తాడిపత్రి/టౌన్/రూరల్, న్యూస్‌లైన్ : తాడిపత్రి పట్టణంలో జేసీ సోదరుల అరాచకానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ‘ఊరందరిదీ ఒకదారి అయితే... ఉలిపికట్టెది మరోదారి’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పైగా అందరూ తమ ‘దారి’లోనే నడవాలంటూ దౌర్జన్యానికి తెగబడుతున్నారు. ఈ క్రమంలో సమైక్య ఉద్యమాన్ని సైతం అపహాస్యం చేస్తున్నారు. బంద్ చేస్తే సమైక్యాంధ్ర వస్తుందా అంటూ ఉద్యమకారులను హేళన చేస్తున్నారు.
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు జీవితాలు, జీతాలను త్యాగం చేసి ఉద్యమిస్తుంటే... జేసీ సోదరులు మాత్రం అందుకు భిన్నంగా స్వలాభం, రాజకీయ స్వార్థంతో ‘సమైక్య’ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. ఆదివారం సమైక్యాంధ్ర బంద్ చేపడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై స్వయాన జేసీ ప్రభాకరరెడ్డి దగ్గరుండి తన అనుచరులతో రాళ్ల దాడి చేయించారు. పోలీసుల సమక్షంలోనే వీరంగం చేసి.. భయానక వాతావరణం సృష్టించారు.
బంద్‌లో భాగంగా వ్యాపారులు మూసేసిన దుకాణాలను దౌర్జన్యంగా తెరిపించి... భయబ్రాంతులకు గురి చేశారు. శనివారం జిల్లా అంతటా బంద్ ఉన్నప్పటికీ తాడిపత్రిలోని జేసీ దివాకర్ ట్రావెల్స్ కార్యాలయాన్ని మాత్రం తెరిచే ఉంచారు. దాంతో సమైక్యవాదులు కార్యాలయంపై దాడి చేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రభాకరరెడ్డి ఆదివారం పట్టణంలో వీరంగం చేశారు. వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు పట్టణవాసులు 72 గంటల బంద్ పాటిస్తుండగా... దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాడు. వ్యాపారులతో బలవంతంగా దుకాణాలను తెరిపించాడు. బంద్ చేస్తే సమైక్యాంధ్ర రాదంటూ తన లారీలు, బస్సులను కూడా తాడిపత్రిలో యథేచ్ఛగా తిప్పించాడు.
ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి, సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, నాయకులు మున్నా, మనోహర్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, పేరం మహ్వేరరెడ్డి, ప్రకాష్‌బాబు, శరబారెడ్డి, వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మిరెడ్డి, వెంకటమల్లారెడ్డి, కంచం రామ్మోహన్‌రెడ్డి, రవీనాథ్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పెద్దపేట లక్ష్మిదేవి, లక్ష్మిదేవి తదితరులు కార్యకర్తలతో కలిసి నిరసన ప్రదర్శన ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా తెరిపించిన దుకాణాలను తిరిగి బంద్ చేయిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి సీబీ రోడ్డు, పోలీస్‌స్టేషన్ సర్కిల్ మీదుగా ఆర్‌టీసీ బస్టాండు సర్కిల్ వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకరరెడ్డి తన అనుచరులతో కలిసి రాళ్లు, కర్రలు తీసుకుని వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చూస్తుండగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి తెగబడ్డారు. అయితే... వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడకుండా అక్కడే నిలబడి జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డీఎస్పీ నాగరాజు, సీఐ లక్ష్మినారాయణ ఒత్తిడి తెచ్చారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న తమపైకి దౌర్జన్యంగా వస్తున్న వారిని అడ్డుకోవాలని చెప్పినా వినలేదు. కాంగ్రెస్ మూకలు విసిరిన ఓ రాయి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కు తగలింది. దీంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీచార్జీ చేశారు. అయినప్పటికీ జేసీ ప్రభాకరరెడ్డి అక్కడ్నుంచి కదలకుండా మరింత రెచ్చగొడుతూ అనుచరులను ఉసిగొల్పాడు.
పోలీసులు కూడా అతనికే వత్తాసు పలుకుతూ వైఎస్సార్‌సీపీ వారినే వెళ్లిపోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ నాయకులు నంద్యాల రోడ్డుపై బైఠాయించారు. జేసీ ప్రభాకరరెడ్డిని, అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ప్రతిఘటించడానికి సిద్ధమవుతున్నారని తెలుసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుపై పట్టణ ప్రజలు మండిపడ్డారు.
జేసీ మూక అరాచకం
Published Mon, Oct 7 2013 2:33 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement