=అధికారిక కమిటీల్లో ముగ్గురికి చోటు
=ఈ ముగ్గురూ కాంగ్రెస్ వారే ఉండే అవకాశం
=కమిటీ ఖరారు అధికారం ఇన్‌చార్జ్ మంత్రికి
=మండల స్థాయిలో మాత్రమే రచ్చబండ కార్యక్రమం
=ఈసారి లబ్ధిదారులకే పరిమితం కానున్న సభలు
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఈనెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న మూడోవిడత రచ్చబండ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మారనుంది. మండల కేంద్రాల్లో ఇద్దరు ప్రజా ప్రతినిధులు, ఏ పదవిలో లేకపోయినా మరొకరు కలసి లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేసేందుకు వేదికపై అధికారికంగా కూర్చునే విధంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ ముగ్గురినీ ఎంపిక చేసే అధికారం కూడా జిల్లా ఇన్‌చార్జి మంత్రికి ఇచ్చారు.
ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో విభజన ప్రకటన దెబ్బకు ప్రజల్లోకి వెళ్లలేని కాంగ్రెస్‌పార్టీ శ్రేణులను ఇలా పాల్గొనేలా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. మండలస్థాయిలో ఒక ప్రజాప్రతినిధి, మరో ఇద్దరు అనధికారిక ప్రతినిధులు (ఇందులో ఒక మహిళ) ఉండేవిధంగా రచ్చబండ మండల కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే అధికార పార్టీ మద్దతుతో గెలిచిన ప్రతినిధులను, అనధికారిక ప్రతినిధులుగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి లేదా ఎమ్మెల్యే సూచించేవారినే ఈ కమిటీల్లో నియమించనున్నారు.
దీంతో రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యే వారందరినీ తమకు ఓటు బ్యాంకు గా మలచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన ఎత్తుగడగా పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలోని అన్ని చోట్లా కమిటీలే రచ్చబండలో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గతంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు రచ్చబండ వేదికలపై అధికారులు కానివారిని అడ్డుకుని నిలదీశారు. ఈ నేపథ్యంలో అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చి కాంగ్రెస్ నాయకులను రచ్చబండ వేదికలు ఎక్కిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈసారి రచ్చబండ పూర్తిగా కాంగ్రెస్ రంగు పులుముకుని ఒక పార్టీ కార్యక్రమంగా జరగనుంది.
ఆరు అంశాలకే పరిమితం
2010లో మొదటి విడత రచ్చబండ గ్రామస్థాయిలో నిర్వహిం చారు. రెండవ విడత 2011లో కేవలం మండల స్థాయికే పరి మితం చేసి రచ్చబండ సభలు నిర్వహించారు. ఇప్పుడు కూడా 3వ విడత రచ్చబండ మండల కేంద్రాల్లో మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 11వ తేదీ నుంచి 26 వరకు రచ్చబండ సభలు నిర్వహిస్తారు. మున్సిపాల్టీల్లోనూ అన్ని వార్డులకు కలిపి ఒకే రోజు రచ్చబండ నిర్వహించనున్నారు. పూర్తిగా రచ్చబండను కుదించి కేవలం రేషన్‌కార్డులు, పింఛన్‌ల పంపిణీ, గృహనిర్మాణ లబ్ధిదారులకు అనుమతి ఉత్తర్వులు ఇవ్వడం, ఇందిరమ్మకలల కింద వివిధ అభివృద్ధిపనులకు ప్రారంభోత్సవాలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బకాయి ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లింపులకే పరిమితం చే శారు. ఇందుకు అనుగుణంగానే అధికారులు కార్యక్రమాన్ని రూ పొందించనున్నారు.
లబ్ధిదారులకే పరిమితం
ఈసారి రచ్చబండ కార్యక్రమాన్ని కేవలం లబ్ధిదారులకే పరిమితం చేయనున్నారు. గతంలోలా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఈసారి రచ్చబండలో అవకాశం లేదు. కేవలం లబ్ధిదారులు మాత్రం ముందుగానే రచ్చబండ సభకు రావాలని, రేషన్‌కార్డు, పింఛన్ మంజూరయ్యాయని తెలుపుతూ అధికారిక లేఖలు పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. లబ్ధిదారులకు మం జూరు స్లిప్పులు ముందే ఇచ్చి వారిని రచ్చబండ సభల వద్దకు తీసుకురావాలని, ఖర్చులను ఆయా విభాగాల రెగ్యులర్ బడ్జెట్ నుంచి భరించాలని ఉత్తర్వులు అందాయి.