సాక్షి, అనంతపురం : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలన్న ఆకాంక్షతో జిల్లాలో ఉద్యమ జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. చిన్నా..పెద్దా.. తేడా లేకుండా అందరూ కలసికట్టుగా సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం పోరు సాగిస్తూనే ఉన్నారు. 79వ రోజు గురువారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కాయి.
గుంతకల్లు, ధర్మవరంలో ఆ పార్టీ నాయకులు రిలే దీక్షలు కొనసాగించారు. రాప్తాడులో సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కన్వీనర్ శంకరనారాయణ పాల్గొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడలో సమన్వయకర్త కడపల మోహన్‌రెడ్డి, నాయకుడు డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. బుక్కరాయసముద్రంలో పార్టీ నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. గుంతకల్లులో సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు.
కళ్యాణదుర్గంలో సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కళ్యాణదుర్గంలో పార్టీ నాయకుడు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం పోస్టర్లను విడుదల చేశారు. ఏపీఎన్‌జీఓ సంఘం నాయకుల పిలుపు మేరకు సమైక్యవాదులు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసివేయించారు. అనంతపురంలో పంచాయతీరాజ్, వాణిజ్య పన్నులు, వైద్య ఆరోగ్య శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. జేఎన్‌టీయూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కుర్చీలను అడ్డంగా తలపై పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూ, ధర్మవరంలో జేఏసీ రిలే దీక్షలు కొనసాగాయి. బత్తలపల్లిలో సమైక్యవాదులు రహదారిపై మానవహారం నిర్మించారు.
రాష్ట్ర విభజన జరిగితే రైతులు పండించిన ఫలసాయానికి మార్కెట్ సౌకర్యం తగ్గిపోయి.. గిట్టుబాటు ధర లభించదని కూరగాయలను అమ్ముతూ నిరసన తెలిపారు. గుత్తిలో జేఏసీ అధ్వర్యంలో రిలే దీక్ష చేయగా.. పామిడిలో మౌన దీక్ష చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సద్భావన సర్కిల్‌లో మానవహారం నిర్మించి సమైక్య నినాదాలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. కదిరిలోని అంబేద్కర్ కూడలిలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు రిలే దీక్ష చేశారు. కళ్యాణదుర్గంలో మహిళా జేఏసీ ఆధ్వర్యంలో టీ సర్కిల్‌లో సమైక్యాంధ్ర టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసి టిఫిన్ విక్రయించి నిరసన తెలిపారు. మడకశిరలో మానవహారం నిర్మించి.. రాస్తారోకో చేశారు. పెనుకొండ, గోరంట్ల, రాయదుర్గంలో రిలే దీక్షలు కొనసాగాయి. మహిళలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. తాడిపత్రిలో పోలీసుస్టేషన్ సర్కిల్‌లో వైద్య సిబ్బంది, ఇంజనీరింగ్ విద్యార్థులు, మునిసిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి. ఉద్యమకారులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. ఉరవకొండలో జేఏసీ నాయకులు చెవిలో పూలు పెట్టుకుని ర్యాలీ చేశారు. హంద్రీ-నీవా కాలువలో కేంద్ర మంత్రుల ఫొటోలను నిమజ్జనం చేశారు. బెళుగుప్పలో జేఏసీ ఆధ్వర్యంలో పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు.
సడలని పోరు
Published Fri, Oct 18 2013 3:09 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement