సాక్షి, రాజమండ్రి : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన ఆదివారంతో ముగిసింది. ఉదయం 10.35 గంటలకు మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయం నుంచి జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ఆయన హైదరాబాద్ వెళ్లారు. రాజమండ్రిలో శనివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాత్రి అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్ కుమారుల వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆయన స్థానిక నేతలను కలుసుకున్నారు. అతిథిగృహ సమావేశ మందిరంలో వివిధ సంఘాల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
కానరాని కార్యకర్తలు
ముఖ్యమంత్రి తమ ఊరు వస్తారంటే క్యాడర్‌లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి బస వద్ద అటువంటి ఛాయలు కనిపించలేదు. స్వాగత సత్కారాల నుంచి వీడ్కోలు వరకూ ఎక్కడా పార్టీ జెండాలు కనిపించలేదు. రచ్చబండలో తమ వర్గాల వారికి అన్యాయం జరుగుతోందని, అనుయాయులకు రేషన్ కార్డులు, పింఛన్లు దక్కడం లేదన్న అసంతృప్తితో డివిజన్‌లలో క్యాడర్ సీఎం పర్యటనలో పాల్గొనలేదని నేతలే చెప్పారు. దీనికి తోడు ఎమ్మెల్యే రౌతు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం వర్గాలకు మధ్యన ఉన్న విబేధాలు సీఎం పర్యటనలో కొట్టొచ్చినట్టు కనిపించాయి.
ఏసీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత ఏసీవై రెడ్డి కుటుంబాన్ని ముఖ్య మంత్రి పరామర్శించారు. 10.00 గంటలకు ఆర్ట్ కళాశాల ఎదురు వీధిలో ఉన్న ఏసీవై ఇంటికి చేరుకుని ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. మంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, పలువురు
ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు.
వినతులందించేందుకు క్యూ
ముఖ్యమంత్రికి తమ తమ విజ్ఞాపనలు అందించేందుకు ఉద్యోగ, ప్రజా సంఘాల వారు బారులు తీరారు. సమావేశ మందిరంలో సీంఎ వారందరి నుంచీ కాగితాలు తీసుకుని రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీతలకు అందచేశారు. బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ముఖ్య మంత్రిని కోరుతూ వినతి పత్రం అందజేసింది. తల్లిదండ్రులు, వయో వృద్ధుల పోషణ చట్టం ఆమలులోకి తెచ్చేందుకు కృషి చేయాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. హెల్త్ కార్డుల కోసం ఐక్య ఉపాధ్యాయ కార్యాచరణ సమితి వినతి ఇచ్చింది. రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభించాలని విద్యార్థులు కోరారు. ఏబీసీడీ విభజనకు అనుకూలంగా చర్యలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు.
ట్రెజరీ ద్వారా జీతాలివ్వాలి
కోటగుమ్మం : జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు ఓఐఓ పద్దు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గట్టి రామారావు ఆధ్వర్యంలో సంఘ నాయకులు కోరారు. జీతాలు, పెన్షన్లు ఓఐఓ పద్దుద్వారా చెల్లించాలని వినతిపత్రం సమర్పించారు. సంఘం గౌరవ అధ్యక్షుడు మారిశెట్టి సత్యనారాయణ, సంఘం సంయుక్త కార్యదర్శి నల్లమిలి రామ కోటేశ్వరరావు, కె సత్యనారాయణ ఆయన వెంట ఉన్నారు. ఇంకా సఘాయి వాలాలు, ఛాంబర్ ఆఫ్‌కామర్స్, నూర్‌బాష్ ముస్లిం మైనారిటీ సంఘం, అల్యూమినియం అసోసియేషన్, బొమ్మూరు డైట్ కళాశాల, యూటీఎఫ్, రాజమండ్రి నాయీ బ్రాహ్మణ సంఘం, రాజమండ్రి కార్పొరేషన్ రచ్చబండ కమిటీ, ఏపీఎన్‌జీఓ తదితర సంఘాల ప్రతినిధులుసీఎంను కలిసిన వారిలో ఉన్నారు. మంత్రులు పితాని సత్యనారాయణ, తోట నరసింహం, కాసు కృష్ణారెడ్డి, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఎమ్మెల్సీ చైతన్య రాజు, ఎమ్మెల్యే శేషారెడ్డి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం తదితరులు సీఎం వెంట ఉన్నారు.
జిల్లాలో ముగిసిన సీఎం పర్యటన
Published Mon, Nov 18 2013 1:51 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement