ఆదిలోనే హంసపాదు | His first political houses raccabanda | Sakshi
Sakshi News home page

ఆదిలోనే హంసపాదు

Published Tue, Nov 12 2013 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM

His first political houses raccabanda

=సొంత ఇలాకాలో మంత్రి ప్రసంగం పట్టించుకోని జనం
 =తమ సమస్యలు పరిష్కారం కాలేదని మండిపాటు
 =సమైక్య ఎఫెక్ట్‌తో భారీగా పోలీసుల మోహరింపు
 =రాజకీయ సభల్లా తొలిరోజు రచ్చబండ

 
రచ్చబండ తొలిరోజు జిల్లాలో పోలీసు పహరా మధ్య నిర్వహించారు. పెనమలూరు, విజయవాడ నగర పరిధిలోని నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నిలదీయకుండా ముందస్తు అరెస్టులు చేపట్టారు.
 
సాక్షి, మచిలీపట్నం : ప్రజా సమస్యలు పరిష్కరిస్తేనే రాజకీయ పార్టీకి మనుగడ ఉంటుంది.. అటువంటి పార్టీ నాయకుడి మాటలనే ప్రజలు నమ్ముతారు.. అందుకు విరుద్ధంగా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ప్రయోజనముండదు. రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి పెనమలూరులో నిర్వహించిన రచ్చబండ సభ దీనికి అద్దం పట్టింది. మూడోవిడత రచ్చబండ సభలు సోమవారం మంత్రి సొంత నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు మండల కేంద్రాల్లో నిర్వహించారు.

ఆదిలోనే హంసపాదు అన్నట్టు రచ్చబండ సభ తొలిరోజే మంత్రి మాటలు వినేందుకు సొంత నియోజకవర్గ ప్రజలే ఆసక్తి చూపలేదు. ముఖ్యమంత్రి కిరణ్ ఘనకీర్తిని చాటేందుకు మంత్రి తాపత్రయపడినా ఆలకించేవారే కరువయ్యారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, కరెంటు కనెక్షన్లు, బంగారుతల్లి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ వంటి పథకాల్లో లబ్ధిరులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. అయినా మంత్రి సభలో కూర్చుని ఆయన ప్రసంగం వినే ఆసక్తి చూపలేదు. ఆయా పథకాల కౌంటర్ల వద్ద లబ్ధిదారులు బారులుతీరారు.
 
మంత్రి అసహనం...

 పెనమలూరు మండలంలోని పది గ్రామాల లబ్ధిదారులు దాదాపు 1,500 మందిని రచ్చబండ సభకు సమీకరించినా.. మంత్రి ప్రసంగించే సమయంలో సభా వేదిక వద్ద సుమారు 300 మంది మాత్రమే ఉన్నారు. తన ప్రసంగం వినేందుకు జనం ఆసక్తిచూపకపోవడంతో ఒక దశలో మంత్రి తీవ్ర అసహనానికి లోనయ్యారు. దీంతో అధికారులు అప్రమత్తమై లబ్ధిదారుల నమోదు కౌంటర్లను సభ ముగిసేవరకు నిలిపివేయాల్సి వచ్చింది.
 
సీపీఎం ఆధ్వర్యంలో మంత్రి నిలదీత...

సీపీఎం డివిజన్ కార్యదర్శి హరిబాబు పేదలతో కలిసి వచ్చి పేదోళ్ల ఇళ్ల స్థలాల సమస్యను పట్టించుకోవడం లేదంటూ మంత్రిని నిలదీశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క తాము ఎన్ని పర్యాయాలు దరఖాస్తులు చేసుకున్నా పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలు అందడంలేదంటూ ప్రజలు మండిపడ్డారు. సమైక్యాంధ్ర సెగతో భయపడిన ప్రభుత్వ యంత్రాంగం మంత్రి పాల్గొన్న రచ్చబండ సభకు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంతంలో సుమారు 250 మంది వరకు పోలీసులు మోహరించారు. జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, సబ్ కలెక్టర్ డి.హరిచందన, డీఆర్‌డీఏ పీడీ కె.శివశంకర్  తదితరులు పాల్గొన్నా ఈ కార్యక్రమం రాజకీయ సభ మాదిరిగానే సాగింది.
 
సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా..

రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు మంత్రి సారథి స్పష్టం చేశారు. పెనమలూరులో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తీరుబడిగా స్పందించారు. పెనమలూరు రచ్చబండ అనంతరం అదే నియోజకవర్గంలోని కంకిపాడులో సభలో మంత్రి సారథితో పాటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, జిల్లా పౌరసరఫరాల అధికారిణి సంధ్యారాణి, డీఆర్‌డీఏ పీడీ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సమయంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి శివ మంత్రి సారథి ప్రసంగానికి అడ్డుపడుతూ మూడేళ్లు మీరు ఏం చేశారని నిలదీశారు. తాను పెనమలూరు మండలంలో రూ.200 కోట్లు, కంకిపాడు మండలంలో రూ.45 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని, గ్రామగ్రామాన చర్చకు సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు.
 
ఈ నేపథ్యంలో వివాదాన్ని సర్దుబాటు చేసేలా పోలీసులు రంగంలోకి దిగి శివను అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం నాయకులు రంగారావు, కోటేశ్వరరావు ప్రజాసమస్యలపై మంత్రి సభలో వినతిపత్రం సమర్పించారు. పునాదిపాడు మహిళలు ఇళ్లస్థలాల విషయంలో మంత్రిని నిలదీశారు. మొత్తానికి తొలిరోజు రచ్చబండ సభలో ఎదురైన సమస్యలు, సవాళ్లను స్వీకరించి అమాత్యుడు ప్రజలకు కావలసిన అవసరాలపై దృష్టిపెడతారా లేదా అనేది వేచిచూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement