మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సమస్యలపై, సమైక్యాంధ్రపై ప్రశ్నించినా, సభలో కార్యక్రమంలో గలాటా సృష్టించాలని చూసినా అరెస్టులు తప్పవంటూ పోలీసులు చేసిన హెచ్చరికల మధ్య జిల్లాలోని గంపలగూడెం, గుడివాడ, చాట్రాయి, ముసునూరు మండలాల్లో బుధవారం రచ్చబండ కార్యక్రమం జరిగింది. గ్రామస్థాయి నుంచి మండల కేంద్రాలకు మారిన రచ్చబండ కార్యక్రమాన్ని మరింత కుదించారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది.
చాట్రాయి సభకే ముసునూరు మండల లబ్ధిదారులను రప్పించి కార్యక్రమం అయ్యిందనిపించారు. చాట్రాయిలో మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ ఎం.రఘునందనరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. జేఏసీ చాట్రాయి మండల నాయకులు సమైక్యాంధ్ర నినాదాలు చేసి, సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని జేఏసీ నాయకులు విమర్శించారు. దీంతో మంత్రి సారథి రాజకీయాలను చొప్పించి ప్రసంగించారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫ్లెక్సీలను చించివేస్తున్నారని, రాష్ట్ర విభజనలో సమన్యాయం చేయాలని చెబుతున్న చంద్రబాబునాయుడిని టీడీపీ నాయకులు ఎందుకు నిలదీయలేకపోతున్నారని ఆపార్టీ చాట్రాయి మండల అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావును మంత్రి ప్రశ్నించారు. చాట్రాయిలో వంద మందికి పైగా పోలీసులు, ఒక డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించడం గమనార్హం. గంపలగూడెం సభలో తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి పాల్గొన్నారు. తడిచిన పత్తిని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైతులు కోరారు.
ఎ.కొం డూరు మండలంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుడివాడ మండలంలో జరిగిన రచ్చబండలో ఆర్డీవో ఎస్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించాల్సి ఉండగా సందేశం పేపరు లభ్యంకాక కొంతసేపు గందరగోళం నెలకొంది.
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారని తటివర్రు సర్పంచి కె.రాజారెడ్డి అధికారులను నిలదీశారు. గతంలో గ్రామస్థాయిలో రచ్చబండ జరిగేదని ఇప్పుడు మండల కేంద్రాలకు కుదించి ఏ సమస్యలు పరిష్కరిస్తారని ప్రశ్నిం చారు. సమావేశంలో చాలినన్ని కుర్చీలు లేక పలువురు సర్పంచులు నిలబడే ఉన్నారు.
పోలీసుల హెచ్చరికల మధ్య ‘రచ్చబండ’
Published Thu, Nov 14 2013 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement