=వినతులు తీసుకోరట
=రేషన్ కూపన్ల పంపిణీ
=ఇందిరమ్మ కలలు, బంగారుతల్లి పథకాలకు ప్రాధాన్యత
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రజాసమస్యల పరిష్కారం కోసం రూపకల్పన చేసిన మూడో విడత రచ్చబండ కార్యక్రమం జిల్లాలో నేటినుంచి ప్రారంభం కానుంది. ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటుచేయగా ప్రజల నుంచి ఈసారి వినతులు స్వీకరించరని అధికారులు చెబుతున్నారు. గత రెండు విడతలుగా జరిగిన రచ్చబండలో వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి వారికి ఆయా పథకాల్లో లబ్ధి చేకూర్చనున్నారు. ప్రతి గ్రామంలోనూ రచ్చబండ కార్యక్రమం చేపట్టి అక్కడి సమస్యలను తెలుసుకోవాల్సి ఉండగా ఈ కార్యక్రమాన్ని కుదించారు.
పట్టణాలు, మండల కేంద్రాలకే పరిమితం...
పురపాలక సంఘాల్లో, మండల కేంద్రాల్లో మాత్రమే ఈసారి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తారు. లబ్ధిదారులను అక్కడికే తీసుకొచ్చి వివిధ పథకాల సర్టిఫికెట్లు, పింఛన్లు అందజేస్తారు. గ్రామాల్లో, పురపాలక సంఘాల్లో నెలకొన్న సమస్యలు, నూతనంగా రేషన్‌కార్డులు, పింఛన్లు, వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందాలనుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించబోమని అధికారులు చెబుతుండటంతో ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటుచేశారనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది.
రెండో విడత రచ్చబండలో వచ్చిన దరఖాస్తుల్లో గుర్తించినవారికి ప్రయోజనం కలిగించి పార్టీ ప్రచారానికి ఈ కార్యక్రమాన్ని అన్వయించుకునేలా మూడో విడత రచ్చబండను ఏర్పాటు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బంగారు తల్లి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తదితర పథకాలను ప్రచారం చేసేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గతంలో ఇచ్చిన రేషన్‌కార్డులకు ఏడు నెలలకు సరిపడా కూపన్లు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ప్రజాసమస్యలు పట్టించుకోకుండా.. వారి నుంచి వినతులు స్వీకరించకుండా.. కార్యక్రమం ఏర్పాటుచేస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది. రచ్చబండ కార్యక్రమంలో వినతులు స్వీకరించకుంటే కార్యక్రమం అభాసుపాలయ్యే అవకాశముందని చెబుతున్నారు.
తొలిరోజు మూడు ప్రాంతాల్లో...
సోమవారం ఉదయం పది గంటలకు మంత్రి పార్థసారథి నియోజకవర్గమైన పెనమలూరులో, మధ్యాహ్నం మూడు గంటలకు కంకిపాడులో, విజయవాడ కార్పొరేషన్‌లో మూడు ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. రూరల్ ప్రాంతంలోని కైకలూరు, ఉయ్యూరు ప్రాంతాల్లో మంగళవారం ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. మిగిలిన కార్యక్రమాల షెడ్యూలు ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు.
ఏడు నెలలకు కూపన్లు...
రెండో విడత రచ్చబండలో రేషన్‌కార్డుల కోసం 96,618 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 56,913 మంది అర్హులుగా గుర్తించి, 45,442 మందికి రేషన్‌కార్డులతో పాటు ఏడు నెలలకు సంబంధించిన రేషన్ కూపన్లు అందజేయనున్నారు. రెండో విడత రచ్చబండలో వివిధ రకాల పింఛన్ల కోసం 44,218 దరఖాస్తులు రాగా వాటిలో 39,019 మంది లబ్ధిదారులు అర్హులని గుర్తించారు. మూడో విడత రచ్చబండలో 45,108 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నారు. వీటిలో 19,053 వృద్ధాప్య, 4871 వికలాంగ, 21,184 వితంతు పింఛన్లు అందజేయనున్నారు.
ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకంలో భాగంగా 1261 మంది లబ్ధిదారులకు సర్టిఫికెట్లతో పాటు ఒక్కొక్కరికి రూ.2,500 అందజేయనున్నారు. రెండో విడత రచ్చబండలో గృహనిర్మాణం కోసం 59,963 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 48,605 మంది అర్హులని గుర్తించారు. అర్హులైన వారందరికీ గృహనిర్మాణం చేసుకునేందుకు అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులో భాగంగా జిల్లాలో 28 ప్రాంతాల్లో కమ్యూనిటీ భవనాలు నిర్మించనున్నారు.
ఒక్కొక్క భవనానికి రూ.7.5 లక్షల నిధులు మంజూరు చేస్తారు. మూడు ప్రాంతాల్లో ఇందిరా విద్యానిలయాలు నిర్మించేందుకు అనుమతి ఇస్తారు. ఒక్కొక్క భవనానికి రూ.2.5 కోట్లు ఖర్చు అవుతుందని నిర్ణయించారు. ఇవి కాకుండా మరో 11 భవనాల నిర్మాణానికి రూ.52.97 కోట్లు ఖర్చు చేయనున్నారు. నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుకున్న 30,539 ఎస్సీ కుటుంబాలకు, 8,526 ఎస్టీల కుటుంబాలకు విద్యుత్ బిల్లులు చెల్లించనున్నారు.