=ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బిల్లులపై సర్కారు ఆంక్షలు
=అధికారుల ఖాతాల్లో మూలుగుతున్న రూ.31.35 కోట్లు
వరంగల్, న్యూస్‌లైన్ : 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న ఎస్టీ, ఎస్సీ వర్గాల బిల్లులు ఇచ్చేందుకు ప్రభుత్వం రోజుకో తరహాలో వ్యవహరిస్తోంది. మొదట్లో.. నేరుగా ఇవ్వవద్దని, ఆన్‌లైన్ నుంచి తీసుకోవాలంటూ డిస్కంకు సూచించింది. అంతేకాకుండా ప్రతీ వినియోగదారుడి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత రచ్చబండ సభల్లో ఇస్తామని, ఐటీడీఏకు జాబితా ఇవ్వాలని, మండలం, గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను తీసుకుంది.
రచ్చబండ సభల్లో ఆ పేర్లను ప్రకటించినా... బిల్లు మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత ఆన్‌లైన్లో నమోదు చేసిన జాబితాను గ్రామస్థాయిలో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది ధ్రువీకరించాలంటూ ప్రభుత్వం మరో ఆంక్ష పెట్టింది. ఈ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తవుతున్న సమయంలో ‘కాలనీ’ నిబంధనలు విధించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలు దళిత కాలనీ, గిరిజన తండాల్లో నివసిస్తేనే ఉచిత కరెంట్‌కు అర్హులంటూ ఉత్తర్వులిచ్చింది. ఇతర వర్గాల సముదాయంలో నివసించే వారికి ఉచితం వర్తించదని తేల్చింది.
కేవలం కాలనీల్లో నివసించే వారికి మాత్రమే ఉచిత విద్యుత్ అనడంతో ఇప్పుడు ఆ బిల్లులు సగానికి తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాకుండా 2007 నుంచి విద్యుత్‌ను వినియోగిస్తున్న ఈ వర్గాలు ఇప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలంటూ కొత్తగా ఆదేశాలిచ్చింది. ఆ సర్టిఫికెట్లను పరిశీలించి, వాటిని విద్యుత్ అధికారులు తీసుకుని వాటిని ప్రభుత్వానికి అర్హుల జాబితాతో కలిపి నివేదించాలి. అప్పుడు బిల్లులు జారీ చేస్తామంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మళ్లీ ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మరో నాలుగు నెలలు గడుస్తుందని విద్యుత్ శాఖ భావిస్తోంది.
రూ.కోట్లకు చేరిన పెండింగ్ బిల్లులు
జిల్లా వ్యాప్తంగా ఎస్సీ వర్గాలకు చెందిన కనెక్షన్‌లు 92 వేలు, ఎస్టీలవి 76వేలు ఉన్నాయి. వీటిలో 50 యూనిట్ల పరిధిలో విద్యుత్ వినియోగించిన వారి లెక్క తేల్చారు. 47734 ఎస్సీ, 29918 ఎస్టీ వర్గాలకు చెందిన కనెక్షన్లకు ఉచిత విద్యుత్ వర్తింస్తుందని తేలింది. 2007 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ వర్గాల కనెక్షన్లపై రూ.25.87 కోట్లు, ఎస్టీల కనెక్షన్లపై రూ.19.35 కోట్లు ప్రభుత్వం డిస్కంకు బాకీ పడింది. వీటిలో ప్రభుత్వం ఎస్సీ కనెక్షన్లపై రూ.12 కోట్లు, ఎస్టీలకు రూ.19.35 కోట్లు నాలుగు నెలల కిందటే విడుదల చేసి సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డెరైక్టర్ల ఖాతాల్లో వేసింది. అరుుతే కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తిచేయడానికి నాలుగు నెలలు సమయం పడుతుందని విద్యుత్ శాఖ చెబుతున్నందున అప్పటి వరకు ఆ సొమ్ము బ్యాంకులోనే మూలుగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఊరికి దూరంగా ఉంటేనే ‘ఉచితం’!
Published Thu, Dec 26 2013 4:10 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement
Advertisement