‘రాజకీయ’ బదిలీలు షురూ!
– ప్రజాప్రతినిధుల నుంచి 125కు పైగా సిఫారసు లేఖలు
– వీఆర్వో మొదలు తహసీల్దారు వరకు ఇదేబాట
– ఈ నెల 24తోనే ముగిసిన బదిలీల ప్రక్రియ
– ఇకపై జరిగితే రాజకీయ ఒత్తిడితోనే..
రెవెన్యూ శాఖలో రాజకీయ బదిలీలకు తెరలేపనున్నారు. బదిలీ కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తెచ్చుకున్న ఉద్యోగులు... ఉన్నతాధికారి కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం బదిలీల ప్రక్రియకు గడువు ఈ నెల 24 అర్ధరాత్రితో ముగిసింది. ఇకపై బదిలీలు జరిగితే అవి కచ్చితంగా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో జరిగే రాజకీయ బదిలీలు అనేది సుస్పష్టం.
- అనంతపురం అర్బన్
125కు పైగా సిఫారసు లేఖలు
తాము సూచించిన ఉద్యోగిని వారు కోరిన చోటికి బదిలీ చేయాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారికి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు లేఖలు రాసినట్లు సమాచారం. బదిలీ కోసం ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తెచ్చుకున్న వారిలో 10 మంది తహసీల్దార్లు, 15 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 50 మంది సీనియర్ అసిస్టెంట్లు, 50 మంది వీఆర్వోలు ఉన్నట్లు సమచారం.
ఇక జరిగేవన్నీ రాజకీయ బదిలీలే
బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఈ నెల 24 అర్ధరాత్రితో గడువు ముగిసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గడువులోగానే బదిలీల ప్రక్రియ ముగించాలి. అటు తరువాత ఏ ఒక్క బదిలీ జరిగినా అది కచ్చితంగా రాజకీయ బదిలీ కిందకే వస్తుందని ఉద్యోగ వర్గాలే చెబుతున్నాయి. ప్రస్తుతం అధికారుల ముందు రాజకీయ సిఫారసు లేఖలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేయకపోతే కచ్చితంగా ప్రజాప్రతినిధుల నుంచి అధికారులపై ఒత్తిడి వస్తుందని ఆ వర్గాలు చెబుతున్నాయి.
ఏడు చోట్ల తహసీల్దారు పోస్టులు ఖాళీ
జిల్లాలో ఏడు మండలాల్లో తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనంతపురం రూరల్, కదిరి, సోమందేపల్లి, యాడికి, ఓబుళదేవరచెరువు, కలెక్టరేట్‌లో హెచ్, ఈ విభాగాల్లో తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనంతపురం, కదిరి తహసీల్దార్లు సెలవుపై వెళ్లారు. సోమందేపల్లి తహసీల్దారుని ఉరకొండకు బదిలీ చేశారు. యాడికి తహసీల్దారు ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఓబుళదేవర చెరువు తహసీల్దారు కూడా ఉద్యోగ విరమణ చేశారు. కలెక్టరేట్‌లో హెచ్, ఈ విభాగాలకు డిప్యూటీ తహసీల్దార్లు విభాగాధిపతులుగా ఉన్నారు. వీటిని భర్తీ చేయాల్సి ఉంది. ఈ స్థానాలతో పాటు మరికొన్ని మండలాల్లో తాము సూచించిన వారిని నియమించాలని ప్రజాప్రతినిధులు లేఖలు పంపించినట్లు తెలిసింది.
పాలన ప్రజాప్రతినిధుల గుప్పిట్లో
రాజకీయ బదిలీ పొందిన అధికారి కచ్చితంగా సిఫారసు చేసిన ప్రజాప్రతినిధి కనుసన్నల్లో పాలన సాగించాలి. అంటే ఒక రకంగా సదరు మండలాల్లో పరిపాలన ప్రజాప్రతినిధి గుప్పిట్లో వెళ్లడమేనని ఉద్యోగులు చెబుతున్నారు. ఇలా సిఫారసుపై వెళ్లిన ఉద్యోగికి ప్రజాప్రతినిధి చెప్పుచేతల్లో ఉండడంతో, జవాబుదారీగా పనిచేయలేడని, ఇది వారికి కచ్చితంగా ఇబ్బంది తెచ్చిపెడుతుందని ఉద్యోగ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారి దీన్ని దృష్టిలో ఉంచుకుని తహసీల్దారు స్థాయి అధికారుల పోస్టింగ్‌లు పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టాలే తప్ప రాజకీయ బదిలీలకు అవకాశం కల్పించకూడదని సూచిస్తున్నారు.