చెరగని జ్ఞాపకం | Indelible memory | Sakshi
Sakshi News home page

చెరగని జ్ఞాపకం

Published Tue, Sep 2 2014 3:07 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

చెరగని జ్ఞాపకం - Sakshi

చెరగని జ్ఞాపకం

సాక్షి, చిత్తూరు: వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లోనూ నిర్లక్ష్యానికి గురైన జిల్లా అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు వైఎస్సార్. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్సార్ చిత్తూరు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపారు. 2004 వరకూ నిర్లక్ష్యానికి లోనైన  గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి పనులను శరవేగంగా ముందుకు కదలించారు. నాలుగువేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. కాలువల తవ్వకం కూడా పూర్తయింది. వైఎస్ మరణంతో రెండు ప్రాజెక్టుల పురోగతికి బ్రేక్ పడింది.
     
పారిశ్రామికరంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమ బెల్ ఏర్పాటుకు మన్నవరంలో శంకుస్థాపన చేశారు. రాజస్థాన్, తమిళనాడు, రాష్ట్రాల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టును మన రాష్ర్టంలో ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇది పూర్తయితే 6వేలమందికి ఉపాధి లభిస్తుంది.
     
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు విమానాశ్రయ విస్తరణ పనులకు భూ సేకరణ చేయించారు.
     
తూర్పు మండలాల్లోని మెట్ట ప్రాంత రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా స్వర్ణముఖి-సోమశిల కాలువ పనులకు శ్రీకారం చుట్టారు.
     
చిత్తూరు, వైఎస్సార్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల రైతాంగం కోసం తిరుపతిలో 14 కోట్ల రూపాయలతో వేపర్‌హీట్ ట్రీట్‌మెంట్ ప్లాంటును ఏర్పాటు చేశారు. పండ్లను శుద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇది అనువుగా ఉంటుంది.
     
తిరుపతి, చిత్తూరు మున్సిపాలిటీలకు కార్పొరేషన్ హోదా కల్పించారు. తిరుపతిని జవహరలాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్(జేఎన్‌ఎన్ యూఆర్‌ఎం) జాబితాలో చేర్చారు. దీని ద్వారా తిరుపతి అభివృద్ధికి 2.223 కోట్ల రూపాయలు వ్యయం చేసేందుకు అవకాశం ఏర్పడింది. తిరుపతి నగరంలో 20వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతిచ్చారు. మొదటి విడత గృహాలు పూర్తి చేసి పేదలకు అందజేశారు.
     
తిరుపతిలో వెటర్నరీ యూనివర్శిటీ స్థాపించారు.
     
వేదవిద్యలో మరింత పురోగతి సాధించేందుకు వీలుగా టీటీడీ ఆధ్వర్యంలో వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
     
మదనపల్లె పట్టణానికి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు 43 కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.
     
స్విమ్స్‌లో అత్యాధునిక ఆంకాలజీ యూనిట్ ప్రారంభించారు.
     
రాయలసీమలోనే తొలిసారిగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా కొత్త కలెక్టరేట్ నిర్మించారు.
     
వాల్మీకిపురం వద్ద సుమారు 7కోట్ల రూపాయలతో బోగంపల్లి రిజర్వాయర్, కలిచెర్ల వద్ద ఆకుమానుగుంట రిజర్వాయర్ నిర్మించారు. ఆయన మరణంతో ఎడమకాలువ పనులు నిలిచిపోయాయి.
     
తంబళ్లపల్లె వద్ద చిన్నే ప్రాజెక్టును సుమారు 3 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయించారు. ఇలా తాను సీఎంగా ఉన్న కాలంలో ప్రతి అభివృద్ధి పనిని పరుగులు పెట్టించారు.
 
 వైఎస్‌ఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహిద్దాం
 - పార్టీ శ్రేణులకు నారాయణస్వామి పిలుపు
 తిరుపతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఐదవ వర్ధంతిని మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కే.నారాయణస్వామి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వైఎస్‌ఆర్ చిత్రపటాలు లేదా విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించాలని కోరారు. రక్తదానం, పేదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ సభ్యులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, పార్టీ అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు వైఎస్‌ఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో చురుగ్గా పొల్గొని ఘనంగా నివాళులు అర్పించాలని నారాయణ స్వామి కోరారు.
 
 మాట తప్పని నేత వైఎస్సార్
 జిల్లావాసి ముఖ్యమంత్రిగా ఉండి జిల్లా అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తే...సొంత జిల్లాలా భావించి చిత్తూరు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిన గొప్ప నాయకుడు వైఎస్సార్. మహిళలను లక్షాధికారులను చేస్తానని మాట ఇచ్చి చేతల్లో చూపిన మాటతప్పని నేత ఆయన. అలాంటి వ్యక్తి ఆశయాల సాధన కోసం ఆవిర్భవించిన పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. మళ్లీ వైఎస్సార్ స్వర్ణయుగం రావడం ఖాయం. వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ సేవాకార్యక్రమాలు చేయాలి. మహిళలంతా వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి.
 -గాయత్రీదేవి, మహిళావిభాగం జిల్లా కన్వీనర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement