పింఛనేది సారూ!
Published Mon, Oct 21 2013 2:19 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
బోధన్ మండలం ఈట్‌పల్లికి చెందిన వడ్డె పోశవ్వ (70) పింఛన్ కోసం పోస్టాఫీసుకు వెళ్లి ఎండ ప్రతాపంతో ప్రాణాలు విడిచింది. ఆమె అనారోగ్యం కారణంగా వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోలేకపోయింది. మూడో నెల కూడా పింఛను తీసుకోకపోతే రద్దవుతుందన్న భయంతో పోస్టాఫీసుకు వచ్చింది. మొదటిసారి వెళ్లినప్పుడు పింఛను రాలేదని పోస్టల్ సిబ్బంది చెప్పి పంపించారు. రెండో సారి మే నెల పదో తేదీన ఎండలో వెళ్లిన పోశవ్వ.. వేడిమి ని తట్టుకోలేక అక్కడే చనిపోయింది. ఈనెల ఏడున ఆర్మూర్ పట్టణానికి చెందిన మూడబోయిన పెద్దసాయన్న (60) పింఛన్ డబ్బుల కోసం పోస్టాఫీసుకు వెళ్లాడు. అసలే అనారోగ్యం, గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సి రావడంతో తట్టుకోలేక అక్కడే మరణించాడు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న పింఛన్ల మంజూరు సంగ తి దేవుడెరుగు.. ప్రస్తుతం ప్రతి నెల పంపిణీ చేసే పింఛన్ డబ్బుల కోసం లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పటం లేదు. ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్లను 15వ తేదీ వరకు కూడా చెల్లించడం లేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పోస్టాఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అనారోగ్యానికి తోడు చేతకాని వయసు లో పింఛన్ల కోసం తిరగడం వృద్ధుల ప్రాణాల మీదకు వస్తోంది. ఐదు నెలల కాలంలోనే ఇలా పింఛన్ కోసం వెళ్లిన ఇద్దరు వృద్ధులు మృత్యువాత పడ్డారు.
అప్పుడే బాగుండే..
సామాజిక భద్రతలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పింఛన్ల పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పింఛన్ డబ్బులను పెంచడంతో పాటు ప్రతి నెల ఒకటో తేదీనే లబ్ధిదారులకు డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. మహిళా గ్రూపుల్లో ఆరు పదుల వయసు నిండినవారికి అభయహస్తం పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రతి నెల రూ. 500 అందే విధంగా కృషి చేశారు. వృద్ధాప్య పింఛన్లను రూ. 75 నుంచి రూ. 200కు, వికలాంగుల పింఛన్‌ను రూ. 500కు పెంచారు. చేనేత, కల్లుగీత కార్మికులకు కూడా రూ. 200 పింఛన్ అందించారు. చంద్రబాబు జమానాలో పింఛన్ పొందుతున్న వారిలో ఒకరు చనిపోతేనే కొత్తగా మరొకరికి పింఛన్ మంజూరు చేసేవారు.
వైఎస్ ఈ విధానానికి స్వస్తి చెప్పి అర్హులైన అందరికీ పింఛన్లను అందించారు. బడుగుల జీవితాలకు భద్రత కల్పించారు. మహానేత మరణానంతరం మళ్లీ వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు కష్టాలు వచ్చాయి. అనర్హుల ఏరివేత పేరుతో కిరణ్ సర్కారు అర్హులైనవారి పింఛన్లనూ రద్దు చేసింది. పైగా పింఛన్లు కూడా ప్రతినెల ఒకటిన పంపిణీ చేయలేకపోతోంది. కొర్రీలు పెట్టి సామాజిక భద్రత కింద పంపిణీ చేస్తున్న పింఛన్లకు స్వస్తి పలకాలనే కుట్రలు, కుతంత్రాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో 2,61,229 మందికి సామాజిక భద్రత పింఛన్లను అందించేవారు. ఇప్పుడు 2.47,563 మందికే ఈ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వివిధ కారణాలు చెప్పి 13,666 మంది పింఛన్లను తొలగించారు.
‘రచ్చబండ’కు మోక్షమెప్పుడో..
రచ్చబండ-1, రచ్చబండ-2 కార్యక్రమాల్లో పింఛన్ల కోసం 91,366 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 61,366 మంది పింఛన్లకు అర్హులని జిల్లా అధికారులు గుర్తించి, ఏడాది కిందట ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటికి ఇప్పటి వరకు మోక్షం లభించలేదు. దీంతో దరఖాస్తుదారులు పింఛన్ కోసం కలెక్టరేట్, ఆర్డీవో, తహశీల్, ఎంపీడీఓ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కనబడిన నేతనల్లా వేడుకుంటున్నా ఫలితం లేదు. వికలాంగులు, మానసిక వైకల్యం ఉన్నవారు, నడవడానికి ఇబ్బంది పడే వృద్ధులు, వితంతువులు సైతం పింఛన్ కోసం తిరుగుతూనే ఉన్నారు.
ఇదీ పరిస్థితి
ప్రస్తుతం జిల్లాలో 2,47,563 మంది పింఛన్ లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 6.50 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 1,34,841 పింఛన్లు వృద్ధులవి కాగా, 64,715 పింఛన్లు వితంతువులవి ఉన్నాయి. వికలాంగుల పింఛన్లు 25,889, చేనేత కార్మికుల పింఛన్లు 1057, కల్లుగీత కార్మిక పింఛన్లు 720, అభయహస్తం పింఛన్లు 20,341 వరకు ఉన్నాయి. పింఛను డబ్బులను ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇష్టమొచ్చినప్పుడు ఇస్తున్నారు. ఒక నెలలో 1 నుంచి 5 వ తేదీ వరకు ఇస్తుండగా, మరో నెలలో 5 నుంచి 10వ తేదీ వరకు, మరికొన్ని సార్లయితే నెలాఖరులో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో పింఛన్‌దారులు నెల మొత్తం పింఛన్ల డబ్బుల కోసం పోస్టాఫీసులు, ఐకేపీ సిబ్బంది ఇళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛన్లను కచ్చితమైన తేదీల్లో పంపిణీ చేయాలని, లబ్ధిదారుల వద్దకే పింఛన్లను తీసుకొచ్చి ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Advertisement