ఆపదలో ఉన్న వారు సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు వస్తే ఆయన తక్షణమే స్పందించి చేయూతనిస్తుంటారు. గతంలో పలుచోట్ల నేరుగా బాధితుల వద్దకు వెళ్లి సాయం చేసిన సందర్భాలు కోకొల్లలు. అదేవిధంగా శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి వచ్చి న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు తమ సమస్యలు చెప్పుకోగా వారికీ ఆర్థిక సాయం అందించి సీఎం మరోసారి తన గొప్ప మనస్సు చాటుకున్నారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. – నెల్లూరు (సెంట్రల్)
♦ కలిగిరికి చెందిన బత్తిన షణ్ముఖకుమార్ అనే చిన్నారిని తండ్రి శ్రీనివాసులు ముఖ్యమంత్రి వద్దకు తీసుకుకొచ్చారు. జన్యుపరమైన సమస్యతో ఎదుగుదలలేక ఇబ్బందులు పడుతున్నాడని, తమకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. దీంతో ముఖ్యమంత్రి స్పందించి మెరుగైన వైద్యం చేయించాలని కలెక్టర్‌కు సూచించి, తక్షణ సాయం కింద రూ.లక్ష నగదును అందేలా చేశారు.
♦ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం వేల్పుచర్లవల్లపల్లి గ్రామానికి చెందిన పి. నాగరాజు అనే వికలాంగుడు ముఖ్యమంత్రికి తన వేదనను మొరపెట్టుకున్నాడు. తనకు కాలు, చెయ్యిలేదని ఆదుకోవాలని కోరాడు. ముఖ్యమంత్రి స్పందించి తక్షణమే ఆర్థిక సాయాన్ని అందిస్తూ అవసరమైన వైద్యాన్ని అందించేలా చూడాలని కలెక్టర్‌కు సూచించారు.
♦ ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన మర్రిపూడి సుబ్బారావు అనే వికలాంగుడు ముఖ్యమంత్రిని కలిసి రోడ్డు ప్రమాదంలో కాలు దెబ్బతినిందని, తనకెవరూ లేరని, ఆర్థిక సాయంచేస్తే వైద్యం చేయించుకుంటానని చెప్పుకొచ్చాడు. సీఎం
వెంటనే స్పందించి రూ.లక్ష ఆర్థిక సాయం అందేలా చూశారు.
♦ కావలికి చెందిన పోసిన వెంకట్రావు అనే వికలాంగుడు తనకు ఆరోగ్యం సరిగాలేదని, ఆర్థిక సాయంచేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాడు. స్పందించిన వైఎస్ జగన్ తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష అందించేలా చేశారు.
♦ సర్వేపల్లికి చెందిన దంపతులు తమ కుమార్తె నోసం అమూల్య అరుదైనవ్యాధితో బాధపడుతోందని నాలుగేళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి వారు తీసుకొచ్చారు. చలించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తక్షణ సాయంగా రూ.లక్ష అందించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
♦ కందుకూరు సమీపంలోని కళవళ్ల గ్రామానికి చెందిన దుగ్గిరాల రాధ తన ఇద్దరు చిన్నారులను తీసుకుని ముఖ్యమంత్రి వద్దకు వచ్చింది. తన భర్త దుగ్గిరాల రాఘవులుకు (గ్రామ సర్పంచ్) కిడ్నీలు చెడిపోయాయని, వైద్యం చేయించే ఆర్థిక స్థోమత తమకు లేదని, తన భర్తను ఆదుకోవాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. స్పందించిన ముఖ్యమంత్రి.. అతనికి ఖర్చులు చూడాలని, మెరుగైన వైద్యం చేయించాలని కలెక్టర్‌కు సూచించారు. తక్షణ ఆర్థిక సాయం కింద రూ.లక్ష చెక్కును అందచేశారు. అలాగే, కిడ్నీ బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేల పింఛన్ వెంటనే మంజూరు చేయాలని కూడా అధికారులను సీఎం ఆదేశించారు.
♦ పొదలకూరు మండలం ఊట్లపాళెంకు చెందిన వెంకట అఖిల్ అనే వ్యక్తి తనకు వెన్నెముక ఆపరేషన్ జరిగిందని.. ఆరోగ్యం సరిగాలేదని, మరింత మెరుగైన వైద్యం చేయించుకునే స్థోమత లేదని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాడు. దీంతో సీఎం స్పందించి తక్షణ సాయం కింద రూ.లక్ష అందజేసేలా చూశారు.
Comments
Please login to add a commentAdd a comment