= 12 మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
= పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్
= పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : భారీ వర్షాల తాకిడి నుంచి ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు కలెక్టర్ ఎం.రఘునందనరావు తెలిపారు. కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో 40,625 ఎకరాల్లో పత్తి, 22,500 ఎకరాల్లో వరి, 1,375 ఎకరాల్లో మొక్కజొన్న, 1,250 ఎకరాల్లో వేరుశనగ, ఐదువేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని చెప్పారు.
వర్షాలు మరింతగా కురిస్తే ఈ నష్టం పెరిగే అవకాశముందన్నారు. అల్పపీడనద్రోణి ప్రభావం మరో 48 గంటలపాటు ఉంటుందన్నారు. 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా వర్షం తగ్గిన వెంటనే కనీస చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను గ్రామాల్లో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు.
కోడూరు, ఘంటసాల, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి, పెడన, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు, మొవ్వ, చల్లపల్లి మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంటే కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు రోగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పీహెచ్‌సీలకు వచ్చే రోగులు ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ కారణంతో వ్యాధిబారిన పడ్డారు తదితర అంశాలను నమోదు చేయాలని సూచించినట్లు చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలను ఎప్పుడూ తెరిచే ఉంచాలని వైద్యశాఖ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో 974 చిన్న బోట్లు ఉండగా వీరంతా సముద్రవేటకు వెళ్లకుండా తగు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో చెవిటికల్లు, వత్సవాయి, ఉప్పుటేరు, కీసరపల్లి తదితర ప్రాంతాల్లో లోతట్టుగా ఉన్న కాజ్‌వేల వద్ద రెవెన్యూ, పోలీసు సిబ్బందిని నియమించామన్నారు.
పలుచోట్ల దెబ్బతిన్న గృహాలు...
జిల్లాలో ఆరు గృహాలు పూర్తిగా, నాలుగు గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు కలెక్టర్ వివరించారు. మచిలీపట్నం, గూడూరు, ఘంటసాల, యండకుదురు, బందరు మండలం మేకవానిపాలెంలో లోతట్టు ప్రాంతాల్లో గృహాల్లోకి నీరు చేరాయన్నారు. మచిలీపట్నంలో రెండు పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో 16 మందిని ఉంచినట్లు చెప్పారు. ఈ నీటిని బయటకు పంపేందుకు ఆయిల్ ఇంజన్లను ఉపయోగిస్తున్నామన్నారు. మచిలీపట్నంలో డ్రెయినేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉండటంతో వర్షపునీరు బయటకు పోవటం లేదని, రానున్న రోజుల్లో తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పంట నష్టంపై ప్రాథమిక అంచనాలను ప్రభుత్వానికి పంపామని, వర్షం తగ్గగానే పూర్తిస్థాయి వివరాలను ప్రభుత్వానికి అందిస్తామని కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని జిల్లావాసులకు సూచించారు. విజయవాడలో భారీ వర్షాల కారణంగా ఏర్పడ్డ విపత్కర పరిస్థితులను జేసీ ఉషాకుమారి పర్యవేక్షిస్తున్నారన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యబృందాలు వైద్యసేవలు అందిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సీపీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో ఇందిరాదేవి, సూపరింటెండెంట్ రాధిక పాల్గొన్నారు.