సాక్షి, కర్నూలు: ‘‘ జిల్లాలో గత మూడేళ్లుగా పదోతరగతి ఫలితాలు గణనీయంగా మెరుగయ్యాయి. గతేడాది జిల్లా చరిత్రలోనే అత్యధికంగా 91.06 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ప్రస్తుతం దీనిని కాపాడుకోవడం కత్తిమీద సాములాంటిదే. అయినా పక్కా ప్రణాళికతో ఇంతకంటే ఉత్తమ ఫలితాలను సాధిస్తాం.’’ అని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో 33 పనిదినాలను నష్టంపోయామని, ఇందుకు సెలవు రోజులను సద్వినియోగం చేసుకుంటున్నామని ఆయన వివరించారు. విద్యాసంవత్సరం సాఫీగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే..
డిసెంబర్1 నుంచి త్రైమాసిక పరీక్షలు
సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో సమ్మె చేసిన ఉపాధ్యాయులు వచ్చే ఏడాది మార్చి 18 వరకు వచ్చే అన్ని రెండో శనివారాలు, ఆదివారాలు పనిచేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో సిలబస్ పూర్తవుతుందనే నమ్మకం ఏర్పడింది. పదోతరగతి సహా అన్ని తరగతులకు డిసెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు త్రైమాసిక, జనవరి మొదటి వారంలో అర్థసంవత్సర పరీక్షలను నిర్వహిస్తాం. సంక్రాంతికి ప్రభుత్వ పాఠశాలలకు మూడు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి.
విద్యార్థులకు గ్రేడ్లు..
పదోతగరతి విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం గంట చొప్పున అదనపు తరగతులు నిర్వహించాలని ఇప్పటికే అన్ని ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశాం. వచ్చే నెల మొదటివారం హాఫ్‌యర్లీ పరీక్షలు ముగిశాక విద్యార్థుల స్థాయిని ఏ, బీ, సీ, డీ నాలుగు గ్రేడులుగా విభజిస్తాం. ఆ తరువాత సీ, డీ కేటడిరీ విద్యార్థులను కొంతమంది ఉపాధ్యాయులకు దత్తత ఇస్తాం. వీరిని మార్చి నాటికి మెరుగుపడేలా చూస్తాం. సీ, డీ గ్రేడు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబోతున్న స్టడీ మెటీరియల్‌ను అన్ని పాఠశాలలకు తర్వలో అందజేస్తాం. తక్కువ ఉత్తీర్ణత ఉన్న పాఠశాలలను మండల విద్యాశాఖాధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు, నిపుణులతో అవగాహన తరగతులు నిర్వహించేందుకు చర్యలు
తీసుకుంటున్నాం.
150 పాఠశాలల్లో అదనపు గదులు
ఎనిమిదో తరగతి వరకు మౌలిక సదుపాయాలన్నింటినీ రాజీవ్ విద్యామిషన్ చూస్తుంది. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు విడుదలవుతున్న నిధులను వినియోగిస్తున్నారు. ఇటీవలే ఆర్‌ఎంఎస్ ద్వారా 150 పాఠశాలల్లో అదనపు గదులు నిర్మిస్తున్నాం. సైన్స్ ల్యాబ్‌లను కడుతున్నారు. మరో 125 పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టారు.
లేబొరేటరీల ఏర్పాటుకు చర్యలు
పదోతరగతి విద్యార్థుల కోసమైతే సైన్స్ లేబొరేటరీలు ప్రత్యేకంగా ఉన్నత పాఠశాలల్లో లేవు. గదులు లేకపోవడమే ఇందుకు కారణం. అయినా విద్యార్థుల కోసం నమూనా పరికరాలను ఉంచి బోధిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి గదులు అందుబాటులోకి రానున్నాయి కాబట్టి సైన్స్ లేబొరేటరీలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
‘ప్రైవేట్’లో పనివేళల నియంత్రణ
ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపునిచ్చిన సమయంలోనే అన్ని ప్రభుత్వ నిబంధనలకు, మార్గదర్శక సూత్రాలకు బద్ధులమై ఉంటామని డిక్లరేషన్‌ను తీసుకుంటున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లోనే ప్రైవేటు పాఠశాలలను నిర్వహించాలి. దీనిని ఉల్లంఘించిన ఆయా యాజమాన్యాలపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. అయితే పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు హైకోర్టు కూడా ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.
పక్కాగా ‘పది’
Published Fri, Nov 22 2013 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement
Advertisement