విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పేద, బలహీనవర్గాల వారికి అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ప్రచార రథాలు, కళాజాతాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు కేటాయించిన ప్రచార రథాలను, జిల్లా పౌర సంబంధాల అధికారికి కేటాయించిన నూతన వాహనాన్ని మంగళవారం స్థానిక స్టేట్ గెస్ట్‌హౌస్ వద్ద ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడ అమలు చేస్తూ దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు రచ్చబండ, ప్రజాపథం కార్యక్రమాలు దోహదపడ్డాయన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రచార రథాన్ని కేటాయించి శిక్షణ ఇచ్చిన కళాకారులతో ప్రజలకు పథకాల గురించి వివరిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
జిల్లాలో 16 నియోజకవర్గాలలో ప్రచార రథాల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి కె.సదారావు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ కె.శివశంకరరావు, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, డివిజినల్ పీఆర్‌ఓ ఎస్‌వీ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమంపై విస్తృత ప్రచారం
Published Wed, Dec 25 2013 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement