కాళేశ్వరం బరాజ్‌లపై సాక్ష్యాధారాలను సేకరించనున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్
శుక్రవారం లేదా సోమవారం రావాల్సిందిగా సూచన
విద్యుత్ రంగ నిపుణుడు కె.రఘును కూడా విచారించనున్న కమిషన్
సీడబ్ల్యూసీ, ఇతర అధికారులు, ఇరిగేషన్ మాజీ కార్యదర్శులను సైతం పిలవాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బరాజ్‌లపై విచారణలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ నుంచి సాక్ష్యాధారాలు సేకరించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. వచ్చే శుక్రవారం లేదా సోమవారం కమిషన్ కార్యాలయానికి వచ్చి తన వద్ద ఉన్న సమాచారాన్ని అందించాలని ఆయన్ను కోరింది.
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మడిహట్టి వద్ద బరాజ్ నిర్మించాల్సి ఉండగా, అక్కడ 165 టీఎంసీల నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) తెలపడం వల్లే బరాజ్‌ను మేడిగడ్డ వద్దకు మార్చినట్టు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేర్కొంది. అయితే వెదిరె శ్రీరామ్ ఇటీవల విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ వాదనను తోసిపుచ్చారు. తమ్మడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ ప్రతిసారీ చెప్పిందని పేర్కొన్నారు.
తన వాదనలను బలపర్చే కీలక పత్రాలను సైతం ఆయన ప్రజెంటేషన్‌లో పొందుపరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతులు, మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి సంబంధించిన పత్రాలు ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని సైతం సాక్ష్యాధారాలుగా సేకరించాలని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నిర్ణయించింది.
సోమవారం కమిషన్ ముందుకు రఘు
తెలంగాణ జేఏసీ చైర్మన్, విద్యుత్ రంగ నిపుణుడు కె.రఘు నుంచి సైతం సాక్షా్యధారాలను సేకరించాలని కమిషన్ నిర్ణయించింది. సోమవారం కమిషన్ ఎదుట హాజరై వివరాలను అందించాలని ఆయనకు లేఖ రాసినట్టు తెలిసింది. తమ్మడిహెæట్టికి బదులు మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన గతంలో అఖిలపక్ష సమావేశాలు, సదస్సులు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారీ ఇంజనీరింగ్ తప్పిదమని, ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల పథకమని పేర్కొంటూ ఆయన ప్రజెంటేషన్లు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో కమిషన్ ఆయన్ను సైతం పిలిచింది. రఘు గతంలో ట్రాన్స్‌కో సివిల్ విభాగం సీఈగా వ్యవహరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విభేదించారనే కారణంతోనే రఘును రెండు హోదాలు కిందికి డిమోట్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో లోపాలను తప్పుబడుతూ తన ఉద్యోగాన్ని మానేసిన ఓ నిర్మాణ సంస్థ కీలక మాజీ ఉద్యోగి ఒకరు త్వరలో కమిషన్ ముందు హాజరై తన వద్ద ఉన్న సమాచారాన్ని సాక్ష్యాధారాలుగా సమర్పించనున్నట్టు తెలిసింది.
త్వరలో సీడబ్ల్యూసీ ఇతర అధికారులకు కబురు
కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను రూపొందించిన వ్యాప్కోస్ సంస్థ అధికారులతో పాటు హైడ్రాలజీ, ఫైనాన్షియల్ అనుమతులు జారీ చేసిన సీడబ్ల్యూసీ, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధికారులను సైతం విచారణకు పిలిపించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ణయించింది.
ఇక మూడు బరాజ్‌ల వైఫల్యాలపై అధ్యయనాకికి ఏర్పాటైన నిపుణుల కమిటీని సైతం త్వరలో కమిషన్ విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాలు తీసుకున్న సమయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య/ప్రత్యేక ప్రధా న కార్యదర్శులుగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్‌లు శైలేంద్ర కుమార్ జోషి, రజత్‌కుమార్‌ను త్వరలో కమిషన్ పిలిపించి విచారించనుంది.
20 మంది డీఈఈల విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లు, పంప్‌హౌస్‌ల నిర్మాణంలో పాల్గొన్న 20 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను మంగళవారం కమిషన్ విచారించింది. నిబంధనల మేరకే బరాజ్‌ల పనులు జరిగాయా? ఏమైనా పనులను విస్మరించారా? బరాజ్‌లు ఎందుకు విఫలమయ్యాయి? వాటి పునరుద్ధరణకు ఏం చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై వారిని ప్రశ్నించింది. నేడు ఏఈలు, ఏఈఈలను విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment