మనోడే.. మంచి స్థానం ఇచ్చెయ్!
అధికారాని రెవెన్యూ ‘దాసోహం’
– కీలక శాఖపై నాయకుల పెత్తనం
– సిఫారసులకు తలొగ్గిన అధికారులు
– తాజాగా డీటీల బదిలీలకు రంగం సిద్ధం
జిల్లాకు చెందిన ఓ మంత్రి రెవెన్యూ శాఖలోని తమకు అనుకూలమైన 10 మందికి మంచి స్థానంలో పోస్టింగ్ ఇవ్వాలంటూ సిఫారసు లేఖలు ఇచ్చారు.
- శింగనమల నియోజకవర్గానికి చెందిన ఒక ముఖ్య నేత తహసీల్దారు కార్యాలయ సిబ్బందికి బదిలీల్లో ప్రాముఖ్యం ఇవ్వాలని సిఫారసు లేఖ ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఒక మండల తహశీల్దారు కార్యాలయంలో అటెండర్ నుంచి తహశీల్దారు స్థాయి అధికారి వరకు మార్పు చేయాలని లేఖ ఇచ్చినట్లు సమాచారం.
- ఇలా రెవెన్యూ శాఖపై రాజకీయ పెత్తనం కొనసాగుతోంది. నేతలంతా తమకు నచ్చిన వారికి వారు ఎంపిక చేసుకున్న స్థానాలకు పంపాలని సిఫారసు లేఖలు ఇస్తుండడంతో ఏం చేయాలో తెలియక ఆశాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
అనంతపురం అర్బన్ : అధికార పార్టీ రాజకీయానికి రెవెన్యూ శాఖ దాసోహమైంది. ఒక రకంగా తన అస్థిత్వాన్ని కోల్పోయే స్థితికి చేరింది. జిల్లా యంత్రాగంలో అత్యంత కీలకమైన రెవెన్యూపై అధికార పార్టీ నాయకుల పెత్తనం కనిపిస్తోంది. ఈ శాఖలో దిగువ స్థాయి నుంచి ఉన్నస్థాయి అధికారులు వరకు అధికార పార్టీ నాయకుల సిఫారసులకు తలొగ్గారనే విమర్శులు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన తహసీల్దారుల బదిలీల్లో సిఫారుసులకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. తాజాగా డిప్యూటీ తహసీల్దారుల(డీటీ) బదిలీలు కూడా రాజకీయ సిఫారసులకు అనుగణంగా చేపట్టేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
బదిలీలకు రాజకీయ రంగు
ఉద్యోగులకు సంబంధించిన సాధారణ బదిలీలకు ఈ ఏడాది ఏప్రిల్ 24 అర్ధరాత్రికి గడువు ముగిసింది. అయినా రెవెన్యూ శాఖలో మాత్రం బదిలీల ప్రక్రియకు కొనసాగుతూనే ఉంది. తహసీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్ల బదిలీ కోసం అందిన రాజకీయ సిఫారసులను అప్పట్లో తాత్కాలికంగా పక్కన పెట్టారు. బదిలీల గోల సద్దుమణిగిన తర్వాత ఇప్పుడు సిఫారసులకు అనుగుణంగా బదిలీలు చేపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ శాఖ పరిధిలో నిర్వహిస్తున బదిలీలన్నీ రాజకీయ రంగు పులముకుని జరుగుతున్నవేనని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు.
తాజాగా డీటీల బదిలీలకు రంగం
ఇటీవల జరిగిన 23 మంది తహసీల్దారుల బదిలీలు పూర్తిగా రాజకీయ సిఫారసులకు అనుగుణంగా జరిగినవేనని ఆ శాఖ ఉద్యోగులు బహిరంగంగానే వ్యాఖ్యనిస్తున్నారు. ఈ బదిలీల వ్యవహారం సద్దుమణగముందే రాజకీయ సిఫారుసుల మేరకు డిప్యూటీ తహసీల్దారుల (డీటీ) బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. డీటీల బదిలీలకు సంబంధించి కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. సిఫారుసుల మేరకు బదిలీలు చేయడంతో పాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాల్లో రెగ్యులర్ డీటీలను నియమించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.