రాజకీయ రచ్చ | Political fuss | Sakshi
Sakshi News home page

రాజకీయ రచ్చ

Published Sat, Nov 16 2013 12:33 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

Political fuss

=సమైక్యవాదాన్ని దెబ్బతీసే ఎత్తుగడ
 =ప్రజలకు సంక్షేమ పథకాల ఎర
 =రొటీన్ పనులనే చేస్తున్న వైనం
 =ఉనికికోసం కాంగ్రెస్ నేతల తాపత్రయం
 =నేడు చిల్లకల్లులో సీఎం రచ్చబండ

 
 ఆకస్మికంగా ఏదో ఒక ఊరుకు వెళ్లి అక్కడి ప్రజలతో మమేకమై.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసి.. వారికేం కావాలో అడిగి.. ప్రత్యేకంగా నిధులిచ్చి.. అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టాలనేది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన రచ్చబండ లక్ష్యం.
 
 ప్రభుత్వ యంత్రాంగం పాలనాపరంగా జిల్లాలో రోజువారీ.. రొటీన్‌గా చేసే పనులనే రచ్చబండలో చేయడం.. పింఛన్, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు వంటి వాటిని రచ్చబండ సభల్లో మంజూరుచేయడం.. ఎప్పుడో దరఖాస్తు చేసినవారు రచ్చబండ  నిర్వహించే వరకు పడిగాపులు కాయడం.. ఇలా రచ్చబండకు రాజకీయ రంగు పులిమి ప్రజలను దారికి తెచ్చుకుని.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ లబ్ధి పొందాలన్నది ప్రస్తుత కిరణ్ సర్కార్ అసలు ఉద్దేశం.
 
సాక్షి, మచిలీపట్నం :  జిల్లాలో ప్రజలకు రోజువారీగా చేయాల్సిన పనులను సైతం తామేదో గొప్పగా చేస్తున్నట్టు ఘనంగా అంకెలు చూపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తాపత్రయపడుతోంది. తాజాగా మూడో విడత సాగుతోన్న రచ్చబండ సభల తీరు చూస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తాయి. అర్హులెవరైనా దరఖాస్తు చేసుకుంటే ఆ రోజుకారోజే మంజూరుచేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం రచ్చబండ వరకు లబ్ధిదారులను వేచి ఉండేలా చేస్తోంది. రచ్చబండ సభలకు పెద్దఎత్తున వస్తున్న లబ్ధిదారులను చూసి వారంతా కాంగ్రెస్‌కు అనుకూలురన్న భ్రమల్లో ఆ పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి.

వాస్తవానికి నెలల తరబడి తమకు రావాల్సిన పింఛన్, రేషన్ కార్డు వంటి వాటి కోసం ఎదురుచూసిన ప్రజలే సభలకు వస్తున్నారన్న సంగతిని పార్టీ నేతలు మరిచిపోతున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూల నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌పై జిల్లాలో పెద్దఎత్తున నిరసన జ్వాలలు రేగిన సంగతి తెల్సిందే. వంద రోజులకుపైగా సాగుతున్న సమైక్య ఉద్యమ సెగతో జనంలోకి ఎలా వెళ్లాలో తెలియని కాంగ్రెస్ నేతలు రచ్చబండను అడ్డుపెట్టుకుని బయటకు వస్తున్నారు. ప్రజలకు తాయిలాల ఎరవేస్తూ సమైక్యవాదాన్ని దెబ్బతీసే ప్రయత్నంతోపాటు రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకు ప్రజాప్రతినిధులు తాపత్రయపడుతున్నారు. సమైక్య ఉద్యమకారులకు భయపడి పోలీస్ పహరా నడుమ జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
 
గత రచ్చబండవే..


ప్రస్తుతం ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న మూడో విడత రచ్చబండలో కొత్త లబ్ధిదారులు ఎవరూ లేరు. గతంలో దరఖాస్తులు పెట్టుకున్నవారికే ఇప్పుడు అందిస్తున్నారు. జిల్లాలో 2011 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 12 వరకు మొదటి విడత, 2011 నవంబర్ 2 నుంచి 30 వరకు రెండో విడత రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 11న ప్రారంభమైన మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని 26 వరకు నిర్వహిస్తారు.  

రెండో విడత  కార్యక్రమంలో జిల్లాలో రేషన్ కార్డుల కోసం 96,618 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిలో 70,789 దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని  56,913 మందికి అర్హత ఉన్నట్టు నిర్ధారించారు. ప్రస్తుత రచ్చబండలో 45,442 కుటుంబాలకు కొత్త కార్డులు, 11,471 ఉమ్మడి కుటుంబాలకు అదనంగా కార్డులు జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. వీరికి తాత్కాలికంగా ఏడు నెలల రేషన్ కూపన్లు జారీ చేస్తున్నామని ప్రకటించారు.

జిల్లాలో 44,218 మంది పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకోగా వారిలో అర్హులందరికీ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. 1,261 మందికి బంగారుతల్లి సర్టిఫికెట్లను జారీ చేస్తామని చెబుతున్నారు. ఇంకా ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ కలలు, ఎస్సీ, ఎస్టీలకు కరెంటు సౌకర్యం వంటి పథకాల ద్వారా మొత్తం రూ. 281 కోట్ల లబ్ధి పొందుతారని పేర్కొంటున్నారు.  ప్రస్తుత రచ్చబండ కార్యక్రమంలో వర్తింపజేస్తున్న ఆరు పథకాల్లోనూ చాలావరకు రోజువారీగా లబ్ధిదారులకు అందించే అవకాశం ఉన్నా నెలల తరబడి కాలయాపన చేసి చివరకు ఎన్నికల ఘడియలు దగ్గర పడ్డాక ఇప్పుడు రచ్చబండలో ఇస్తుండడం గమనార్హం.
 
అమలుకు నోచని మంత్రి హామీలు

2011 నవంబర్ 10న చిల్లకల్లులో జరిగిన రచ్చబండ సభలో మంత్రి కొలుసు పార్థసారథి ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అప్పట్లో నియోజకవర్గం మొత్తంమీద 13,398 దరఖాస్తులు వస్తే, మూడో విడతలో 4,880 దరఖాస్తులు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. మరి మిగిలినవాటి సంగతేమిటో ముఖ్యమంత్రే చెప్పాల్సిఉందని ప్రజలు వ్యాఖ్యా నిస్తున్నారు.
 
సీఎం పర్యటన ఇలా..


ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉదయం 10.30 గంటలకు హెలికాఫ్టర్‌లో జగ్గయ్యపేటలోని ఎస్.జి.ఎస్. కళాశాలకు  చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గాన చిల్లకల్లులో జరిగే రచ్చబండ కార్యక్రమానికి వెళతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి కళాశాలకు వచ్చి భోజనం చేస్తారు.  1.30 గంటలకు హెలికాఫ్టర్‌లో తిరిగి బయల్దేరివెళతారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement