Raccabanda
-
సమరోత్సాహం
అనంతపురం సెంట్రల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దుష్టపాలనపై ప్రజలు నేతలకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రజా సమస్యలను వింటున్న నేతలు రానున్నది వైఎస్సార్ ప్రభుత్వమని.. ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తున్నారు. రెండోరోజు ఆదివారం జిల్లా వ్యాప్తంగా రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు పార్టీ నేతలు నిర్వహించారు. ఇళ్లు, పింఛన్లు, నిరుద్యోగ భృతి రావడం లేదని ప్రజలు ఫిర్యాదు చేశారు. ఉపాధి లేక వలస పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పనులకు పోతే రెండు, మూడు నెలలకు కూడా బిల్లులు మంజూరు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. ► అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని రుద్రంపేట పంచాయతీ ఎస్సీ కాలనీలో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డితో జనం తన బాధలు చెప్పుకున్నారు. కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని, డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని వివరించారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త నదీం అహ్మద్, నగర అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డిలు హాజరయ్యారు. ► పెనుకొండ మండలం అడదాకులపల్లి పంచాయతీలోని జాలిపల్లితండాలో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు శంకర్‌నారాయణతో తండా ప్రజలు తమ సమస్యలు చొప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల సమస్యలన్నీ విన్న శంకర్‌నారాయణ..సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని భరోసా ఇచ్చారు. సమస్యలన్నింటినీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ► ఆత్మకూరు మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీలో రాప్తాడు మండలం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు విన్న ఆయన పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లపట్టాలు, భూమిలేని వారికి భూమి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ► నల్లచెరువు మండలం ఉబిచెర్ల ఎస్పీకాలనీలో కదిరి నియోజకవర్గ సమన్వకర్త పీవీ సిద్దారెడ్డి పల్లె నిద్ర చేశారు. అంతకుముందు ఉబిచెర్ల పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇంటిఇంటికీ తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దళితవాడలో పల్లెనిద్ర చేశారు. వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. ► తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త పెద్దారెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు సమస్యలను ఏకరవు పెట్టారు. ► ధర్మవరం మండలం ఓబుళనాయునిపల్లిలోని దళితవాడలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాసమస్యలను ఆలకించిన అనంతరం పల్లెనిద్ర చేశారు. ► బ్రహ్మసమద్రం మండలం బొమ్మగానిపల్లితండాలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వకర్త ఉషాశ్రీచరణ్ ప్రజల సమస్యలను ఆలకించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ► రొళ్ల మండలం వన్నారణపల్లి ఎస్సీకాలనీలో మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ► పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడీసీ మండలం నల్లగుట్లపల్లిలో జరిగిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. -
నూతనోత్తేజం
అనంతపురం అగ్రికల్చర్: వినతులు స్వీకరిస్తూ.. భరోసా కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు చేపట్టారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా.. ప్రధానంగా ఎస్సీ కాలనీల్లో రచ్చబండ, పల్లెనిద్రతో పార్టీ నేతలు ప్రజలతో మమేకమయ్యారు. రాయదుర్గం, తాడిపత్రి, హిందూపురం, కదిరి మినహా తక్కిన 10 నియోజకవర్గాల పరిధిలో కార్యక్రమాలు చేపట్టారు. రైతులు, పొదుపు రుణాల మాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ పరిహారంలో అవకతవకలు.. పింఛన్లు, ఇళ్ల నిర్మాణం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, మురికి కాలువలు ఇతరత్రా సమస్యలను ప్రజలు ఏకరువు పెట్టారు. ♦ బీసీ, ఎస్సీ కాలనీల దుస్థితి, పేద వర్గాల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని నాయకులు పిలుపునిచ్చారు. ♦ కూడేరు మండలం కరుట్లపల్లి ఎస్సీ కాలనీలో జరిగిన పల్లెనిద్రలో ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ నిర్మల, విడపనకల్ జెడ్పీటీసీ తిప్పయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, మండల కన్వీనర్ రాజశేఖర్ తదితరులు హాజరై ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే విశ్వ మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కల సాకారం చేయడానికి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాగునీటి, సాగునీటితో జిల్లాను సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తామన్నారు. ♦కళ్యాణదుర్గం మండలం గోళ్ల పంచాయతీ శీబావి గ్రామం ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండలో అనంతపురం పార్లమెంటు నియోజక వర్గ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలు సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, హంద్రీ–నీవాకు 40 టీఎంసీల నుంచి 60 టీఎంసీలకు పెంచి రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజక వర్గాల పరిధిలో అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వడంతో పాటు ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. ఎస్సీ కాలనీ ముత్యాలమ్మ దేవాలయం వద్ద పల్లెనిద్ర చేశారు. ♦ పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో జరిగిన రచ్చబండలో హిందూపురం పార్లమెంటు నియోజక వర్గ అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ, మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి హాజరై ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ, రైతులు, మహిళలు, ఇతరత్రా అన్ని వర్గాలను సీఎం చంద్రబాబు దారుణంగా వంచిస్తూ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. బత్తలపల్లి మండలం గుమ్మనకుంట ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండలో ధర్మవరం నియోజక వర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎంపీపీ కోటిబాబు, మండల కన్వీనర్ బయపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ♦ చెన్నేకొత్తపల్లి మండల కేంద్రం ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండలో రాప్తాడు నియోజక వర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్ర కాష్‌రెడ్డి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగి రెడ్డి, మండల కన్వీనర్ మైలారపు గోవిందరెడ్డి తదితరులు పా ల్గొన్నారు. నరసింహస్వామి దేవాలయం వద్ద పల్లెనిద్ర చేశారు. ♦ పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో జరిగిన రచ్చబండలో శింగనమల నియోజక వర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, జెడ్పీటీసీ నల్లమ్మ, మండల కన్వీనర్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి సమస్యలు స్వీకరించి వైఎస్ జగన్ సీఎం కాగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ♦అనంతపురం రూరల్ మండలం నాగిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండలో అనంత అర్బన్ నియోజక వర్గ సమన్వయకర్త నదీంఅహ్మద్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి, మాజీ మే యర్ రాగే పరశురాం, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర కొనసాగించారు. ♦ అమరాపురం మండలం కే.శివరం గ్రామం ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండ, పల్లెనిద్రలో మడకశిర నియోజక వర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం.తిప్పేస్వామి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే పల్లెనిద్ర చేశారు. ♦గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, సర్పంచ్ తిక్కయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జింకల రామాంజినేయులు, పామిడి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ♦ ప్రజా సమస్యలు స్వీకరించిన తర్వాత ఎస్సీ కాలనీ సుంకులమ్మ దేవాలయం వద్ద పల్లెనిద్ర చేశారు. ♦ ఓడీసీ మండలంటి.కుంట్లపల్లిలో జరిగిన రచ్చబండ, పల్లెనిద్రలో పుట్టపర్తి నియోజక వర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి హాజరై ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
ఊరికి దూరంగా ఉంటేనే ‘ఉచితం’!
=ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బిల్లులపై సర్కారు ఆంక్షలు =అధికారుల ఖాతాల్లో మూలుగుతున్న రూ.31.35 కోట్లు వరంగల్, న్యూస్‌లైన్ : 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న ఎస్టీ, ఎస్సీ వర్గాల బిల్లులు ఇచ్చేందుకు ప్రభుత్వం రోజుకో తరహాలో వ్యవహరిస్తోంది. మొదట్లో.. నేరుగా ఇవ్వవద్దని, ఆన్లైన్ నుంచి తీసుకోవాలంటూ డిస్కంకు సూచించింది. అంతేకాకుండా ప్రతీ వినియోగదారుడి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత రచ్చబండ సభల్లో ఇస్తామని, ఐటీడీఏకు జాబితా ఇవ్వాలని, మండలం, గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను తీసుకుంది. రచ్చబండ సభల్లో ఆ పేర్లను ప్రకటించినా... బిల్లు మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేసిన జాబితాను గ్రామస్థాయిలో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది ధ్రువీకరించాలంటూ ప్రభుత్వం మరో ఆంక్ష పెట్టింది. ఈ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తవుతున్న సమయంలో ‘కాలనీ’ నిబంధనలు విధించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలు దళిత కాలనీ, గిరిజన తండాల్లో నివసిస్తేనే ఉచిత కరెంట్‌కు అర్హులంటూ ఉత్తర్వులిచ్చింది. ఇతర వర్గాల సముదాయంలో నివసించే వారికి ఉచితం వర్తించదని తేల్చింది. కేవలం కాలనీల్లో నివసించే వారికి మాత్రమే ఉచిత విద్యుత్ అనడంతో ఇప్పుడు ఆ బిల్లులు సగానికి తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాకుండా 2007 నుంచి విద్యుత్‌ను వినియోగిస్తున్న ఈ వర్గాలు ఇప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలంటూ కొత్తగా ఆదేశాలిచ్చింది. ఆ సర్టిఫికెట్లను పరిశీలించి, వాటిని విద్యుత్ అధికారులు తీసుకుని వాటిని ప్రభుత్వానికి అర్హుల జాబితాతో కలిపి నివేదించాలి. అప్పుడు బిల్లులు జారీ చేస్తామంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మళ్లీ ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మరో నాలుగు నెలలు గడుస్తుందని విద్యుత్ శాఖ భావిస్తోంది. రూ.కోట్లకు చేరిన పెండింగ్ బిల్లులు జిల్లా వ్యాప్తంగా ఎస్సీ వర్గాలకు చెందిన కనెక్షన్లు 92 వేలు, ఎస్టీలవి 76వేలు ఉన్నాయి. వీటిలో 50 యూనిట్ల పరిధిలో విద్యుత్ వినియోగించిన వారి లెక్క తేల్చారు. 47734 ఎస్సీ, 29918 ఎస్టీ వర్గాలకు చెందిన కనెక్షన్లకు ఉచిత విద్యుత్ వర్తింస్తుందని తేలింది. 2007 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ వర్గాల కనెక్షన్లపై రూ.25.87 కోట్లు, ఎస్టీల కనెక్షన్లపై రూ.19.35 కోట్లు ప్రభుత్వం డిస్కంకు బాకీ పడింది. వీటిలో ప్రభుత్వం ఎస్సీ కనెక్షన్లపై రూ.12 కోట్లు, ఎస్టీలకు రూ.19.35 కోట్లు నాలుగు నెలల కిందటే విడుదల చేసి సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డెరైక్టర్ల ఖాతాల్లో వేసింది. అరుుతే కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తిచేయడానికి నాలుగు నెలలు సమయం పడుతుందని విద్యుత్ శాఖ చెబుతున్నందున అప్పటి వరకు ఆ సొమ్ము బ్యాంకులోనే మూలుగాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
అభివృద్ధి, సంక్షేమంపై విస్తృత ప్రచారం
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పేద, బలహీనవర్గాల వారికి అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ప్రచార రథాలు, కళాజాతాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు కేటాయించిన ప్రచార రథాలను, జిల్లా పౌర సంబంధాల అధికారికి కేటాయించిన నూతన వాహనాన్ని మంగళవారం స్థానిక స్టేట్ గెస్ట్‌హౌస్ వద్ద ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడ అమలు చేస్తూ దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు రచ్చబండ, ప్రజాపథం కార్యక్రమాలు దోహదపడ్డాయన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రచార రథాన్ని కేటాయించి శిక్షణ ఇచ్చిన కళాకారులతో ప్రజలకు పథకాల గురించి వివరిస్తున్నట్లు మంత్రి చెప్పారు. జిల్లాలో 16 నియోజకవర్గాలలో ప్రచార రథాల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి కె.సదారావు, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ కె.శివశంకరరావు, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, డివిజినల్ పీఆర్ఓ ఎస్వీ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
రచ్చబండ రసాభాస
=సమస్యలు విన్నాకనే మాట్లాడాలని ప్రజల పట్టు =సమైక్య ద్రోహి చింతా అంటూ నినాదాలు =ప్రజల సమస్యలు వినకుండానే వెనుదిరిగిన ఎంపీ =కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ధర్నా =ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుల అరెస్టు తిరుపతి కార్పొరేషన్ , న్యూస్‌లైన్: తిరుపతిలో గురువారం నిర్వహించిన 3వ విడత రచ్చబండ రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగిసింది. కార్పొరేషన్ పరిధిలోని 36 రెవెన్యూ వార్డుల్లోని ప్రజలకు నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం 2గంటలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహనిర్మాణాలు, ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు విద్యుత్ బకాయిల చెల్లింపులు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే ఇవేమీ పంపిణీ చేయలేదు. గంటల తరబడి వేచివున్న లబ్ధిదారులు, ప్రజల సమస్యలను వినకుండానే 8 నిమిషాల్లోనే రచ్చబండను అర్ధాంతరంగా ముగించారు. మధ్యాహ్నం 2.40 గంటలకు ఎంపీ చింతా మోహన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వేదికపై కొచ్చారు. తొలుత కార్పొరేషన్ కమిషనర్ సకలారెడ్డి రచ్చబండ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం ఎంపీ చింతామోహన్ మాట్లాడతారని చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపునేని మురళీ అడ్డుకున్నారు. ముందు ప్రజల సమస్యలు వినాలని, ఆపై ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం నిత్యం వార్డుల్లో తిరుగుతున్న ఎమ్మెల్యే కరుణాకర రెడ్డిని మాట్లాడించాలని పట్టుబట్టారు. ఇంతలో వేదిక ముందు ఉన్న సభలోంచి మహిళలు లేచి ‘‘సమైక్యాంధ్ర ద్రోహి ఎంపీ డౌన్‌డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. 100 రోజులకు పైగా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంటే ముఖం చాటేసిన ఎంపీ చింతా ఇప్పుడు ఏమొహం పెట్టుకుని వచ్చారంటూ వేదికపైకి దూసుకొచ్చారు. ‘‘ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా, రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న మిమ్మల్ని రచ్చబండ పెట్టమని మేము అడిగామా’’ అంటూ నిలదీశారు. ఇంతలో పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీదేవి వేదికపై ఏర్పాటు చేసిన టేబుల్‌పైకి ఎక్కి ఎంపీకి మద్దతుగా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు వారిపై తిరగబడ్డారు. ఒకరిని ఒకరు తోసుకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజల మధ్యలోంచి నీళ్లబాటిళ్లు వేదికపైకి దూసుకొచ్చాయి. ప్రజల వ్యతిరేకతను గమనించిన ఎంపీ చింతా తన అనుచరులతో కలసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారమంతా ఎనిమిది నిముషాల్లో జరిగిపోయింది. అయితే రచ్చబండను కొనసాగించాలంటూ ఎమ్మెల్యే కార్పొరేషన్ కార్యాలయం ముందు 20 నిమిషాల పాటు ధర్నాకు దిగారు. అనంతరం కార్యాలయం వెలుపల నడిరోడ్డుపై ఎండలో పడుకుని నిరసనకు దిగారు. అర్ధగంట పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఈస్ట్ డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సీఐ గిరిధర్ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డిని అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా ఎంపీపై బాటిల్ విసిరారనే ఆరోపణతో నాయకులు రాజేంద్ర, రమణమ్మను అరెస్టు చేశారు. రచ్చబండ కాదు .. గుదిబండ - మీడియాతో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ పేరుతో ప్రజల నెత్తిన గుదిబండ మోపుతోందని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. గురువారం రచ్చబండ రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగియడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. గుక్కెడు నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం అడుగడుగునా బ్రాంది షాపులను ఏర్పాటు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి అభివృద్ధికి రూ.450 కోట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఆఖరికి 450 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. ఇది రచ్చబండ కాదని కిరణ్‌కుమార్‌రెడ్డి మనపై వేయాలని చూస్తున్న గుదిబండ అన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన రచ్చబండ లక్ష్యాన్ని ఈప్రభుత్వం నీరుగారుస్తోందని చెప్పారు. ఇదివరకు నిర్వహించిన 1, 2 రచ్చబండల్లో ఇచ్చిన అర్జీలకే దిక్కులేకుంటే ఇప్పుడు ఏమొహం పెట్టుకుని రచ్చబండ నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎమ్మెల్యేగా తాను వేదికపై ఉన్నప్పటికీ అధికారులు ఎలా వెళ్తారని మండిపడ్డారు. అనంతరం రచ్చబండకు వచ్చి బయట వేచివున్న మహిళలతో మాట్లాడారు. వారి సమస్యలను ఆలకించారు. హౌసింగ్ డీఈ బాలకృష్ణారెడ్డి, అర్బన్ తహశీల్దార్ నాగార్జునరెడ్డిని అర్జీలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎస్కె బాబు, షఫీఅహ్మద్ ఖాదరీ, రాజేంద్ర, బొమ్మగుంట రవి, కట్టా గోపీయాదవ్, రాయపునేని మురళి, అమరనాథ్‌రెడ్డి, ఇమాం, రాజేంద్రరెడ్డి, కొమ్ము చెంచయ్య యాదవ్, వెంకటేశ్‌రెడ్డి, కుసుమ, పునీత, మునీశ్వరి, రమణమ్మ, లతారెడ్డి, గీత, పుష్పాచౌదరి పాల్గొన్నారు. -
రచ్చబండ నిర్వహణకు చాలీచాలని కేటాయింపులు
=రచ్చబండ నిర్వహణకు చాలీచాలని కేటాయింపులు =సమకూర్చడానికి నానా తంటాలు =ప్రకటించిన రూ.70 వేలూ ఇవ్వని దుస్థితి సాక్షి, విశాఖపట్నం : రచ్చబండ కార్యక్రమం గతంలో పంచాయతీకోచోట నిర్వహించే వారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్కడ నిరసనలు వ్యక్తమవుతాయోనన్న భయంతో ఈసారి మండల కేంద్రాలకు ప్రభుత్వం పరిమితం చేసింది. దీని నిర్వహణకు రూ.70వేలు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తం ఏ కోశాన సరిపోదు. ఒక్కో మండలంలో 30పంచాయతీలు ఉన్నాయి. కార్యక్రమానికి ఆసక్తి చూపే వారిని, ఇళ్లు, పింఛను, రేషన్‌కార్డుల లబ్ధిదారుల్ని అధికారులే మండల కేంద్రానికి తీసుకురావాలి. ఇందుకు ప్రతి గ్రామానికి వాహనం సమకూర్చాలి. వచ్చే వారికి విధిగా మంచినీటి ప్యాకెట్లు, ఇతరత్రా ఆహారం సరఫరా చేయాలి. ఇక రచ్చబండకు ప్రత్యేకంగా వేదిక, అలంకరణ, బ్యాక్‌డ్రాప్ ప్లెక్సీలు, మైక్ సిస్టమ్ ఏర్పాటు తప్పదు. లబ్ధిదారులకు పథకాల పంపిణీకి ఒక్కో పంచాయతీకి మూడేసి కౌంటర్లు(ఇళ్లు, పింఛను, రేషన్‌కార్డు) ఏర్పాటు చేయాలి. వీటికి షామియానాలు, ఫర్నీచర్ సమకూర్చాల్సి వస్తోంది. ఒకవేళ ఒక పంచాయతీలో 150మందికి మించి లబ్ధిదారులంటే ఒక్కో అంశానికి రెండేసి కౌంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వమిచ్చే రూ.70వేలు ఎటూ సరిపోదు. ఒక్కో మండలానికి సరాసరి 1.5 లక్షలుపైనే ఖర్చవుతోంది. ఇక ముఖ్యమంత్రి, మంత్రులు హాజరయ్యే కార్యక్రమానికైతే మరిన్ని హంగులు సమకూర్చడంతో ఆ వ్యయం మరింత పెరిగి పోతుంది. కొన్ని మండలాల్లో ఎమ్మెల్యేల సొంత ప్రయోజనాల కోసం ఐదారు పంచాయతీలకోచోట రచ్చబండ నిర్వహించాలని మండల అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులకు మరింత చేతిచమురు వదులుతోంది. పోనీ ప్రభుత్వం ప్రకటించిన రూ.70వేలు అయినా ఇచ్చిందంటే ఇంతవరకు అదీ లేదు. ముందు నిర్వహించండి, ఆ తర్వాత ఇస్తామంటూ చేతులు దులుపుకుంది. దీంతో కొందరు మండల స్థాయి అధికారులు పక్కదారి పట్టి చేతులు చాపుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. మరికొందరు తలా ఇంత అని వేసుకుని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో రచ్చబండకు జనాల్ని తీసుకురావడమే కష్టమవుతుందనుకుంటే ఈ నిర్వహణ భారమేమిటని కొందరు అధికారులు వాపోతున్నారు. -
రచ్చబండ.. ప్రచారమే అజెండా!
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రచ్చబండ రాజకీయం అవుతోంది. అంతా అధికార పార్టీ మార్కుతోనే జరుగుతోంది. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేక కాంగ్రెస్ పార్టీ సమావేశమా? అన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొంటోంది. వాస్తవానికి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల నుంచి తేదీలు తీసుకోవాలని సూచించినప్పటికీ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నచోట అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే తేదీలు నిర్ణయిస్తున్నారు. రెండేళ్లుగా ప్రజల సంక్షేమం పట్టని సర్కారు.. ఎన్నికల వేళ ప్రజల్లో కాంగ్రెస్ మార్కుకోసం రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా ఉన్నప్పటికీ జిల్లాలో రచ్చబండ జరుగుతున్న తీరు విమర్శలపాలవుతోంది. ప్రజల సమస్యలను విన్నవించేందుకు రచ్చబండకు వెళ్తున్న నాయకులను సైతం అడ్డుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. వాస్తవానికి గ్రామీణప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు.అయితే ప్రస్తుత పాలకులు ఆ కార్యక్రమాన్ని ప్రజా సమస్యల కంటే పార్టీ ప్రచారానికి వేదికలుగా మల్చుకుంటున్నారు. కమిటీ సభ్యులతోపాటూ అంతా అధికార పార్టీ నేతల సూచనల మేరకే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతోంది. వేదికలను సైతం అధికార పార్టీ నేతలు తమ ప్రచారానికి, రాజకీయ ప్రసంగాలకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న చోట సైతం వారికి తెలియకుండానే రచ్చబండ తేదీలు నిర్ణయించడం గమనార్హం. విజయనగరంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పూసపాటి అశోక్‌గజపతిరాజు ప్రమేయం లేకుండానే తేదీలు ప్రకటించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రచ్చబండ సభల్లో కొంతమందికి మాత్రమే రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసి చేతులు దులుపుకొంటున్నారు. కనీసం సామాజిక సమస్యలపైనైనా దృష్టి సారించకపోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 8 మండలాల్లో రచ్చబండ పూర్తి.. జిల్లాలో ఈ నెల 11 నుంచి ప్రారంభమైన రచ్చబండ సాలూరు మున్సిపాలిటీతోపాటు, ఎనిమిది మండలాల్లో పూర్తయింది. 114 గ్రామ పంచాయతీలతోపాటు 29 వార్డుల్లో ర చ్చబండ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పూర్తయిన వాటిలో గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, రామభద్రపురం, కొమరాడ, జియ్యమ్మవలస, పార్వతీపురం, మక్కువ, నెల్లిమర్ల మండలాలు ఉన్నాయి. వేలాది వినతులు.. రచ్చబండ కార్యక్రమాల్లో పలు సమస్యల పరిష్కారం కోరుతూ వే లాది వినతులు అందాయి. కొత్తగా రేషన్ కార్డుల కోసం 7,348 దరఖాస్తులు, పింఛన్ల కోసం 5,378, ఇళ్ల కోసం 6,630 దరఖాస్తులు అందాయి. అయితే ఈ వినతుల పరిష్కారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు మాసాల్లోపు సాధారణ ఎన్నికలు వస్తున్న వేళ.. ప్రస్తుతం ఇస్తున్న దరఖాస్తులకు మోక్షం లభిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమం ఎటువంటి ప్రాధాన్యతా లేకుండా ప్రచారమే అజెండాగా జరుగుతోంది. కొంతమంది లబ్ధిదారులను తీసుకొచ్చి ‘మమా’ అనిపించేస్తున్నారు. -
జిల్లాలో ముగిసిన సీఎం పర్యటన
సాక్షి, రాజమండ్రి : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన ఆదివారంతో ముగిసింది. ఉదయం 10.35 గంటలకు మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయం నుంచి జెట్ ఎయిర్వేస్ విమానంలో ఆయన హైదరాబాద్ వెళ్లారు. రాజమండ్రిలో శనివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాత్రి అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్ కుమారుల వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆయన స్థానిక నేతలను కలుసుకున్నారు. అతిథిగృహ సమావేశ మందిరంలో వివిధ సంఘాల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కానరాని కార్యకర్తలు ముఖ్యమంత్రి తమ ఊరు వస్తారంటే క్యాడర్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి బస వద్ద అటువంటి ఛాయలు కనిపించలేదు. స్వాగత సత్కారాల నుంచి వీడ్కోలు వరకూ ఎక్కడా పార్టీ జెండాలు కనిపించలేదు. రచ్చబండలో తమ వర్గాల వారికి అన్యాయం జరుగుతోందని, అనుయాయులకు రేషన్ కార్డులు, పింఛన్లు దక్కడం లేదన్న అసంతృప్తితో డివిజన్లలో క్యాడర్ సీఎం పర్యటనలో పాల్గొనలేదని నేతలే చెప్పారు. దీనికి తోడు ఎమ్మెల్యే రౌతు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం వర్గాలకు మధ్యన ఉన్న విబేధాలు సీఎం పర్యటనలో కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఏసీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత ఏసీవై రెడ్డి కుటుంబాన్ని ముఖ్య మంత్రి పరామర్శించారు. 10.00 గంటలకు ఆర్ట్ కళాశాల ఎదురు వీధిలో ఉన్న ఏసీవై ఇంటికి చేరుకుని ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. మంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. వినతులందించేందుకు క్యూ ముఖ్యమంత్రికి తమ తమ విజ్ఞాపనలు అందించేందుకు ఉద్యోగ, ప్రజా సంఘాల వారు బారులు తీరారు. సమావేశ మందిరంలో సీంఎ వారందరి నుంచీ కాగితాలు తీసుకుని రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీతలకు అందచేశారు. బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ముఖ్య మంత్రిని కోరుతూ వినతి పత్రం అందజేసింది. తల్లిదండ్రులు, వయో వృద్ధుల పోషణ చట్టం ఆమలులోకి తెచ్చేందుకు కృషి చేయాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. హెల్త్ కార్డుల కోసం ఐక్య ఉపాధ్యాయ కార్యాచరణ సమితి వినతి ఇచ్చింది. రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభించాలని విద్యార్థులు కోరారు. ఏబీసీడీ విభజనకు అనుకూలంగా చర్యలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. ట్రెజరీ ద్వారా జీతాలివ్వాలి కోటగుమ్మం : జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు ఓఐఓ పద్దు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గట్టి రామారావు ఆధ్వర్యంలో సంఘ నాయకులు కోరారు. జీతాలు, పెన్షన్లు ఓఐఓ పద్దుద్వారా చెల్లించాలని వినతిపత్రం సమర్పించారు. సంఘం గౌరవ అధ్యక్షుడు మారిశెట్టి సత్యనారాయణ, సంఘం సంయుక్త కార్యదర్శి నల్లమిలి రామ కోటేశ్వరరావు, కె సత్యనారాయణ ఆయన వెంట ఉన్నారు. ఇంకా సఘాయి వాలాలు, ఛాంబర్ ఆఫ్‌కామర్స్, నూర్బాష్ ముస్లిం మైనారిటీ సంఘం, అల్యూమినియం అసోసియేషన్, బొమ్మూరు డైట్ కళాశాల, యూటీఎఫ్, రాజమండ్రి నాయీ బ్రాహ్మణ సంఘం, రాజమండ్రి కార్పొరేషన్ రచ్చబండ కమిటీ, ఏపీఎన్జీఓ తదితర సంఘాల ప్రతినిధులుసీఎంను కలిసిన వారిలో ఉన్నారు. మంత్రులు పితాని సత్యనారాయణ, తోట నరసింహం, కాసు కృష్ణారెడ్డి, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఎమ్మెల్సీ చైతన్య రాజు, ఎమ్మెల్యే శేషారెడ్డి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం తదితరులు సీఎం వెంట ఉన్నారు. -
మమ అనిపిస్తున్నారు..
=తూతూమంత్రంగా ‘రచ్చబండ’ సభలు =లబ్ధిదారుల చేతికందని పింఛన్లు, రేషన్ కూపన్లు =స్థానిక సమస్యలపై వినతుల వెల్లువ =ప్రచారం తప్ప ఒరిగిందేమీ లేదంటున్న విపక్ష నేతలు సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి మినహా రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఒనగూరే ప్రయోజనమేమీ లేదని పలువురు ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. శనివారం నగరంలోని నాలుగుప్రాంతాల్లో మూడోవిడత రచ్చబండ కార్యక్రమాలు తూతూమంత్రంగా జరిగాయి. గత కార్యక్రమాల్లో స్వీకరించిన దరఖాస్తులకు లబ్ధిదారులకు తాజా రచ్చబండలో పెన్షన్లు, రేషన్ కార్డులిస్తామని చెప్పిన అధికారులు కొద్దిమందికి మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ఎంతో ఆశగా వచ్చిన పలువురు లబ్ధిదారులు ఒట్టి చేతులతో నిరాశగా వెనుదిరిగారు. చంచల్‌గూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన రచ్చబండ కార్యక్రమాన్ని టీడీపీ కార్పొరేటర్లు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి,అస్లాంలు అడ్డుకున్నారు. గత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంతమందికి అర్హులకు లబ్ధిచేకూరిందో వివరాలు తెలపాలని అధికారులను,ఎమ్మెల్యేను నిలదీయడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సోమాజిగూడలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పలువురు స్థానికులు మాట్లాడుతూ..గతంలో జరిగిన రచ్చబండలో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఇప్పటివరకు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి దానం నాగేందర్ డుమ్మా కొట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెస్ట్‌మారేడుపల్లి నెహ్రూనగర్ కమ్యూనిటీహాల్లో జరిగిన కార్యక్రమాన్ని కేవలం అరగంటలో ముగించి ఎమ్మెల్యే శంకర్రావు వెళ్లిపోయారు. నేతలు ఏమన్నారంటే.. కాచిగూడలోని ఏకేభవన్లో నిర్వహించిన రచ్చబండలో పాల్గొన్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్లపై చెత్త పేరుకుపోయి దుర్వాన వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ సంక్రమంగా జరగడం లేదని..దీంతో వృద్ధులు, వికలాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. పెన్షన్ అక్రమాలపై అధికారులు స్పందించి బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సలీంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రచ్చబండ వల్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారేకానీ ప్రజలకు ఒరిగిందే మీ లేదన్నారు. రచ్చబండ..ముఖ్యమంత్రి ప్రచారానికే పరిమితమైందని జీహెచ్ఎంసీ టీడీపీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రజలకు ఇళ్లను కేటాయించపోవడం సరికాదన్నారు. గత రచ్చబండలో తీసుకున్న దరఖాస్తులను అధికారులు బుట్టదాఖలు చేశారన్నారు. -
లక్ష్యానికి దూరంగా..
సాక్షి, విజయవాడ : ప్రజల వద్దకు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమం దారితప్పింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చిల్లకల్లు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్న రచ్చబండ ముఖ్యమంత్రిని వీరుడు, శూరుడు అని పొగడటానికే సరిపోయింది. వేదికపై పాల్గొన్న వారందరూ రాజకీయ ఉపన్యాసాలతో ఊదరగొట్టారు. ప్రజా సమస్యలను స్థానిక శాసనసభ్యుడు, సర్పంచ్ ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి వాటిపై మొక్కుబడిగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, జగ్గయ్యపేటకు కృష్ణాజలాలు తేవడానికి నిధులు ఇస్తామంటూ ముగించారు. రైతు వెతలపై ప్రస్తావనే లేదు... జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతన్న వెన్ను విరిగింది. పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వీటిపై కనీస ప్రస్తావన కూడా చేయకపోవడం విమర్శలకు దారితీసింది. స్థానిక శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ పోలంపల్లి ప్రాజెక్టు పైభాగంలో ఖమ్మం జిల్లాలో పందిళ్లపల్లి వద్ద డ్యామ్ నిర్మాణం అక్రమంగా జరుగుతుందని, దాన్ని అడ్డుకోవాలని కోరినా సీఎం స్పందించలేదు. సీఎం తన ప్రసంగంలో ఎక్కువ భాగం రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాల గురించే ప్రస్తావించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఇరు ప్రాంతాలకు మధ్య ఉన్నాయని, వాటిని ఎలా విడగొడతారని ప్రశ్నలు సంధించారు. తాను సమైక్యవాదం కోసం ప్రయత్నం చేస్తున్నానని, అవసరమైనపుడు మీ మద్దతు కావాలంటూ పరోక్షంగా కొత్త పార్టీ పెడతానన్న సంకేతాలు ఇచ్చారు. కిరణ్‌పై నేతల పొగడ్తల వర్షం... సభలో కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం కిరణ్‌ను పొగిడేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ప్రజాబలంతో ముందుకు నడిచేలా ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ కోరారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన ప్రసంగం అంతా సినిమా డైలాగులతో చేశారు. ‘సమైక్యం ఆరిపోయే దీపం కాదు.. రగిలే జ్వాల’ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినరని, ప్రస్తుతం సమైక్యానికి కట్టుబడి ఉన్నందున దూకుడుతో పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడుతున్నారంటూ పొగడ్తలతో ముంచేశారు. గజల్స్ గాయకుడు శ్రీనివాస్ సమైక్య సింహానికి నిలబడి చప్పట్లతో ఆహ్వానించాలంటూ హడావిడి చేసి హీరోగా చూపే ప్రయత్నం చేశారు. మొత్తానికి రచ్చబండ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా కిరణ్‌కుమార్‌ను పొగిడే కార్యక్రమంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. రెండు గంటలు ఆలస్యంగా... ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడం, జనం రాకపోవడంతో రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాన్ని పోగు చేసేందుకు కాంగ్రెస్ నేతలు, అధికారులు తంటాలు పడ్డారు. సీఎం సభకు వస్తే సమైక్యవాదానికి మద్దతు ఇచ్చినట్లేనని పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచారం చేశారు. సభకు వచ్చిన వారి నుంచి దరఖాస్తులను ముఖ్యమంత్రి ప్రసంగం అయ్యే వరకు తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విద్యార్థినుల కుటుంబాలను ఆదుకుంటాం... విజయవాడ : రామవరప్పాడు రింగ్ వద్ద ఈ నెల ఏడున జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం చెందిన బీటెక్ విద్యార్థినుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరలోనే ముగ్గురు విద్యార్థినుల కుటుంబాలకు తన సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా మంజూరయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. నున్నకు చెందిన దాసరి చందుశ్రీ తండ్రి కామేశ్వరరావు సీఎంని జగ్గయ్యపేటలో కలవగా ఆయన పైవిధంగా స్పందించారు. -
రాజకీయ రచ్చ
=సమైక్యవాదాన్ని దెబ్బతీసే ఎత్తుగడ =ప్రజలకు సంక్షేమ పథకాల ఎర =రొటీన్ పనులనే చేస్తున్న వైనం =ఉనికికోసం కాంగ్రెస్ నేతల తాపత్రయం =నేడు చిల్లకల్లులో సీఎం రచ్చబండ ఆకస్మికంగా ఏదో ఒక ఊరుకు వెళ్లి అక్కడి ప్రజలతో మమేకమై.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసి.. వారికేం కావాలో అడిగి.. ప్రత్యేకంగా నిధులిచ్చి.. అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టాలనేది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన రచ్చబండ లక్ష్యం. ప్రభుత్వ యంత్రాంగం పాలనాపరంగా జిల్లాలో రోజువారీ.. రొటీన్‌గా చేసే పనులనే రచ్చబండలో చేయడం.. పింఛన్, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు వంటి వాటిని రచ్చబండ సభల్లో మంజూరుచేయడం.. ఎప్పుడో దరఖాస్తు చేసినవారు రచ్చబండ నిర్వహించే వరకు పడిగాపులు కాయడం.. ఇలా రచ్చబండకు రాజకీయ రంగు పులిమి ప్రజలను దారికి తెచ్చుకుని.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ లబ్ధి పొందాలన్నది ప్రస్తుత కిరణ్ సర్కార్ అసలు ఉద్దేశం. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ప్రజలకు రోజువారీగా చేయాల్సిన పనులను సైతం తామేదో గొప్పగా చేస్తున్నట్టు ఘనంగా అంకెలు చూపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తాపత్రయపడుతోంది. తాజాగా మూడో విడత సాగుతోన్న రచ్చబండ సభల తీరు చూస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తాయి. అర్హులెవరైనా దరఖాస్తు చేసుకుంటే ఆ రోజుకారోజే మంజూరుచేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం రచ్చబండ వరకు లబ్ధిదారులను వేచి ఉండేలా చేస్తోంది. రచ్చబండ సభలకు పెద్దఎత్తున వస్తున్న లబ్ధిదారులను చూసి వారంతా కాంగ్రెస్‌కు అనుకూలురన్న భ్రమల్లో ఆ పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. వాస్తవానికి నెలల తరబడి తమకు రావాల్సిన పింఛన్, రేషన్ కార్డు వంటి వాటి కోసం ఎదురుచూసిన ప్రజలే సభలకు వస్తున్నారన్న సంగతిని పార్టీ నేతలు మరిచిపోతున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూల నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌పై జిల్లాలో పెద్దఎత్తున నిరసన జ్వాలలు రేగిన సంగతి తెల్సిందే. వంద రోజులకుపైగా సాగుతున్న సమైక్య ఉద్యమ సెగతో జనంలోకి ఎలా వెళ్లాలో తెలియని కాంగ్రెస్ నేతలు రచ్చబండను అడ్డుపెట్టుకుని బయటకు వస్తున్నారు. ప్రజలకు తాయిలాల ఎరవేస్తూ సమైక్యవాదాన్ని దెబ్బతీసే ప్రయత్నంతోపాటు రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకు ప్రజాప్రతినిధులు తాపత్రయపడుతున్నారు. సమైక్య ఉద్యమకారులకు భయపడి పోలీస్ పహరా నడుమ జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత రచ్చబండవే.. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న మూడో విడత రచ్చబండలో కొత్త లబ్ధిదారులు ఎవరూ లేరు. గతంలో దరఖాస్తులు పెట్టుకున్నవారికే ఇప్పుడు అందిస్తున్నారు. జిల్లాలో 2011 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 12 వరకు మొదటి విడత, 2011 నవంబర్ 2 నుంచి 30 వరకు రెండో విడత రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 11న ప్రారంభమైన మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని 26 వరకు నిర్వహిస్తారు. రెండో విడత కార్యక్రమంలో జిల్లాలో రేషన్ కార్డుల కోసం 96,618 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిలో 70,789 దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని 56,913 మందికి అర్హత ఉన్నట్టు నిర్ధారించారు. ప్రస్తుత రచ్చబండలో 45,442 కుటుంబాలకు కొత్త కార్డులు, 11,471 ఉమ్మడి కుటుంబాలకు అదనంగా కార్డులు జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. వీరికి తాత్కాలికంగా ఏడు నెలల రేషన్ కూపన్లు జారీ చేస్తున్నామని ప్రకటించారు. జిల్లాలో 44,218 మంది పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకోగా వారిలో అర్హులందరికీ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. 1,261 మందికి బంగారుతల్లి సర్టిఫికెట్లను జారీ చేస్తామని చెబుతున్నారు. ఇంకా ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ కలలు, ఎస్సీ, ఎస్టీలకు కరెంటు సౌకర్యం వంటి పథకాల ద్వారా మొత్తం రూ. 281 కోట్ల లబ్ధి పొందుతారని పేర్కొంటున్నారు. ప్రస్తుత రచ్చబండ కార్యక్రమంలో వర్తింపజేస్తున్న ఆరు పథకాల్లోనూ చాలావరకు రోజువారీగా లబ్ధిదారులకు అందించే అవకాశం ఉన్నా నెలల తరబడి కాలయాపన చేసి చివరకు ఎన్నికల ఘడియలు దగ్గర పడ్డాక ఇప్పుడు రచ్చబండలో ఇస్తుండడం గమనార్హం. అమలుకు నోచని మంత్రి హామీలు 2011 నవంబర్ 10న చిల్లకల్లులో జరిగిన రచ్చబండ సభలో మంత్రి కొలుసు పార్థసారథి ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అప్పట్లో నియోజకవర్గం మొత్తంమీద 13,398 దరఖాస్తులు వస్తే, మూడో విడతలో 4,880 దరఖాస్తులు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. మరి మిగిలినవాటి సంగతేమిటో ముఖ్యమంత్రే చెప్పాల్సిఉందని ప్రజలు వ్యాఖ్యా నిస్తున్నారు. సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉదయం 10.30 గంటలకు హెలికాఫ్టర్‌లో జగ్గయ్యపేటలోని ఎస్.జి.ఎస్. కళాశాలకు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గాన చిల్లకల్లులో జరిగే రచ్చబండ కార్యక్రమానికి వెళతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి కళాశాలకు వచ్చి భోజనం చేస్తారు. 1.30 గంటలకు హెలికాఫ్టర్‌లో తిరిగి బయల్దేరివెళతారు. -
సీఎం పర్యటన ఖరారు
చోడవరం,న్యూస్‌లైన్: చోడవరంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమం ఖరారుతో జిల్లా అధికారులు ఏర్పాట్లులో నిమగ్నమయ్యారు. నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలకు ఒకేచోట సభ నిర్వహణకు మంత్రులు, జిల్లాస్థాయి అధికారులు ఏకంగా రెండ్రోజుల నుంచి ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 12, 13తేదీల్లో నాలుగు మండలాల్లోనూ రోజుకి రెండు చొప్పున రచ్చబండ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ సీఎం వస్తున్నందున ఏకంగా నాలుగు మండలాలకు ఒకే రోజు, ఒకే చోట ఈ నెల 15న సభ ఏర్పాటు చేశారు. ఆరోజు ఉదయం 7.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10 గ ంటలకు విశాఖ విమానాశ్రయానికి సీఎం చేరుకుంటారు. ఉదయం 10.15 గంటలకు హెలికాప్టర్లో 10.45 గంటలకు చోడవరం వస్తారు. ఇక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నియోజకవర్గం పరిధిలో ఫింఛన్లు 3,080 మందికి, రేషన్‌కార్డులు 5వేలు, బంగారు తల్లి పథకం 151, వడ్డీలేని రుణాలు 4,270 మంది, ఎస్సీ,ఎస్టీసబ్‌ప్లాన్ పథకంలో 1774 కుటుంబాలకు పథకాలు పంపిణీ చేస్తారు. సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్, పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్‌జిత్‌దుగ్గల్ బుధవారం పరిశీలించారు. విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ల క్ష్మీపురం రోడ్డులో హెలిప్యాడ్ ప్రదేశాన్ని, రచ్చబండ సభ ఏర్పాటు చేస్తున్న కళాశాల గ్రౌండ్‌ను పరిశీలించారు. సభ విజయవంతానికి పెద్దసంఖ్యలో లబ్ధిదారులను తరలించాలని నాలుగుమండలాల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సబ్‌కలెక్టర్ స్వేత తియోతియా, చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, ఆర్అండ్బి సూపరింటెండె ంట్ ఇంజనీర్ కాంత్, సీఈఓ వెంకటరెడ్డి, ఆర్డీఓ వంతరాయుడు, చోడవరం తహాశీల్దార్ శేషశైలజ పాల్గొన్నారు. -
పోలీసుల హెచ్చరికల మధ్య ‘రచ్చబండ’
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సమస్యలపై, సమైక్యాంధ్రపై ప్రశ్నించినా, సభలో కార్యక్రమంలో గలాటా సృష్టించాలని చూసినా అరెస్టులు తప్పవంటూ పోలీసులు చేసిన హెచ్చరికల మధ్య జిల్లాలోని గంపలగూడెం, గుడివాడ, చాట్రాయి, ముసునూరు మండలాల్లో బుధవారం రచ్చబండ కార్యక్రమం జరిగింది. గ్రామస్థాయి నుంచి మండల కేంద్రాలకు మారిన రచ్చబండ కార్యక్రమాన్ని మరింత కుదించారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. చాట్రాయి సభకే ముసునూరు మండల లబ్ధిదారులను రప్పించి కార్యక్రమం అయ్యిందనిపించారు. చాట్రాయిలో మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ ఎం.రఘునందనరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. జేఏసీ చాట్రాయి మండల నాయకులు సమైక్యాంధ్ర నినాదాలు చేసి, సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని జేఏసీ నాయకులు విమర్శించారు. దీంతో మంత్రి సారథి రాజకీయాలను చొప్పించి ప్రసంగించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫ్లెక్సీలను చించివేస్తున్నారని, రాష్ట్ర విభజనలో సమన్యాయం చేయాలని చెబుతున్న చంద్రబాబునాయుడిని టీడీపీ నాయకులు ఎందుకు నిలదీయలేకపోతున్నారని ఆపార్టీ చాట్రాయి మండల అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావును మంత్రి ప్రశ్నించారు. చాట్రాయిలో వంద మందికి పైగా పోలీసులు, ఒక డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించడం గమనార్హం. గంపలగూడెం సభలో తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి పాల్గొన్నారు. తడిచిన పత్తిని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైతులు కోరారు. ఎ.కొం డూరు మండలంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుడివాడ మండలంలో జరిగిన రచ్చబండలో ఆర్డీవో ఎస్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించాల్సి ఉండగా సందేశం పేపరు లభ్యంకాక కొంతసేపు గందరగోళం నెలకొంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారని తటివర్రు సర్పంచి కె.రాజారెడ్డి అధికారులను నిలదీశారు. గతంలో గ్రామస్థాయిలో రచ్చబండ జరిగేదని ఇప్పుడు మండల కేంద్రాలకు కుదించి ఏ సమస్యలు పరిష్కరిస్తారని ప్రశ్నిం చారు. సమావేశంలో చాలినన్ని కుర్చీలు లేక పలువురు సర్పంచులు నిలబడే ఉన్నారు. -
ఆదిలోనే హంసపాదు
=సొంత ఇలాకాలో మంత్రి ప్రసంగం పట్టించుకోని జనం =తమ సమస్యలు పరిష్కారం కాలేదని మండిపాటు =సమైక్య ఎఫెక్ట్‌తో భారీగా పోలీసుల మోహరింపు =రాజకీయ సభల్లా తొలిరోజు రచ్చబండ రచ్చబండ తొలిరోజు జిల్లాలో పోలీసు పహరా మధ్య నిర్వహించారు. పెనమలూరు, విజయవాడ నగర పరిధిలోని నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నిలదీయకుండా ముందస్తు అరెస్టులు చేపట్టారు. సాక్షి, మచిలీపట్నం : ప్రజా సమస్యలు పరిష్కరిస్తేనే రాజకీయ పార్టీకి మనుగడ ఉంటుంది.. అటువంటి పార్టీ నాయకుడి మాటలనే ప్రజలు నమ్ముతారు.. అందుకు విరుద్ధంగా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ప్రయోజనముండదు. రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి పెనమలూరులో నిర్వహించిన రచ్చబండ సభ దీనికి అద్దం పట్టింది. మూడోవిడత రచ్చబండ సభలు సోమవారం మంత్రి సొంత నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు మండల కేంద్రాల్లో నిర్వహించారు. ఆదిలోనే హంసపాదు అన్నట్టు రచ్చబండ సభ తొలిరోజే మంత్రి మాటలు వినేందుకు సొంత నియోజకవర్గ ప్రజలే ఆసక్తి చూపలేదు. ముఖ్యమంత్రి కిరణ్ ఘనకీర్తిని చాటేందుకు మంత్రి తాపత్రయపడినా ఆలకించేవారే కరువయ్యారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, కరెంటు కనెక్షన్లు, బంగారుతల్లి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ వంటి పథకాల్లో లబ్ధిరులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. అయినా మంత్రి సభలో కూర్చుని ఆయన ప్రసంగం వినే ఆసక్తి చూపలేదు. ఆయా పథకాల కౌంటర్ల వద్ద లబ్ధిదారులు బారులుతీరారు. మంత్రి అసహనం... పెనమలూరు మండలంలోని పది గ్రామాల లబ్ధిదారులు దాదాపు 1,500 మందిని రచ్చబండ సభకు సమీకరించినా.. మంత్రి ప్రసంగించే సమయంలో సభా వేదిక వద్ద సుమారు 300 మంది మాత్రమే ఉన్నారు. తన ప్రసంగం వినేందుకు జనం ఆసక్తిచూపకపోవడంతో ఒక దశలో మంత్రి తీవ్ర అసహనానికి లోనయ్యారు. దీంతో అధికారులు అప్రమత్తమై లబ్ధిదారుల నమోదు కౌంటర్లను సభ ముగిసేవరకు నిలిపివేయాల్సి వచ్చింది. సీపీఎం ఆధ్వర్యంలో మంత్రి నిలదీత... సీపీఎం డివిజన్ కార్యదర్శి హరిబాబు పేదలతో కలిసి వచ్చి పేదోళ్ల ఇళ్ల స్థలాల సమస్యను పట్టించుకోవడం లేదంటూ మంత్రిని నిలదీశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క తాము ఎన్ని పర్యాయాలు దరఖాస్తులు చేసుకున్నా పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలు అందడంలేదంటూ ప్రజలు మండిపడ్డారు. సమైక్యాంధ్ర సెగతో భయపడిన ప్రభుత్వ యంత్రాంగం మంత్రి పాల్గొన్న రచ్చబండ సభకు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంతంలో సుమారు 250 మంది వరకు పోలీసులు మోహరించారు. జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, సబ్ కలెక్టర్ డి.హరిచందన, డీఆర్డీఏ పీడీ కె.శివశంకర్ తదితరులు పాల్గొన్నా ఈ కార్యక్రమం రాజకీయ సభ మాదిరిగానే సాగింది. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా.. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు మంత్రి సారథి స్పష్టం చేశారు. పెనమలూరులో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తీరుబడిగా స్పందించారు. పెనమలూరు రచ్చబండ అనంతరం అదే నియోజకవర్గంలోని కంకిపాడులో సభలో మంత్రి సారథితో పాటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, జిల్లా పౌరసరఫరాల అధికారిణి సంధ్యారాణి, డీఆర్డీఏ పీడీ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సమయంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి శివ మంత్రి సారథి ప్రసంగానికి అడ్డుపడుతూ మూడేళ్లు మీరు ఏం చేశారని నిలదీశారు. తాను పెనమలూరు మండలంలో రూ.200 కోట్లు, కంకిపాడు మండలంలో రూ.45 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని, గ్రామగ్రామాన చర్చకు సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో వివాదాన్ని సర్దుబాటు చేసేలా పోలీసులు రంగంలోకి దిగి శివను అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం నాయకులు రంగారావు, కోటేశ్వరరావు ప్రజాసమస్యలపై మంత్రి సభలో వినతిపత్రం సమర్పించారు. పునాదిపాడు మహిళలు ఇళ్లస్థలాల విషయంలో మంత్రిని నిలదీశారు. మొత్తానికి తొలిరోజు రచ్చబండ సభలో ఎదురైన సమస్యలు, సవాళ్లను స్వీకరించి అమాత్యుడు ప్రజలకు కావలసిన అవసరాలపై దృష్టిపెడతారా లేదా అనేది వేచిచూడాలి. -
కిరణ్ రాకపై ‘రచ్చ’
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి బుధవారం హాజరయ్యే ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని మూకుమ్మడిగా బహిష్కరించాలని జిల్లా కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. సీఎంతో మొదటి నుంచి సన్నిహితంగా వ్యవహరిస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే, జయప్రకాశ్‌రెడ్డి నిర్ణయం మేరకు సీఎం పర్యటన ఖరారైంది. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను సంప్రదించకుండానే కార్యక్రమం ఖరారు కావడం ‘రచ్చ’కు దారి తీసింది. డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డిని డిప్యూ టీ సీఎం దామోదర సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. అక్కడ నుంచే జహీరాబాద్ ఎంపీ షెట్కార్, మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం స్వయంగా ఫోన్ చేశారు. ‘ఓ వైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షను వ్యతిరేకిస్తూ, మరోవైపు జిల్లాలో పర్యటించడంపై నిరసన తెలుపుదామంటూ’ దామోదర ప్రతిపాదించారు. డిప్యూటీ ప్రతిపాదనకు జిల్లా నేతలంతా అంగీకారం తెలిపినట్లు డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. ‘తెలంగాణను అడ్డుకుంటానంటూ ప్రకటిస్తూ మరోవైపు సీఎం జిల్లాకు రావడం సిగ్గుచేటు. సీఎంను ఆహ్వానిస్తే ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ను ఆహ్వానిం చడం ప్రభుత్వ విప్ జయప్రకాశ్‌రెడ్డి సొంత నిర్ణయంటూ బయటకు ప్రకటిస్తున్నా, లోలోన కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఢిల్లీ స్థాయిలో తెలంగాణ అంశం మీద కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో సీఎం ను ఆహ్వానించడం అవసరమా’ అంటూ సదరు ఎమ్మెల్యే ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పిలుపు నేపథ్యంలో జయప్రకాశ్‌రెడ్డి మినహా కాంగ్రెస్ నేతలు హాజరయ్యే సూచన కనిపించడం లేదు. 13న బంద్‌కు టీఆర్ఎస్ పిలుపు కిరణ్ రాకను నిరసిస్తూ ఈ నెల 13న మెదక్ జిల్లా బంద్‌కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బంద్‌కు సంఘీభావం ప్రకటించిన టీజేఏసీ ఇతర పక్షాలు బీజేపీ, సీపీఐతో పాటు వివిధ సంఘాల మద్దతును కూడగట్టే యోచనలో ఉంది. సీఎం రాక నేపథ్యంలో టీఆర్ఎస్, టీజేఏసీ ముఖ్య నేతలు రెండు రోజులుగా వ్యూహం ఖరారు చేయడంలో నిమగ్నమయ్యారు. సీఎం పర్యటనను కాంగ్రెస్ నేతలు బహిష్కరించడంతో, బంద్ ద్వారా తమ నిరసన చాటాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. కిరణ్ రాకపై వివిధ వర్గాల నుంచి నిరసన వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచార సేకరణలో నిమగ్నమయ్యాయి. నిజామాబాద్ రేంజ్ డీఐజీ అనిల్ కుమార్ స్వయంగా జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మకాం వేసి బందోబస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సీఎం పర్యటనపై ఇంకా అధికారిక సమాచారం అందలేదంటూనే జిల్లా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. సీఎం ప్రయాణించే మార్గంలో రోడ్ల మరమ్మతు, వెల్టూరులో గ్రామసభ, సదాశివపేటలో బహిరంగ సభ నిర్వహణపై ప్రణాళిక రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి సహాయ నిరాకరణ నేపథ్యంలో అధికార యంత్రాంగం సహకారంతో సీఎం సభను విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సొంత పార్టీ నేతలు మూకుమ్మడి బహిష్కరణ, ఢిల్లీలో అఖిల పక్ష భేటీలు, ఇతర పరిణామాల నేపథ్యంలో సీఎం కిరణ్ పర్యటన చివరి నిమిషం వరకూ అనుమానంగానే కనిపిస్తోంది. -
నేటినుంచి ‘రచ్చ’బండ
=వినతులు తీసుకోరట =రేషన్ కూపన్ల పంపిణీ =ఇందిరమ్మ కలలు, బంగారుతల్లి పథకాలకు ప్రాధాన్యత మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రజాసమస్యల పరిష్కారం కోసం రూపకల్పన చేసిన మూడో విడత రచ్చబండ కార్యక్రమం జిల్లాలో నేటినుంచి ప్రారంభం కానుంది. ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటుచేయగా ప్రజల నుంచి ఈసారి వినతులు స్వీకరించరని అధికారులు చెబుతున్నారు. గత రెండు విడతలుగా జరిగిన రచ్చబండలో వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి వారికి ఆయా పథకాల్లో లబ్ధి చేకూర్చనున్నారు. ప్రతి గ్రామంలోనూ రచ్చబండ కార్యక్రమం చేపట్టి అక్కడి సమస్యలను తెలుసుకోవాల్సి ఉండగా ఈ కార్యక్రమాన్ని కుదించారు. పట్టణాలు, మండల కేంద్రాలకే పరిమితం... పురపాలక సంఘాల్లో, మండల కేంద్రాల్లో మాత్రమే ఈసారి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తారు. లబ్ధిదారులను అక్కడికే తీసుకొచ్చి వివిధ పథకాల సర్టిఫికెట్లు, పింఛన్లు అందజేస్తారు. గ్రామాల్లో, పురపాలక సంఘాల్లో నెలకొన్న సమస్యలు, నూతనంగా రేషన్‌కార్డులు, పింఛన్లు, వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందాలనుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించబోమని అధికారులు చెబుతుండటంతో ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటుచేశారనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. రెండో విడత రచ్చబండలో వచ్చిన దరఖాస్తుల్లో గుర్తించినవారికి ప్రయోజనం కలిగించి పార్టీ ప్రచారానికి ఈ కార్యక్రమాన్ని అన్వయించుకునేలా మూడో విడత రచ్చబండను ఏర్పాటు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బంగారు తల్లి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తదితర పథకాలను ప్రచారం చేసేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇచ్చిన రేషన్‌కార్డులకు ఏడు నెలలకు సరిపడా కూపన్లు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ప్రజాసమస్యలు పట్టించుకోకుండా.. వారి నుంచి వినతులు స్వీకరించకుండా.. కార్యక్రమం ఏర్పాటుచేస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది. రచ్చబండ కార్యక్రమంలో వినతులు స్వీకరించకుంటే కార్యక్రమం అభాసుపాలయ్యే అవకాశముందని చెబుతున్నారు. తొలిరోజు మూడు ప్రాంతాల్లో... సోమవారం ఉదయం పది గంటలకు మంత్రి పార్థసారథి నియోజకవర్గమైన పెనమలూరులో, మధ్యాహ్నం మూడు గంటలకు కంకిపాడులో, విజయవాడ కార్పొరేషన్లో మూడు ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. రూరల్ ప్రాంతంలోని కైకలూరు, ఉయ్యూరు ప్రాంతాల్లో మంగళవారం ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. మిగిలిన కార్యక్రమాల షెడ్యూలు ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు. ఏడు నెలలకు కూపన్లు... రెండో విడత రచ్చబండలో రేషన్‌కార్డుల కోసం 96,618 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 56,913 మంది అర్హులుగా గుర్తించి, 45,442 మందికి రేషన్‌కార్డులతో పాటు ఏడు నెలలకు సంబంధించిన రేషన్ కూపన్లు అందజేయనున్నారు. రెండో విడత రచ్చబండలో వివిధ రకాల పింఛన్ల కోసం 44,218 దరఖాస్తులు రాగా వాటిలో 39,019 మంది లబ్ధిదారులు అర్హులని గుర్తించారు. మూడో విడత రచ్చబండలో 45,108 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నారు. వీటిలో 19,053 వృద్ధాప్య, 4871 వికలాంగ, 21,184 వితంతు పింఛన్లు అందజేయనున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకంలో భాగంగా 1261 మంది లబ్ధిదారులకు సర్టిఫికెట్లతో పాటు ఒక్కొక్కరికి రూ.2,500 అందజేయనున్నారు. రెండో విడత రచ్చబండలో గృహనిర్మాణం కోసం 59,963 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 48,605 మంది అర్హులని గుర్తించారు. అర్హులైన వారందరికీ గృహనిర్మాణం చేసుకునేందుకు అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులో భాగంగా జిల్లాలో 28 ప్రాంతాల్లో కమ్యూనిటీ భవనాలు నిర్మించనున్నారు. ఒక్కొక్క భవనానికి రూ.7.5 లక్షల నిధులు మంజూరు చేస్తారు. మూడు ప్రాంతాల్లో ఇందిరా విద్యానిలయాలు నిర్మించేందుకు అనుమతి ఇస్తారు. ఒక్కొక్క భవనానికి రూ.2.5 కోట్లు ఖర్చు అవుతుందని నిర్ణయించారు. ఇవి కాకుండా మరో 11 భవనాల నిర్మాణానికి రూ.52.97 కోట్లు ఖర్చు చేయనున్నారు. నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుకున్న 30,539 ఎస్సీ కుటుంబాలకు, 8,526 ఎస్టీల కుటుంబాలకు విద్యుత్ బిల్లులు చెల్లించనున్నారు. -
నేటి నుంచి రచ్చబండ-3 నిర్వహణ
=నేటి నుంచి రచ్చబండ-3 నిర్వహణ = మండల కేంద్రాలకే పరిమితం = లబ్ధిదారులకు పథకాల పంపిణీతో సరి విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రహస్య రచ్చబండకు సర్వం సిద్ధమైంది. రెండో విడతలో రచ్చగా మారిన ఈ కార్యక్రమం ఇప్పుడు మండల కేంద్రాలకే పరిమితమవుతోంది. అప్పట్లో సమావేశం జరిగిన ప్రతీ చోటా ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు నిలదీశారు. ముఖ్యంగా మంత్రి బాలరాజును ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో తీవ్ర సమస్యలు నెలకొన్నాయి. దీంతో రచ్చబండ-2 మాదిరిగా ఈసారి ఎటువంటి ఆందోళనలు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పథకాలకు కనీసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా లేకుండా మూడో విడతను నిర్వహిస్తోంది. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకొని వారిని ఆదుకోవాలన్న సంకల్పంతో 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం దీనికి బ్రేక్ పడింది. 2011 ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి విడత రచ్చబండను గ్రామస్థాయిలో నిర్వహించింది. వైఎస్ పథకాలు సక్రమంగా అమలు కాకపోవడంతో అప్పట్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అదే ఏడాది నవంబర్‌లో నిర్వహించిన రచ్చబండ-2ను మండల కేంద్రాలకే పరిమితం చేసింది. మునుపటిలా ఇప్పుడూ వ్యతిరేకత ఉంటుందన్న భయంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం లబ్ధిదారులను మినహా మిగిలిన వారిని సమావేశాలకు రానీయకుండా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు భీమిలిలో జరిగే సమావేశానికి రాష్ట్ర ఓడరేవులు, పెట్టుబడులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అలాగే రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు ఉదయం పాడేరులోను, మధ్యాహ్నం హుకుంపేటలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. పథకాలు పంపిణీ 2010లో జరిగిన రచ్చబండలో రేషన్‌కార్డులు, పించన్లు, ఇళ్ల కోసం వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాటితో పాటు ప్రజావాణి, ఇతరత్రా కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలతో లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేశారు. వారందరికీ ముందుగా స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. కేవలం వారినే సమావేశాలకు తీసుకొచ్చే బాధ్యతను అధికారులు భుజాన్నెత్తుకున్నారు. దీని ప్రకారం జిల్లాలో 1,37,201 మందికి రేషన్‌కార్డులు, 31,841 మందికి పెన్షన్లు, 37,228 మందికి ఇళ్లు రానున్నాయి. వీటన్నింటినీ ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు జరిగే రచ్చబండ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో అందజేయనున్నారు. బంగారుతల్లి పథకంలో ఎంపిక చేసిన 1067 మందికి రూ.26.77 లక్షలను బాండ్ల రూపంలో పంపిణీ చేయనున్నారు. హాస్టళ్లకు శంకుస్థాపన ఇవన్నీ కాకుండా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ కింద ఎస్సీ, ఎస్టీల కోసం కమ్యూనిటీ హాళ్లు, హాస్టళ్లు నిర్మిస్తున్నారు. వాటికి రచ్చబండ కార్యక్రమంలోనే శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో 8 హాస్టళ్లకు రూ.1.48 కోట్లు, 10 కమ్యూనిటీ హాళ్లకు రూ.75 లక్షలతో నిర్మాణాలను ప్రారంభించనున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.37.82 కోట్లతో 925 రోడ్ల నిర్మాణాలకూ రచ్చబండలోనే శ్రీకారం చుట్టనున్నారు. -
కాంగ్రెస్ ‘రచ్చ’బండ
=అధికారిక కమిటీల్లో ముగ్గురికి చోటు =ఈ ముగ్గురూ కాంగ్రెస్ వారే ఉండే అవకాశం =కమిటీ ఖరారు అధికారం ఇన్చార్జ్ మంత్రికి =మండల స్థాయిలో మాత్రమే రచ్చబండ కార్యక్రమం =ఈసారి లబ్ధిదారులకే పరిమితం కానున్న సభలు సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఈనెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న మూడోవిడత రచ్చబండ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మారనుంది. మండల కేంద్రాల్లో ఇద్దరు ప్రజా ప్రతినిధులు, ఏ పదవిలో లేకపోయినా మరొకరు కలసి లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేసేందుకు వేదికపై అధికారికంగా కూర్చునే విధంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ ముగ్గురినీ ఎంపిక చేసే అధికారం కూడా జిల్లా ఇన్చార్జి మంత్రికి ఇచ్చారు. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో విభజన ప్రకటన దెబ్బకు ప్రజల్లోకి వెళ్లలేని కాంగ్రెస్‌పార్టీ శ్రేణులను ఇలా పాల్గొనేలా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. మండలస్థాయిలో ఒక ప్రజాప్రతినిధి, మరో ఇద్దరు అనధికారిక ప్రతినిధులు (ఇందులో ఒక మహిళ) ఉండేవిధంగా రచ్చబండ మండల కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే అధికార పార్టీ మద్దతుతో గెలిచిన ప్రతినిధులను, అనధికారిక ప్రతినిధులుగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి లేదా ఎమ్మెల్యే సూచించేవారినే ఈ కమిటీల్లో నియమించనున్నారు. దీంతో రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యే వారందరినీ తమకు ఓటు బ్యాంకు గా మలచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన ఎత్తుగడగా పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలోని అన్ని చోట్లా కమిటీలే రచ్చబండలో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గతంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు రచ్చబండ వేదికలపై అధికారులు కానివారిని అడ్డుకుని నిలదీశారు. ఈ నేపథ్యంలో అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చి కాంగ్రెస్ నాయకులను రచ్చబండ వేదికలు ఎక్కిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈసారి రచ్చబండ పూర్తిగా కాంగ్రెస్ రంగు పులుముకుని ఒక పార్టీ కార్యక్రమంగా జరగనుంది. ఆరు అంశాలకే పరిమితం 2010లో మొదటి విడత రచ్చబండ గ్రామస్థాయిలో నిర్వహిం చారు. రెండవ విడత 2011లో కేవలం మండల స్థాయికే పరి మితం చేసి రచ్చబండ సభలు నిర్వహించారు. ఇప్పుడు కూడా 3వ విడత రచ్చబండ మండల కేంద్రాల్లో మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 11వ తేదీ నుంచి 26 వరకు రచ్చబండ సభలు నిర్వహిస్తారు. మున్సిపాల్టీల్లోనూ అన్ని వార్డులకు కలిపి ఒకే రోజు రచ్చబండ నిర్వహించనున్నారు. పూర్తిగా రచ్చబండను కుదించి కేవలం రేషన్‌కార్డులు, పింఛన్ల పంపిణీ, గృహనిర్మాణ లబ్ధిదారులకు అనుమతి ఉత్తర్వులు ఇవ్వడం, ఇందిరమ్మకలల కింద వివిధ అభివృద్ధిపనులకు ప్రారంభోత్సవాలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బకాయి ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లింపులకే పరిమితం చే శారు. ఇందుకు అనుగుణంగానే అధికారులు కార్యక్రమాన్ని రూ పొందించనున్నారు. లబ్ధిదారులకే పరిమితం ఈసారి రచ్చబండ కార్యక్రమాన్ని కేవలం లబ్ధిదారులకే పరిమితం చేయనున్నారు. గతంలోలా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఈసారి రచ్చబండలో అవకాశం లేదు. కేవలం లబ్ధిదారులు మాత్రం ముందుగానే రచ్చబండ సభకు రావాలని, రేషన్‌కార్డు, పింఛన్ మంజూరయ్యాయని తెలుపుతూ అధికారిక లేఖలు పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. లబ్ధిదారులకు మం జూరు స్లిప్పులు ముందే ఇచ్చి వారిని రచ్చబండ సభల వద్దకు తీసుకురావాలని, ఖర్చులను ఆయా విభాగాల రెగ్యులర్ బడ్జెట్ నుంచి భరించాలని ఉత్తర్వులు అందాయి. -
పింఛనేది సారూ!
బోధన్ మండలం ఈట్పల్లికి చెందిన వడ్డె పోశవ్వ (70) పింఛన్ కోసం పోస్టాఫీసుకు వెళ్లి ఎండ ప్రతాపంతో ప్రాణాలు విడిచింది. ఆమె అనారోగ్యం కారణంగా వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోలేకపోయింది. మూడో నెల కూడా పింఛను తీసుకోకపోతే రద్దవుతుందన్న భయంతో పోస్టాఫీసుకు వచ్చింది. మొదటిసారి వెళ్లినప్పుడు పింఛను రాలేదని పోస్టల్ సిబ్బంది చెప్పి పంపించారు. రెండో సారి మే నెల పదో తేదీన ఎండలో వెళ్లిన పోశవ్వ.. వేడిమి ని తట్టుకోలేక అక్కడే చనిపోయింది. ఈనెల ఏడున ఆర్మూర్ పట్టణానికి చెందిన మూడబోయిన పెద్దసాయన్న (60) పింఛన్ డబ్బుల కోసం పోస్టాఫీసుకు వెళ్లాడు. అసలే అనారోగ్యం, గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సి రావడంతో తట్టుకోలేక అక్కడే మరణించాడు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న పింఛన్ల మంజూరు సంగ తి దేవుడెరుగు.. ప్రస్తుతం ప్రతి నెల పంపిణీ చేసే పింఛన్ డబ్బుల కోసం లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పటం లేదు. ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్లను 15వ తేదీ వరకు కూడా చెల్లించడం లేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పోస్టాఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అనారోగ్యానికి తోడు చేతకాని వయసు లో పింఛన్ల కోసం తిరగడం వృద్ధుల ప్రాణాల మీదకు వస్తోంది. ఐదు నెలల కాలంలోనే ఇలా పింఛన్ కోసం వెళ్లిన ఇద్దరు వృద్ధులు మృత్యువాత పడ్డారు. అప్పుడే బాగుండే.. సామాజిక భద్రతలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పింఛన్ల పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పింఛన్ డబ్బులను పెంచడంతో పాటు ప్రతి నెల ఒకటో తేదీనే లబ్ధిదారులకు డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. మహిళా గ్రూపుల్లో ఆరు పదుల వయసు నిండినవారికి అభయహస్తం పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రతి నెల రూ. 500 అందే విధంగా కృషి చేశారు. వృద్ధాప్య పింఛన్లను రూ. 75 నుంచి రూ. 200కు, వికలాంగుల పింఛన్‌ను రూ. 500కు పెంచారు. చేనేత, కల్లుగీత కార్మికులకు కూడా రూ. 200 పింఛన్ అందించారు. చంద్రబాబు జమానాలో పింఛన్ పొందుతున్న వారిలో ఒకరు చనిపోతేనే కొత్తగా మరొకరికి పింఛన్ మంజూరు చేసేవారు. వైఎస్ ఈ విధానానికి స్వస్తి చెప్పి అర్హులైన అందరికీ పింఛన్లను అందించారు. బడుగుల జీవితాలకు భద్రత కల్పించారు. మహానేత మరణానంతరం మళ్లీ వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు కష్టాలు వచ్చాయి. అనర్హుల ఏరివేత పేరుతో కిరణ్ సర్కారు అర్హులైనవారి పింఛన్లనూ రద్దు చేసింది. పైగా పింఛన్లు కూడా ప్రతినెల ఒకటిన పంపిణీ చేయలేకపోతోంది. కొర్రీలు పెట్టి సామాజిక భద్రత కింద పంపిణీ చేస్తున్న పింఛన్లకు స్వస్తి పలకాలనే కుట్రలు, కుతంత్రాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో 2,61,229 మందికి సామాజిక భద్రత పింఛన్లను అందించేవారు. ఇప్పుడు 2.47,563 మందికే ఈ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వివిధ కారణాలు చెప్పి 13,666 మంది పింఛన్లను తొలగించారు. ‘రచ్చబండ’కు మోక్షమెప్పుడో.. రచ్చబండ-1, రచ్చబండ-2 కార్యక్రమాల్లో పింఛన్ల కోసం 91,366 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 61,366 మంది పింఛన్లకు అర్హులని జిల్లా అధికారులు గుర్తించి, ఏడాది కిందట ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటికి ఇప్పటి వరకు మోక్షం లభించలేదు. దీంతో దరఖాస్తుదారులు పింఛన్ కోసం కలెక్టరేట్, ఆర్డీవో, తహశీల్, ఎంపీడీఓ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కనబడిన నేతనల్లా వేడుకుంటున్నా ఫలితం లేదు. వికలాంగులు, మానసిక వైకల్యం ఉన్నవారు, నడవడానికి ఇబ్బంది పడే వృద్ధులు, వితంతువులు సైతం పింఛన్ కోసం తిరుగుతూనే ఉన్నారు. ఇదీ పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో 2,47,563 మంది పింఛన్ లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 6.50 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 1,34,841 పింఛన్లు వృద్ధులవి కాగా, 64,715 పింఛన్లు వితంతువులవి ఉన్నాయి. వికలాంగుల పింఛన్లు 25,889, చేనేత కార్మికుల పింఛన్లు 1057, కల్లుగీత కార్మిక పింఛన్లు 720, అభయహస్తం పింఛన్లు 20,341 వరకు ఉన్నాయి. పింఛను డబ్బులను ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇష్టమొచ్చినప్పుడు ఇస్తున్నారు. ఒక నెలలో 1 నుంచి 5 వ తేదీ వరకు ఇస్తుండగా, మరో నెలలో 5 నుంచి 10వ తేదీ వరకు, మరికొన్ని సార్లయితే నెలాఖరులో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో పింఛన్‌దారులు నెల మొత్తం పింఛన్ల డబ్బుల కోసం పోస్టాఫీసులు, ఐకేపీ సిబ్బంది ఇళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛన్లను కచ్చితమైన తేదీల్లో పంపిణీ చేయాలని, లబ్ధిదారుల వద్దకే పింఛన్లను తీసుకొచ్చి ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
తెల్ల రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో రెండో విడత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్నవారికి తెల్ల రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పౌర సరఫరాలశాఖ అధికారులు రచ్చబండ-2లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించారు. గ్రేటర్ మొత్తం మీద తెల్లరేషన్ కార్డుల కోసం సుమారు రెండున్నర లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, వాటిలో సుమారు లక్ష మందిని అర్హులుగా అధికారులు గుర్తించి జాబితా తయారు చేశారు. వీటిలో హైదరాబాద్‌లో 42 వేలు, రంగారెడ్డి జిల్లాలో 58 వేల వరకు మంజూరు కానున్నాయి. దీంతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పేదల కల నెరవేరనుంది. తెల్లకార్డుల ఘనత వైఎస్సార్‌దే.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి రాకముందు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తెల్లరేషన్ కార్డులు ఆరు లక్షలు కూడా లేవు. ఆయన సీఎంగా వచ్చాక నిరుపేదలందరికి తెల్ల రేషన్‌కార్డులు వర్తింపజేయడంతో ఆ సంఖ్య రెండింతలకు పెరిగింది. కొత్త కార్డుల పంపిణీలో క్షేత్రస్థాయిలో జరిగిన లోపాల వల్ల కొందరు అనర్హులు కార్డులు పొందారు. దీంతో కొన్నింటిని రద్దు చేశారు. అంతకుముందే కొందరిని అర్హులుగా తేల్చినా 2009 ఎన్నికల నియమావళి కారణంగా కొత్త తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేయలేదు. అయితే, వీరికి నెలవారి సరుకులు పొందేందుకు తాత్కాలిక కూపన్లను ఇచ్చారు. అనంతరం 2010 జనవరి నుంచి 2011 ఫిబ్రవరి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తెల్లరేషన్ కార్డుల అర్హులను ఎంపిక చేశారు. అయినా, వీరికి రేషన్ కార్డులు జారీ చేయలేదు. 2011 నవంబరులో నిర్వహించిన రెండో దశ రచ్చబండలో ఆరు నెలలకు సరిపోయేలా తాత్కాలిక కూపన్లు జారీ చేసి అప్పటి నుంచి 2013 మార్చి వరకు కూపన్ల విధానాన్ని పొడిగిస్తూ వచ్చారు. కార్డుల పంపిణీకి ఇప్పటికే ఉన్నత స్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో రెండు జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. అయితే, పంపిణీకి అధికారికంగా అదేశాలు అందాల్సి ఉంది.