సాక్షి, విజయవాడ : ప్రజల వద్దకు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమం దారితప్పింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చిల్లకల్లు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్న రచ్చబండ ముఖ్యమంత్రిని వీరుడు, శూరుడు అని పొగడటానికే సరిపోయింది. వేదికపై పాల్గొన్న వారందరూ రాజకీయ ఉపన్యాసాలతో ఊదరగొట్టారు. ప్రజా సమస్యలను స్థానిక శాసనసభ్యుడు, సర్పంచ్ ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి వాటిపై మొక్కుబడిగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, జగ్గయ్యపేటకు కృష్ణాజలాలు తేవడానికి నిధులు ఇస్తామంటూ ముగించారు.
రైతు వెతలపై ప్రస్తావనే లేదు...
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతన్న వెన్ను విరిగింది. పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వీటిపై కనీస ప్రస్తావన కూడా చేయకపోవడం విమర్శలకు దారితీసింది. స్థానిక శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ పోలంపల్లి ప్రాజెక్టు పైభాగంలో ఖమ్మం జిల్లాలో పందిళ్లపల్లి వద్ద డ్యామ్ నిర్మాణం అక్రమంగా జరుగుతుందని, దాన్ని అడ్డుకోవాలని కోరినా సీఎం స్పందించలేదు.
సీఎం తన ప్రసంగంలో ఎక్కువ భాగం రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాల గురించే ప్రస్తావించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఇరు ప్రాంతాలకు మధ్య ఉన్నాయని, వాటిని ఎలా విడగొడతారని ప్రశ్నలు సంధించారు. తాను సమైక్యవాదం కోసం ప్రయత్నం చేస్తున్నానని, అవసరమైనపుడు మీ మద్దతు కావాలంటూ పరోక్షంగా కొత్త పార్టీ పెడతానన్న సంకేతాలు ఇచ్చారు.
కిరణ్‌పై నేతల పొగడ్తల వర్షం...
సభలో కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం కిరణ్‌ను పొగిడేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ప్రజాబలంతో ముందుకు నడిచేలా ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ కోరారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన ప్రసంగం అంతా సినిమా డైలాగులతో చేశారు. ‘సమైక్యం ఆరిపోయే దీపం కాదు.. రగిలే జ్వాల’ అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినరని, ప్రస్తుతం సమైక్యానికి కట్టుబడి ఉన్నందున దూకుడుతో పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడుతున్నారంటూ పొగడ్తలతో ముంచేశారు. గజల్స్ గాయకుడు శ్రీనివాస్ సమైక్య సింహానికి నిలబడి చప్పట్లతో ఆహ్వానించాలంటూ హడావిడి చేసి హీరోగా చూపే ప్రయత్నం చేశారు. మొత్తానికి రచ్చబండ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా కిరణ్‌కుమార్‌ను పొగిడే కార్యక్రమంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
రెండు గంటలు ఆలస్యంగా...
ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడం, జనం రాకపోవడంతో రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాన్ని పోగు చేసేందుకు కాంగ్రెస్ నేతలు, అధికారులు తంటాలు పడ్డారు. సీఎం సభకు వస్తే సమైక్యవాదానికి మద్దతు ఇచ్చినట్లేనని పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచారం చేశారు. సభకు వచ్చిన వారి నుంచి దరఖాస్తులను ముఖ్యమంత్రి ప్రసంగం అయ్యే వరకు తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
విద్యార్థినుల కుటుంబాలను ఆదుకుంటాం...
విజయవాడ : రామవరప్పాడు రింగ్ వద్ద ఈ నెల ఏడున జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం చెందిన బీటెక్ విద్యార్థినుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరలోనే ముగ్గురు విద్యార్థినుల కుటుంబాలకు తన సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా మంజూరయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. నున్నకు చెందిన దాసరి చందుశ్రీ తండ్రి కామేశ్వరరావు సీఎంని జగ్గయ్యపేటలో కలవగా ఆయన పైవిధంగా స్పందించారు.
లక్ష్యానికి దూరంగా..
Published Sun, Nov 17 2013 2:11 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement