వచ్చిన మూడు నెలల్లోనే...పట్టుబిగిస్తున్న కలెక్టర్
=ఇసుక, చెరువులపై ఆరా
=సుతిమెత్తని కత్తిలా పాలన
=శాఖల వారీగా సమాచారం సేకరణ
=జిల్లా అధికారుల్లో ఇదే హాట్ టాపిక్!
సాక్షి, మచిలీపట్నం : ‘జిల్లాలో కీలకమైన శాఖను చూడాల్సిన మీరు మూడు మండలాలకు ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు చూస్తే ఏం న్యాయం చేస్తారు..’ అంటూ ఒక అధికారికి ఊరడింపు.
‘ఇతర శాఖలో పనిచేసే మీరు రెవెన్యూ శాఖకు చెందిన ఆర్డీవోపై కూడా విచారణ నిర్వహించేలా అవకాశం ఎలా వచ్చింది.. మీ రికార్డు చూస్తే చాలా మంది అధికారులపై మీరే విచారణ అధికారిగా వ్యవహరించారు..’ అంటూ మరో అధికారిపై ఆరా.
‘ఫైళ్లు, కాగితాల్లో మునిగిపోకుండా కాస్తయినా హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచించండి..’ అంటూ ఇంకో అధికారికి సుతిమెత్తని హెచ్చరిక.
‘జిల్లాలో అవినీతిరహితంగా ప్రజలకు సేవలు అందించలేమా.. చిత్తశుద్ధితో పనిచేయండి..’ అంటూ అధికారంతో కూడిన ఆదేశం.
ఇలా వేర్వేరు సందర్భాల్లో కలెక్టర్ ఎం.రఘునందనరావు జిల్లా యంత్రాంగం విషయంలో ముక్కుసూటిగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో బాధ్యతలు చేపట్టి మూడు నెలలు నిండకముందే పాలనా యంత్రాంగంపై ఆయన పట్టు బిగిస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ సునిశితంగా పరిశీలిస్తున్నారు. సీరియస్‌గా స్పందించినట్టు లేకపోయినా సుతిమెత్తని కత్తిలా విషయాన్ని నరుక్కుని పోతున్నారు. దీంతో ఆయన తమకు కొరుకుడుపడటం లేదని పలువురు కీలక అధికారులు తమ సొంత మనుషుల వద్ద మధనపడాల్సిన పరిస్థితి వచ్చింది.
పనిచేయని బిల్డప్‌లు...
కలెక్టర్‌ను బుట్టలో వేసుకుని తమ పని కానిచ్చుకునేందుకు పలువురు అధికారులు చేసిన ప్రయత్నాలు పనిచేయలేదని సమాచారం. జిల్లాలో ఇప్పటివరకు పనిచేసిన కలెక్టర్లు ఒక్కొక్కరు ఒక్కో తీరుతో వ్యవహరించి తక్కువ సమయంలోనే బదిలీ అయ్యారు. దీంతో జిల్లాలోని పలు శాఖల్లో పనిచేసినవారి నీడ ఆయా కలెక్టర్లపై పడటంతో అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఏళ్ల తరబడి ఇదే జిల్లాలో పలు శాఖల ఉన్నతాధికారులుగా ఉన్నవారు కొందరు జిల్లా కలెక్టర్లను తమ దారికి తెచ్చుకుని పబ్బం గడుపుకొనేందుకు ప్రాధాన్యతఇచ్చేవారు.
గతంలో ఇక్కడ పనిచేసిన ఒక కలెక్టర్‌కు మరో కీలక అధికారి రకరకాల మాంసాహారాలు, నోరూరించే వంటకాలతో క్యారేజీ తీసుకెళ్లి మరీ పెట్టి అవన్నీ తానే చేసినట్టు బిల్డప్ ఇచ్చి ఆకట్టుకున్నట్టు ప్రచారం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఒక కలెక్టర్‌కు మరో అధికారి సర్వం తానే అన్నట్టుగా హంగామా చేసుకుని ఆయన పేరు చెప్పుకొని అవకాశం ఉన్నంతమేర ‘పోగేసుకున్నట్టు’ సమాచారం. ఇలాంటి ఎత్తులు కొత్త కలెక్టర్ వద్ద ఎలా వేయాలా అని ఆలోచించే పలువురు అధికారులు ఇప్పుడు కంగారుపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కొత్త కలెక్టర్‌ను బుట్టలో వేసేందుకు అప్పుడే జిల్లాలో పలు శాఖల ఉన్నత అధికారులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్టు విశ్వసనీయ సమాచారం.
ఇసుక, ఆక్వాపై ఆరా..
జిల్లాను పాడికుండగా మలుచుకున్న కొందరు అధికారులు ఇప్పుడు కంగారుపడుతున్నారు. ఇక్కడ ఏమాత్రం హడావుడి చేయకుండానే కాసులు కురిపించే వనరులను పలువురు తమకు అనుకూలంగా మలుచుకుని కాలక్షేపం చేసేవారు. ఈ ఏడాది అక్టోబర్ 14న బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఇక్కడి ఇసుక మాఫియా, ఆక్వా చెరువుల తవ్వకం, భూదందాలు, మడ అడవుల ఆక్రమణలపై ఇప్పటికే ఆరా తీసినట్టు సమాచారం. అనుమతి లేకుండా కాసులు కురిపిస్తున్న ఇసుక తవ్వకాలపై జిల్లా అధికారులు కొందరు చూసీచూడనట్టుగానే వ్యవహరించడంలో పలువురి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయన్నది బహిరంగ రహస్యం.
కొల్లేరు, తీర ప్రాంత మండలాల్లోనూ అనుమతి లేకుండా ఇష్టానుసారం చేపల చెరువుల తవ్వకాలు సాగిపోతున్నాయి. జీవ వైవిధ్యానికి కీలకంగా ఉండే తీరప్రాంతంలోని మడ అడవులు ఆక్రమణ కోరల్లో చిక్కిశల్యమవుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వాటిపై కోర్టు వ్యాజ్యాలు తదితర విషయాలపై కూడా ఆయన సమాచారం రప్పించుకుంటున్నారు. వచ్చి మూడు నెలలు నిండకముందే వీటన్నిటిపై కొత్త కలెక్టర్ దృష్టిపెట్టడం కొందరు అధికారుల్లో కంగారుపుట్టిస్తోంది.
గతానికి భిన్నంగా..
గతంలో ఇక్కడ పనిచేసి కలెక్టర్లు సోమవారం ప్రజావాణికి మాత్రమే జిల్లా కేంద్రం మచిలీపట్నం వచ్చి మిగిలిన రోజుల్లో విజయవాడ క్యాంపు ఆఫీసుకు పరిమితమయ్యేవారు. కలెక్టర్ రఘునందనరావు మాత్రం వారంలో కనీసం నాలుగు రోజులు బందరులో ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇటీవల వచ్చిన తుపాను సమయంలో తన చాంబర్‌కే పరిమితం కాకుండా దిగువస్థాయి అధికారులకు సైతం అందుబాటులో ఉండేలా రెండు రోజులపాటు జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో కూర్చుని విధులు నిర్వర్తించారు. క్రమంగా తనదైన తరహాలోనే ప్రతి శాఖ సమాచారం, అధికారుల పనితీరును ఆరా తీసుకుంటూ ఓ కంట కనిపెడుతుండటం వారిలో వణుకు పుట్టిస్తోంది.