పాలకుల నిర్లక్ష్యం.. ప్రతిపక్షం భరోసా
– 2016లో సాదాసీదాగా అనంత ‘రాజకీయ చక్రం’
– బండ్లపల్లిలో మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్, కేంద్రమాజీ మంత్రుల పర్యటన
– జూన్‌లో ముగిసిన వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర...81 కుటుంబాలకు పరామర్శ
– 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని 'అనంత'లో ప్రకటించిన జనసేన అధినేత
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
'అనంత' రాజకీయచక్రం ఈ ఏడాది సాదాసీదాగా నడిచిపోతోంది. సంచలనాలేవీ నమోదు కాలేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మొట్టమొదట ప్రారంభించిన నార్పల మండలం బండ్లపల్లిలో మాజీ ప్రధాని మన్మోహన్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర మంత్రులు పర్యటించారు. అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర జిల్లాలో ఈ ఏడాది ముగిసింది. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా నైతికవిలువలు విస్మరించి సైకిల్ ఎక్కారు. ఎన్‌పీకుంట సోలార్ బాధితుల పక్షాన సీపీఎం పోరాటం చేసింది. కరువు రైతుల తరఫున వైఎస్ జగన్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. 'అనంత' పర్యటనకు విచ్చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు.
టీడీపీలో నామినేటెడ్ పోస్టులు
తెలుగుదేశం పార్టీ నేతలు రాయల్ మురళి, దేవళ్ల మురళిలకు నామినేటెడ్ పదవులు దక్కాయి. కాపుకార్పొరేషన్ డైరెక్టర్‌గా రాయల్ మురళి జనవరి 8న ఎంపికయ్యారు. ఆపై వడ్డెర ఫెడరేషన్ చైర్మన్‌గా దేవళ్ల మురళి నియమితులయ్యారు.
బండ్లపల్లికి కాంగ్రెస్ అగ్రనేతలు
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఫిబ్రవరి 2న బండ్లపల్లికి విచ్చేశారు. వీరితో పాటు మాజీ స్పీకర్ మీరాకుమార్, పార్లమెంట్ విపక్షనేత మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు కేంద్రమాజీ మంత్రులు వచ్చారు. వలసలఽ నివారణకు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని వారు విమర్శించారు. ఇక పీసీసీ చీఫ్ రఘువీరా ప్రతినెలా జిల్లాలో కన్పిస్తూనే ఉన్నారు. అయినా ఆ పార్టీ మాత్రం పుంజుకోవడం లేదు.
కదిరి ఓటర్లను మోసం చేసిన చాంద్‌బాషా
తెలుగుదేశం పార్టీ విధానాలను వ్యతిరేకించి, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో కదిరి నియోజకవర్గ ప్రజలు చాంద్‌బాషాను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తూ చాంద్‌బాషా ఏప్రిల్ 23న పచ్చకండువా వేసుకున్నారు. ఆయన వెనుక ‘స్థానిక’ ప్రజాప్రతినిధులు గానీ, నేతలు గానీ వెళ్లలేదు. టీడీపీలో చాంద్‌బాషాకు వరుసగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కందికుంట, చాంద్‌బాషా మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయిలో నడుస్తోంది.
రైతన్నకు జగన్ భరోసా
జిల్లాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతుభరోసా యాత్ర జూన్ 5న ముగిసింది. 14 నియోజకవర్గాల్లో 5 విడతలుగా జరిగిన ఈ యాత్రలో 31రోజుల పాటు జగన్ పర్యటించారు. 81 కుటుంబాలను పరామర్శించారు. ఇందులో 14 చేనేత కుటుంబాలు కూడా ఉన్నాయి. భరోసాయాత్ర చివరిరోజు అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై సర్వజనాస్పత్రిలో టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడటాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు.
సోలార్‌ప్లాంటు వద్ద ప్రకాశ్‌కారత్ ధర్నా
సీపీఎం జాతీయనేత ప్రకాశ్‌కారత్ జూన్ 18న ఎన్‌పీకుంటకు వచ్చారు. సోలార్‌ప్లాంటు భూనిర్వాసితులకు పరిహారం అందించాలంటూ డిమాండ్ చేశారు. ప్లాంటు సందర్శనకు వెళుతుండగా కారత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. సెప్టెంబరు 26న ప్లాంటు వద్ద ధర్నా చేసేందుకు వెళ్లిన సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌తో పాటు పలువురిపై పోలీసులు లాఠీచార్జ్ చేసి గాయపరిచారు.
రైతు సమస్యలపై జగన్ పోరు
కరువుతో అల్లాడుతున్న అనంత రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబరు 4న కలెక్టరేట్ వద్ద రైతుధర్నా చేపట్టారు. రెయిన్‌గన్‌ల పేరుతో ప్రభుత్వం చేసిన మోసం, ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వకుండా చేస్తున్న కుట్రలపై మండిపడ్డారు. అలాగే కలెక్టర్ శశిధర్‌కు వినతిపత్రం అందజేశారు. జగన్‌సభ అనంతరం డిసెంబర్‌లో జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఇన్‌పుట్ సబ్సిడీపై ప్రకటన చేశారు.
'అనంత'లో పవన్ సభ
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నవంబర్ 10, 11 తేదీల్లో జిల్లాలో పర్యటించారు. తొలిరోజు జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ప్రకటించారు. రెండురోజు గుత్తి గేట్స్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
ఏడుసార్లు పర్యటించిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది జిల్లాలో ఏడుసార్లు పర్యటించారు. రెయిన్‌గన్‌ల ద్వారా వేరుశనగను కాపాడతామని ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకూ జిల్లాలోనే మకాం వేశారు. డిసెంబర్ 2న గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. అయితే..15రోజులకే నీటి విడుదల నిలిచిపోయింది.
కార్పొరేషన్‌లో ‘చిచ్చు’
కులపిచ్చి వల్ల 'అనంత' కార్పొరేషన్ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి సెప్టెంబరులో సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్, కమిషనర్, ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా ఆ ముగ్గురూ జేసీపై అదేస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఎమ్మెల్యే, జేసీ వర్గాల మ«ధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. చివరకు సీఎం పంచాయితీ చేయాల్సి వచ్చింది.