సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి బుధవారం హాజరయ్యే ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని మూకుమ్మడిగా బహిష్కరించాలని జిల్లా కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. సీఎంతో మొదటి నుంచి సన్నిహితంగా వ్యవహరిస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే, జయప్రకాశ్‌రెడ్డి నిర్ణయం మేరకు సీఎం పర్యటన ఖరారైంది. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను సంప్రదించకుండానే కార్యక్రమం ఖరారు కావడం ‘రచ్చ’కు దారి తీసింది. డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డిని డిప్యూ టీ సీఎం దామోదర సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు.
అక్కడ నుంచే జహీరాబాద్ ఎంపీ షెట్కార్, మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం స్వయంగా ఫోన్ చేశారు. ‘ఓ వైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షను వ్యతిరేకిస్తూ, మరోవైపు జిల్లాలో పర్యటించడంపై నిరసన తెలుపుదామంటూ’ దామోదర ప్రతిపాదించారు. డిప్యూటీ ప్రతిపాదనకు జిల్లా నేతలంతా అంగీకారం తెలిపినట్లు డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. ‘తెలంగాణను అడ్డుకుంటానంటూ ప్రకటిస్తూ మరోవైపు సీఎం జిల్లాకు రావడం సిగ్గుచేటు. సీఎంను ఆహ్వానిస్తే ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ను ఆహ్వానిం చడం ప్రభుత్వ విప్ జయప్రకాశ్‌రెడ్డి సొంత నిర్ణయంటూ బయటకు ప్రకటిస్తున్నా, లోలోన కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఢిల్లీ స్థాయిలో తెలంగాణ అంశం మీద కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో సీఎం ను ఆహ్వానించడం అవసరమా’ అంటూ సదరు ఎమ్మెల్యే ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పిలుపు నేపథ్యంలో జయప్రకాశ్‌రెడ్డి మినహా కాంగ్రెస్ నేతలు హాజరయ్యే సూచన కనిపించడం లేదు.
13న బంద్‌కు టీఆర్‌ఎస్ పిలుపు
కిరణ్ రాకను నిరసిస్తూ ఈ నెల 13న మెదక్ జిల్లా బంద్‌కు టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. బంద్‌కు సంఘీభావం ప్రకటించిన టీజేఏసీ ఇతర పక్షాలు బీజేపీ, సీపీఐతో పాటు వివిధ సంఘాల మద్దతును కూడగట్టే యోచనలో ఉంది. సీఎం రాక నేపథ్యంలో టీఆర్‌ఎస్, టీజేఏసీ ముఖ్య నేతలు రెండు రోజులుగా వ్యూహం ఖరారు చేయడంలో నిమగ్నమయ్యారు. సీఎం పర్యటనను కాంగ్రెస్ నేతలు బహిష్కరించడంతో, బంద్ ద్వారా తమ నిరసన చాటాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. కిరణ్ రాకపై వివిధ వర్గాల నుంచి నిరసన వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచార సేకరణలో నిమగ్నమయ్యాయి. నిజామాబాద్ రేంజ్ డీఐజీ అనిల్ కుమార్ స్వయంగా జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మకాం వేసి బందోబస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
సీఎం పర్యటనపై ఇంకా అధికారిక సమాచారం అందలేదంటూనే జిల్లా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. సీఎం ప్రయాణించే మార్గంలో రోడ్ల మరమ్మతు, వెల్టూరులో గ్రామసభ, సదాశివపేటలో బహిరంగ సభ నిర్వహణపై ప్రణాళిక రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి సహాయ నిరాకరణ నేపథ్యంలో అధికార యంత్రాంగం సహకారంతో సీఎం సభను విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సొంత పార్టీ నేతలు మూకుమ్మడి బహిష్కరణ, ఢిల్లీలో అఖిల పక్ష భేటీలు, ఇతర పరిణామాల నేపథ్యంలో సీఎం కిరణ్ పర్యటన చివరి నిమిషం వరకూ అనుమానంగానే కనిపిస్తోంది.