో ఏటుకూరు రోడ్డులో హైవేను దిగ్బం ధించారు. రాష్ట్ర పార్టీ యువజన విభాగం నేతలు మారూరి రామలింగారెడ్డి, దాది మురళి, గుంటూరు రూరల్ మండల కన్వీనర్ ఆళ్ల రవిదేవరాజు నాయుడు పాల్గొన్నారు.
Advertisement