జన స్వాగతం
-
రేణిగుంట నుంచి నెల్లూరు దాకా జగన్‌కు భారీ స్వాగతం
-
పలుచోట్ల కాన్వాయ్ ఆపడటంతో గంట ఆలస్యంగా నెల్లూరు చేరుకున్న జగన్
-
ప్రత్యేక హోదా కోసం దర్గాలో ప్రార్థనలు
-
హోదా రొట్టె పట్టి పంచిన ప్రతిపక్ష నేత
సాక్షి ప్రతినిధి–నెల్లూరు : రొట్టెల పండుగలో పాల్గొనడానికి శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి బయల్దేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దారి పొడువునా జనం ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం బారా షహీద్ దర్గాలో ప్రార్థనలు చేసిన అనంతరం చెరువులో రొట్టెను పట్టి అందరికీ పంచారు.
అడుగడుగునా..
ప్రపంచ గుర్తింపు పొందిన రొట్టెల పండుగ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమైంది. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ పండుగలో పాల్గొనడం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు బయల్దేరిన జగన్‌కు శ్రీకాళహస్తి, నాయుడు పేట, గూడూరుతో పాటు దారి పొడవునా జనం స్వాగతం పలికారు. తన కోసం ప్రజలు ఎదురు చూస్తుండటంతో జగన్ వాహనం ఆపి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నెల్లూరు పట్టణంలోకి ప్రవేశించిన జగన్‌కు పార్టీ నేతలు భారీ ఎత్తున స్వాగతం పలికి బారా షహీద్ దర్గాకు తీసుకుని వచ్చారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు దర్గాకు చేరుకోవాల్సిన ఆయన 1 గంటకు వచ్చారు. దర్గాలో ప్రార్థనల అనంతరం బయటకు వస్తున్న జగన్‌ను చూడటానికి భక్తులు ఎగబడ్డారు. ఆయనతో చేతులు కలపడానికి, సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. దర్గా నుంచి స్వర్ణాల చెరువు వద్దకు వచ్చిన జగన్‌ను చూడటానికి భక్తులు చుట్టుముట్టారు. పార్టీ నాయకులతో కలసి చెరువు గట్టుకు చేరుకున్న జగన్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విడిచిన రొట్టెను పట్టి పార్టీ నేతలకు తినిపించారు. అక్కడి నుంచి నేరుగా తిరుగు ప్రయాణమయ్యారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణిగోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, కిలివేటి సంజీవయ్య, అంజాద్‌బాషా (కడప), డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్, నగర పార్టీ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.