=నేటి నుంచి రచ్చబండ-3 నిర్వహణ
= మండల కేంద్రాలకే పరిమితం
= లబ్ధిదారులకు పథకాల పంపిణీతో సరి
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రహస్య రచ్చబండకు సర్వం సిద్ధమైంది. రెండో విడతలో రచ్చగా మారిన ఈ కార్యక్రమం ఇప్పుడు మండల కేంద్రాలకే పరిమితమవుతోంది. అప్పట్లో సమావేశం జరిగిన ప్రతీ చోటా ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు నిలదీశారు. ముఖ్యంగా మంత్రి బాలరాజును ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో తీవ్ర సమస్యలు నెలకొన్నాయి. దీంతో రచ్చబండ-2 మాదిరిగా ఈసారి ఎటువంటి ఆందోళనలు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
పథకాలకు కనీసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా లేకుండా మూడో విడతను నిర్వహిస్తోంది. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకొని వారిని ఆదుకోవాలన్న సంకల్పంతో 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం దీనికి బ్రేక్ పడింది. 2011 ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి విడత రచ్చబండను గ్రామస్థాయిలో నిర్వహించింది. వైఎస్ పథకాలు సక్రమంగా అమలు కాకపోవడంతో అప్పట్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
దీంతో అదే ఏడాది నవంబర్‌లో నిర్వహించిన రచ్చబండ-2ను మండల కేంద్రాలకే పరిమితం చేసింది. మునుపటిలా ఇప్పుడూ వ్యతిరేకత ఉంటుందన్న భయంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం లబ్ధిదారులను మినహా మిగిలిన వారిని సమావేశాలకు రానీయకుండా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు భీమిలిలో జరిగే సమావేశానికి రాష్ట్ర ఓడరేవులు, పెట్టుబడులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అలాగే రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు ఉదయం పాడేరులోను, మధ్యాహ్నం హుకుంపేటలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పథకాలు పంపిణీ
2010లో జరిగిన రచ్చబండలో రేషన్‌కార్డులు, పించన్లు, ఇళ్ల కోసం వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాటితో పాటు ప్రజావాణి, ఇతరత్రా కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలతో లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేశారు. వారందరికీ ముందుగా స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. కేవలం వారినే సమావేశాలకు తీసుకొచ్చే బాధ్యతను అధికారులు భుజాన్నెత్తుకున్నారు. దీని ప్రకారం జిల్లాలో 1,37,201 మందికి రేషన్‌కార్డులు, 31,841 మందికి పెన్షన్లు, 37,228 మందికి ఇళ్లు రానున్నాయి. వీటన్నింటినీ ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు జరిగే రచ్చబండ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో అందజేయనున్నారు. బంగారుతల్లి పథకంలో ఎంపిక చేసిన 1067 మందికి రూ.26.77 లక్షలను బాండ్ల రూపంలో పంపిణీ చేయనున్నారు.
హాస్టళ్లకు శంకుస్థాపన
ఇవన్నీ కాకుండా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ కింద ఎస్సీ, ఎస్టీల కోసం కమ్యూనిటీ హాళ్లు, హాస్టళ్లు నిర్మిస్తున్నారు. వాటికి రచ్చబండ కార్యక్రమంలోనే శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో 8 హాస్టళ్లకు రూ.1.48 కోట్లు, 10 కమ్యూనిటీ హాళ్లకు రూ.75 లక్షలతో నిర్మాణాలను ప్రారంభించనున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.37.82 కోట్లతో 925 రోడ్ల నిర్మాణాలకూ రచ్చబండలోనే శ్రీకారం చుట్టనున్నారు.