M. Raghunandana Rao
-
కచ్చితమైన ఓటర్ల జాబితా తయారు చేయండి
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : కచ్చితమైన ఓటర్ల జాబితాలే ఎన్నికల నిర్వహణకు మూలాధారమని కలెక్టర్ ఎం.రఘునందనరావు అన్నారు. అందుకోసం కచ్చితమైన ఓటర్ల జాబితాలను రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశిం చారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం సాయంత్రం 16 శాసనసభ నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ పూర్తయ్యేంత వరకు అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఓటరు నమోదుపై 23వ తేదీ రాత్రి 12 గంటల వరకు వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాలని ఆదేశిం చారు. జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి 83 వేలు ఆన్లైన్ ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా రూ.1.18 లక్షల అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులపై శుక్రవారం నుంచి ప్రతి ఏఈఆర్వో ఉదయం 11 గంటల కల్లా కలెక్టరేట్‌కు వివరాలు పంపాల న్నారు. నియోజకవర్గ కేంద్రంలోని తహశీల్దార్లను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించామని, మిగిలిన తహశీల్దార్లకు ఈ వివరాలు తెలిపి, వారి సహకారంతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈఆర్వోలు నియోజకవర్గస్థాయిలో, నియోజకవర్గ కేంద్రం లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. నియోజవర్గ తహశీల్దార్లు నియోజకవర్గంపై ఎన్నికలకు సంబంధించి వివరాలపై అవగాహన ఉండాలన్నారు. తొలుత కలెక్టర్ రఘునందనరావు ఎన్నికల సంఘం ముద్రించిన మాన్యువల్‌లో 13 నుంచి 54వ పేజీలో ఉన్న సారాంశాన్ని అధికారులను చదివించారు. ఈ మాన్యువల్‌ను ప్రతిఒక్కరూ శ్రద్ధగా చదవాలని సూచించారు. విజయవాడ మునిసిపల్ కమిషనర్ హరికిరణ్, సబ్ కలెక్టర్ దాసరి హరిచందన, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో విజయచందర్, ఉడా వీసీ ఎం.రామారావు, కాంపిటెంట్ అథారిటీ అర్బన్ ల్యాండ్ ఎక్విజేషన్ ప్రత్యేకాధికారి ఎన్.రమేష్‌కుమార్, డీపీవో ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చిన మూడు నెలల్లోనే...పట్టుబిగిస్తున్న కలెక్టర్
=ఇసుక, చెరువులపై ఆరా =సుతిమెత్తని కత్తిలా పాలన =శాఖల వారీగా సమాచారం సేకరణ =జిల్లా అధికారుల్లో ఇదే హాట్ టాపిక్! సాక్షి, మచిలీపట్నం : ‘జిల్లాలో కీలకమైన శాఖను చూడాల్సిన మీరు మూడు మండలాలకు ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు చూస్తే ఏం న్యాయం చేస్తారు..’ అంటూ ఒక అధికారికి ఊరడింపు. ‘ఇతర శాఖలో పనిచేసే మీరు రెవెన్యూ శాఖకు చెందిన ఆర్డీవోపై కూడా విచారణ నిర్వహించేలా అవకాశం ఎలా వచ్చింది.. మీ రికార్డు చూస్తే చాలా మంది అధికారులపై మీరే విచారణ అధికారిగా వ్యవహరించారు..’ అంటూ మరో అధికారిపై ఆరా. ‘ఫైళ్లు, కాగితాల్లో మునిగిపోకుండా కాస్తయినా హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచించండి..’ అంటూ ఇంకో అధికారికి సుతిమెత్తని హెచ్చరిక. ‘జిల్లాలో అవినీతిరహితంగా ప్రజలకు సేవలు అందించలేమా.. చిత్తశుద్ధితో పనిచేయండి..’ అంటూ అధికారంతో కూడిన ఆదేశం. ఇలా వేర్వేరు సందర్భాల్లో కలెక్టర్ ఎం.రఘునందనరావు జిల్లా యంత్రాంగం విషయంలో ముక్కుసూటిగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో బాధ్యతలు చేపట్టి మూడు నెలలు నిండకముందే పాలనా యంత్రాంగంపై ఆయన పట్టు బిగిస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ సునిశితంగా పరిశీలిస్తున్నారు. సీరియస్‌గా స్పందించినట్టు లేకపోయినా సుతిమెత్తని కత్తిలా విషయాన్ని నరుక్కుని పోతున్నారు. దీంతో ఆయన తమకు కొరుకుడుపడటం లేదని పలువురు కీలక అధికారులు తమ సొంత మనుషుల వద్ద మధనపడాల్సిన పరిస్థితి వచ్చింది. పనిచేయని బిల్డప్‌లు... కలెక్టర్‌ను బుట్టలో వేసుకుని తమ పని కానిచ్చుకునేందుకు పలువురు అధికారులు చేసిన ప్రయత్నాలు పనిచేయలేదని సమాచారం. జిల్లాలో ఇప్పటివరకు పనిచేసిన కలెక్టర్లు ఒక్కొక్కరు ఒక్కో తీరుతో వ్యవహరించి తక్కువ సమయంలోనే బదిలీ అయ్యారు. దీంతో జిల్లాలోని పలు శాఖల్లో పనిచేసినవారి నీడ ఆయా కలెక్టర్లపై పడటంతో అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఏళ్ల తరబడి ఇదే జిల్లాలో పలు శాఖల ఉన్నతాధికారులుగా ఉన్నవారు కొందరు జిల్లా కలెక్టర్లను తమ దారికి తెచ్చుకుని పబ్బం గడుపుకొనేందుకు ప్రాధాన్యతఇచ్చేవారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక కలెక్టర్‌కు మరో కీలక అధికారి రకరకాల మాంసాహారాలు, నోరూరించే వంటకాలతో క్యారేజీ తీసుకెళ్లి మరీ పెట్టి అవన్నీ తానే చేసినట్టు బిల్డప్ ఇచ్చి ఆకట్టుకున్నట్టు ప్రచారం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక కలెక్టర్‌కు మరో అధికారి సర్వం తానే అన్నట్టుగా హంగామా చేసుకుని ఆయన పేరు చెప్పుకొని అవకాశం ఉన్నంతమేర ‘పోగేసుకున్నట్టు’ సమాచారం. ఇలాంటి ఎత్తులు కొత్త కలెక్టర్ వద్ద ఎలా వేయాలా అని ఆలోచించే పలువురు అధికారులు ఇప్పుడు కంగారుపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కొత్త కలెక్టర్‌ను బుట్టలో వేసేందుకు అప్పుడే జిల్లాలో పలు శాఖల ఉన్నత అధికారులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్టు విశ్వసనీయ సమాచారం. ఇసుక, ఆక్వాపై ఆరా.. జిల్లాను పాడికుండగా మలుచుకున్న కొందరు అధికారులు ఇప్పుడు కంగారుపడుతున్నారు. ఇక్కడ ఏమాత్రం హడావుడి చేయకుండానే కాసులు కురిపించే వనరులను పలువురు తమకు అనుకూలంగా మలుచుకుని కాలక్షేపం చేసేవారు. ఈ ఏడాది అక్టోబర్ 14న బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఇక్కడి ఇసుక మాఫియా, ఆక్వా చెరువుల తవ్వకం, భూదందాలు, మడ అడవుల ఆక్రమణలపై ఇప్పటికే ఆరా తీసినట్టు సమాచారం. అనుమతి లేకుండా కాసులు కురిపిస్తున్న ఇసుక తవ్వకాలపై జిల్లా అధికారులు కొందరు చూసీచూడనట్టుగానే వ్యవహరించడంలో పలువురి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కొల్లేరు, తీర ప్రాంత మండలాల్లోనూ అనుమతి లేకుండా ఇష్టానుసారం చేపల చెరువుల తవ్వకాలు సాగిపోతున్నాయి. జీవ వైవిధ్యానికి కీలకంగా ఉండే తీరప్రాంతంలోని మడ అడవులు ఆక్రమణ కోరల్లో చిక్కిశల్యమవుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వాటిపై కోర్టు వ్యాజ్యాలు తదితర విషయాలపై కూడా ఆయన సమాచారం రప్పించుకుంటున్నారు. వచ్చి మూడు నెలలు నిండకముందే వీటన్నిటిపై కొత్త కలెక్టర్ దృష్టిపెట్టడం కొందరు అధికారుల్లో కంగారుపుట్టిస్తోంది. గతానికి భిన్నంగా.. గతంలో ఇక్కడ పనిచేసి కలెక్టర్లు సోమవారం ప్రజావాణికి మాత్రమే జిల్లా కేంద్రం మచిలీపట్నం వచ్చి మిగిలిన రోజుల్లో విజయవాడ క్యాంపు ఆఫీసుకు పరిమితమయ్యేవారు. కలెక్టర్ రఘునందనరావు మాత్రం వారంలో కనీసం నాలుగు రోజులు బందరులో ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇటీవల వచ్చిన తుపాను సమయంలో తన చాంబర్‌కే పరిమితం కాకుండా దిగువస్థాయి అధికారులకు సైతం అందుబాటులో ఉండేలా రెండు రోజులపాటు జాయింట్ కలెక్టర్ చాంబర్లో కూర్చుని విధులు నిర్వర్తించారు. క్రమంగా తనదైన తరహాలోనే ప్రతి శాఖ సమాచారం, అధికారుల పనితీరును ఆరా తీసుకుంటూ ఓ కంట కనిపెడుతుండటం వారిలో వణుకు పుట్టిస్తోంది. -
‘హెలెన్’ బీభత్సం
=బందరు వద్ద తీరందాటిన తుపాను =జిల్లాలో ఇద్దరు మృతి =పలుచోట్ల నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు =విద్యుత్ సరఫరాకు అంతరాయం =ఈదురుగాలులకు నేలవాలిన వరిచేలు =24 గంటలపాటు వర్షాలు =తీరందాటే సమయంలో తీవ్రత తగ్గటంతో ఊపిరిపీల్చుకున్న జిల్లావాసులు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : గత మూడు రోజులుగా జిల్లాను వణికిస్తున్న హెలెన్ తుపాను శుక్రవారం మచిలీపట్నం వద్ద మధ్యాహ్నం 1.30 సమయంలో తీరం దాటింది. తుపాను ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి తుపాను తీవ్రత పెరిగింది. గంటకు 120 కిలోమీటర్ల వేగం కన్నా పైగా గాలులు వీయటంతో పాటు వర్షం కురిసింది. ఉదయం 11.30 గంటల సమయంలో నరసాపురం వైపు తుపాను తీరందాటే అవకాశముందని భావించినా.. ఆ తర్వాత దిశ మార్చుకుని మచిలీపట్నం వద్ద తీరం దాటింది. తుపాను తీరానికి చేరే సమయానికి తీవ్రత తగ్గటంతో ఉప్పునీరు గ్రామాల్లోకి చొచ్చుకురాలేదు. దీంతో అధికారులు, తీరప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరిని బలిగొన్న తుపాను... తుపాను కారణంగా బలమైన గాలులు వీయటంతో కొబ్బరిచెట్టు విరిగిపడి కృత్తివెన్ను మండలం శీతనపల్లికి చెందిన గరికిముక్కు కాంతారావు (60), బందరు మండలం వైఎస్సార్‌నగర్‌లో విద్యుత్ స్తంభం విరిగి మీదపడి కారే జగన్నాథం (42) మృతిచెందారు. జగన్నాథం స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ. మంత్రి రఘువీరా సందర్శన... మచిలీపట్నం హిందూ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరాన్ని కలెక్టర్ ఎం.రఘునందనరావుతో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి పరిశీలించారు. పునరావాస శిబిరాల్లో ఖర్చుకు వెనుకాడకుండా సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. భీతావహ వాతావరణం... తుపాను తీరందాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మితిమీరిన వేగంతో వచ్చిన అలలకు గాలి, వర్షం తోడవటంతో సముద్రం సమీపంలో భయానక వాతావరణం నెలకొంది. సముద్రపు అలలు నాలుగు మీటర్ల కన్నా ఎత్తున లేచిపడ్డాయి. మంగినపూడి బీచ్‌లో 700 మీటర్ల మేర సముద్రపునీరు చొచ్చుకువచ్చింది. తుపాను తీరం దాటే సమయంలో తొలుత దక్షిణంవైపు నుంచి అనంతరం దిశ మారి తూర్పువైపు నుంచి బలమైన గాలులు వీచాయి. ఎప్పటికప్పుడు కలెక్టర్ సమీక్ష... తుపాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు కలెక్టర్ ఎం.రఘునందనరావు సమీక్షించి అధికారులకు సూచనలు అందజేశారు. జాయింట్ కలెక్టర్ చాంబర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తుపాను మచిలీపట్నం వద్ద తీరం దాటినట్లు కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. తుపాను ప్రభావంతో 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయన్నారు. ఆరు నుంచి ఏడు గంటలపాటు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. తుపాను ప్రభావిత మండలాల్లో 22 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో 5,358 మందికి పునరావాసం కల్పించినట్లు వివరించారు. వర్షం తగ్గిన తరువాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం అంచనా వేస్తామన్నారు. చిగురుటాకుల్లా వణికిన గ్రామాలు... తుపాను ప్రభావంతో శుక్రవారం 11 గంటల వరకు వాతావరణం ప్రశాంతంగానే కనిపించినా ఆ తర్వాత ఒక్కసారిగా మార్పు కనిపించింది. దక్షిణ దిశ నుంచి వీచిన బలమైన గాలులతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. గాలులతో పాటే వర్షం ప్రారంభం కావటంతో సముద్రతీరంలోని గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. రైతుల ఆశలపై నీళ్లు... హెలెన్ తుపాను రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. కొద్దిరోజుల్లో ధాన్యం ఇంటికి చేరుతుందని ఆశిస్తున్న రైతులకు నిరాశ మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ప్రస్తుతం వరి పంట కోతకు సిద్ధమైంది. నాలుగు గంటల పాటు 120 కిలోమీటర్ల కన్నా వేగంతో గాలులు వీయటంతో అనేకచోట్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలింది. నేలవాలిన వరిపై వర్షం కురవటంతో ధాన్యం మొక్క మొలుస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖాధికారులు సూచించిన విధంగా 24 గంటల పాటు వర్షాలు కురిస్తే నేలవాలిన వరిపైకి వర్షపునీరు చేరి కంకులు మొలకెత్తే ప్రమాదముందని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్ తదితరులు కృత్తివెన్నులో పర్యటించి నేలవాలిన వరిని పరిశీలించారు. పొలంలో ఉన్న నీటిని త్వరితగతిన బయటకు పంపాలని, ధాన్యం మొలకెత్తకుండా ఉప్పునీటి ద్రావణాన్ని కంకులపై పిచికారీ చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం... శుక్రవారం ఉదయం 11 గంటల సమయం నుంచి జిల్లా వ్యాప్తంగా బలమైన గాలులు వీచాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో తీగలు తెగిపడ్డాయి. దీంతో గంటలకొద్దీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖాధికారులు తెగిపోయిన విద్యుత్ వైర్లను సరిచేసే పనిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కొంత ఆలస్యమైనా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. -
పోలీసుల హెచ్చరికల మధ్య ‘రచ్చబండ’
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సమస్యలపై, సమైక్యాంధ్రపై ప్రశ్నించినా, సభలో కార్యక్రమంలో గలాటా సృష్టించాలని చూసినా అరెస్టులు తప్పవంటూ పోలీసులు చేసిన హెచ్చరికల మధ్య జిల్లాలోని గంపలగూడెం, గుడివాడ, చాట్రాయి, ముసునూరు మండలాల్లో బుధవారం రచ్చబండ కార్యక్రమం జరిగింది. గ్రామస్థాయి నుంచి మండల కేంద్రాలకు మారిన రచ్చబండ కార్యక్రమాన్ని మరింత కుదించారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. చాట్రాయి సభకే ముసునూరు మండల లబ్ధిదారులను రప్పించి కార్యక్రమం అయ్యిందనిపించారు. చాట్రాయిలో మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ ఎం.రఘునందనరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. జేఏసీ చాట్రాయి మండల నాయకులు సమైక్యాంధ్ర నినాదాలు చేసి, సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని జేఏసీ నాయకులు విమర్శించారు. దీంతో మంత్రి సారథి రాజకీయాలను చొప్పించి ప్రసంగించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫ్లెక్సీలను చించివేస్తున్నారని, రాష్ట్ర విభజనలో సమన్యాయం చేయాలని చెబుతున్న చంద్రబాబునాయుడిని టీడీపీ నాయకులు ఎందుకు నిలదీయలేకపోతున్నారని ఆపార్టీ చాట్రాయి మండల అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావును మంత్రి ప్రశ్నించారు. చాట్రాయిలో వంద మందికి పైగా పోలీసులు, ఒక డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించడం గమనార్హం. గంపలగూడెం సభలో తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి పాల్గొన్నారు. తడిచిన పత్తిని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైతులు కోరారు. ఎ.కొం డూరు మండలంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుడివాడ మండలంలో జరిగిన రచ్చబండలో ఆర్డీవో ఎస్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించాల్సి ఉండగా సందేశం పేపరు లభ్యంకాక కొంతసేపు గందరగోళం నెలకొంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారని తటివర్రు సర్పంచి కె.రాజారెడ్డి అధికారులను నిలదీశారు. గతంలో గ్రామస్థాయిలో రచ్చబండ జరిగేదని ఇప్పుడు మండల కేంద్రాలకు కుదించి ఏ సమస్యలు పరిష్కరిస్తారని ప్రశ్నిం చారు. సమావేశంలో చాలినన్ని కుర్చీలు లేక పలువురు సర్పంచులు నిలబడే ఉన్నారు. -
అధికార యంత్రాంగం అప్రమత్తం
= 12 మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు = పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ = పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక మచిలీపట్నం, న్యూస్‌లైన్ : భారీ వర్షాల తాకిడి నుంచి ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు కలెక్టర్ ఎం.రఘునందనరావు తెలిపారు. కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో 40,625 ఎకరాల్లో పత్తి, 22,500 ఎకరాల్లో వరి, 1,375 ఎకరాల్లో మొక్కజొన్న, 1,250 ఎకరాల్లో వేరుశనగ, ఐదువేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని చెప్పారు. వర్షాలు మరింతగా కురిస్తే ఈ నష్టం పెరిగే అవకాశముందన్నారు. అల్పపీడనద్రోణి ప్రభావం మరో 48 గంటలపాటు ఉంటుందన్నారు. 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా వర్షం తగ్గిన వెంటనే కనీస చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను గ్రామాల్లో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. కోడూరు, ఘంటసాల, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి, పెడన, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు, మొవ్వ, చల్లపల్లి మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంటే కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు రోగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పీహెచ్‌సీలకు వచ్చే రోగులు ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ కారణంతో వ్యాధిబారిన పడ్డారు తదితర అంశాలను నమోదు చేయాలని సూచించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలను ఎప్పుడూ తెరిచే ఉంచాలని వైద్యశాఖ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో 974 చిన్న బోట్లు ఉండగా వీరంతా సముద్రవేటకు వెళ్లకుండా తగు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో చెవిటికల్లు, వత్సవాయి, ఉప్పుటేరు, కీసరపల్లి తదితర ప్రాంతాల్లో లోతట్టుగా ఉన్న కాజ్‌వేల వద్ద రెవెన్యూ, పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. పలుచోట్ల దెబ్బతిన్న గృహాలు... జిల్లాలో ఆరు గృహాలు పూర్తిగా, నాలుగు గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు కలెక్టర్ వివరించారు. మచిలీపట్నం, గూడూరు, ఘంటసాల, యండకుదురు, బందరు మండలం మేకవానిపాలెంలో లోతట్టు ప్రాంతాల్లో గృహాల్లోకి నీరు చేరాయన్నారు. మచిలీపట్నంలో రెండు పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో 16 మందిని ఉంచినట్లు చెప్పారు. ఈ నీటిని బయటకు పంపేందుకు ఆయిల్ ఇంజన్లను ఉపయోగిస్తున్నామన్నారు. మచిలీపట్నంలో డ్రెయినేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉండటంతో వర్షపునీరు బయటకు పోవటం లేదని, రానున్న రోజుల్లో తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంట నష్టంపై ప్రాథమిక అంచనాలను ప్రభుత్వానికి పంపామని, వర్షం తగ్గగానే పూర్తిస్థాయి వివరాలను ప్రభుత్వానికి అందిస్తామని కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని జిల్లావాసులకు సూచించారు. విజయవాడలో భారీ వర్షాల కారణంగా ఏర్పడ్డ విపత్కర పరిస్థితులను జేసీ ఉషాకుమారి పర్యవేక్షిస్తున్నారన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యబృందాలు వైద్యసేవలు అందిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సీపీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో ఇందిరాదేవి, సూపరింటెండెంట్ రాధిక పాల్గొన్నారు.