కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : కచ్చితమైన ఓటర్ల జాబితాలే ఎన్నికల నిర్వహణకు మూలాధారమని కలెక్టర్ ఎం.రఘునందనరావు అన్నారు. అందుకోసం కచ్చితమైన ఓటర్ల జాబితాలను రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశిం చారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో గురువారం సాయంత్రం 16 శాసనసభ నియోజకవర్గాల ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ పూర్తయ్యేంత వరకు అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు.
ఓటరు నమోదుపై 23వ తేదీ రాత్రి 12 గంటల వరకు వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాలని ఆదేశిం చారు. జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి 83 వేలు ఆన్‌లైన్ ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా రూ.1.18 లక్షల అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులపై శుక్రవారం నుంచి ప్రతి ఏఈఆర్వో ఉదయం 11 గంటల కల్లా కలెక్టరేట్‌కు వివరాలు పంపాల న్నారు. నియోజకవర్గ కేంద్రంలోని తహశీల్దార్లను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించామని, మిగిలిన తహశీల్దార్లకు ఈ వివరాలు తెలిపి, వారి సహకారంతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈఆర్వోలు నియోజకవర్గస్థాయిలో, నియోజకవర్గ కేంద్రం లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. నియోజవర్గ తహశీల్దార్లు నియోజకవర్గంపై ఎన్నికలకు సంబంధించి వివరాలపై అవగాహన ఉండాలన్నారు. తొలుత కలెక్టర్ రఘునందనరావు ఎన్నికల సంఘం ముద్రించిన మాన్యువల్‌లో 13 నుంచి 54వ పేజీలో ఉన్న సారాంశాన్ని అధికారులను చదివించారు.
ఈ మాన్యువల్‌ను ప్రతిఒక్కరూ శ్రద్ధగా చదవాలని సూచించారు. విజయవాడ మునిసిపల్ కమిషనర్ హరికిరణ్, సబ్ కలెక్టర్ దాసరి హరిచందన, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో విజయచందర్, ఉడా వీసీ ఎం.రామారావు, కాంపిటెంట్ అథారిటీ అర్బన్ ల్యాండ్ ఎక్విజేషన్ ప్రత్యేకాధికారి ఎన్.రమేష్‌కుమార్, డీపీవో ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
కచ్చితమైన ఓటర్ల జాబితా తయారు చేయండి
Published Fri, Dec 27 2013 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement
Advertisement