రాష్ట్ర విభజనకు నిరసనగా మొదలైన సమైక్యాంధ్ర ఉద్యమ జ్వాలలు సింహపురిలో ఎగసిపడుతున్నాయి. తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మూడో రోజూ బంద్ సంపూర్ణమైంది.
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనకు నిరసనగా మొదలైన సమైక్యాంధ్ర ఉద్యమ జ్వాలలు సింహపురిలో ఎగసిపడుతున్నాయి. తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మూడో రోజూ బంద్ సంపూర్ణమైంది. ఆదివారం వేకువజాము నుంచే బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు తెల్లవారుజాము నుంచే రోడ్లను దిగ్బంధించాయి. మరోవైపు విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా చీకట్లు అలుముకున్నాయి. నెల్లూరులో వైఎస్సార్‌సీపీ సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బంద్ జరిగింది.
కార్యకర్తలు రోడ్లపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేవీఆర్ పెట్రోల్ బంకు సెంటర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి వేదాయపాళెం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓ భవన్‌లో ఉద్యోగులు, వీఆర్‌సీ సెంటర్‌లో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో, గాంధీబొమ్మ సెంటర్‌లో ఉపాధ్యాయుల రిలేదీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్ సెంటర్‌లో అన్నదానం చేశారు.
కావలిలో బంద్‌ను వైఎస్సార్‌సీపి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షించారు. వైఎస్‌ఆర్‌సీపీ, సమైక్యాంధ్ర, ఆర్‌టీసీ, ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. అమరా యాదగిరి గుప్తా ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్డీఓ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. దీక్షలో అనంతసాగరం నాయకులు చిలకా సుబ్బారెడ్డి తదితరులు కూర్చున్నారు. పట్టణంలోని దుకాణాలన్నింటిని కార్యకర్తలు మూయించారు. గూడూరులో జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సమన్వయకర్త బాలచెన్నయ్య, నాయకులు బత్తిని విజయకుమార్, మల్లు విజయకుమార్‌రెడ్డి, నాగులు తదితరులు రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పొదలకూరులో గిరిగర్జన విజయవంతమైంది. పెద్దసంఖ్యలో గిరిజనులు తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిరాహారదీక్ష చేపట్టారు. వీరికి వైఎస్సార్‌సీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి సంఘీభావం పలికారు. సోనియా, చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ మనుబోలులో గ్రామదేవత మనుబోలమ్మకు విద్యార్థులు పూజలు చేశారు. వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం రాస్తారోకో చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సైదాపురంలో బైక్ ర్యాలీ చేశారు.
సూళ్లూరుపేటలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు నెలవల సుబ్రహ్మణ్యం, కిలివేటి సంజీవయ్య, దబ్బల రాజారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పాండురంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో బైక్‌లతో భారీ ర్యాలీ జరిగింది. దుకాణాలన్నింటని మూయించారు. మానవహారంతో జాతీయ రహదారిని దిగ్బంధించారు. విద్యుత్ సరఫరా చేయాలని మన్నారుపోలూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లో సోనియా దిష్టిబొమ్మ, బొత్స, పనబాక లక్ష్మి, ఆనం రామనారాయణరెడ్డి, చింతా మోహన్ చిత్రపటాలను తగలబెట్టారు. ఉదయగిరి బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి.
ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం, కలిగిరిలో బంద్ విజయవంతమైంది. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇందుకూరుపేటలో బైక్ ర్యాలీ నిర్వహిచారు. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది.