విభజన ప్రకటనతో తీవ్ర మనోవేదనకు గురై ఆర్టీసీ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సోమశేఖర్‌రాజు (54) బుధవారం బస్‌స్టేషన్ ప్రాంగణంలో పత్రికలో విభజన వార్తలను చదువుతూ తీవ్ర ఉద్వేగానికి లోనై తుదిశ్వాస విడిచారు. సమైక్యాంధ్ర కోసం ఉపాధ్యాయుడు బట్టా శంకరయ్య యాదవ్ మృతిని మరచిపోకనే సోమశేఖర్‌రాజు తనువు చాలించడం జిల్లా వాసులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది.
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : విభజన ప్రకటనతో తీవ్ర మనోవేదనకు గురై ఆర్టీసీ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సోమశేఖర్‌రాజు (54) బుధవారం బస్‌స్టేషన్ ప్రాంగణంలో పత్రికలో విభజన వార్తలను చదువుతూ తీవ్ర ఉద్వేగానికి లోనై తుదిశ్వాస విడిచారు. సమైక్యాంధ్ర కోసం ఉపాధ్యాయుడు బట్టా శంకరయ్య యాదవ్ మృతిని మరచిపోకనే సోమశేఖర్‌రాజు తనువు చాలించడం జిల్లా వాసులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది.
సౌమ్యుడు, స్నేహశీలి సోమశేఖర్‌రాజు
సోమశేఖర్‌రాజు స్వస్థలం గూడూరు. విధి నిర్వహణలో అంకిత భావం, నిబద్ధతతో పనిచేస్తూ అంచెలంచెలుగా పదోన్నతి పొంది ప్రస్తుతం జోనల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్ విభాగంలో ట్రాఫిక్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉన్నతాధికారుల మన్ననలు అందుకోవడంతోపాటు సహ ఉద్యోగులు, కార్మికులతో స్నేహంగా మెలిగేవారు. సహృదయుడు, స్నేహశీలి అయిన సోమశేఖరరాజు మృతి పలువురు కార్మికులు, అధికారులను కలచివేసింది.
కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు : నిద్రావస్థలో ఉన్నట్టుగా పడిఉన్న సోమశేఖర్‌రాజు మృతదేహాన్ని చూసి ఆయన భార్య,బిడ్డలు కన్నీరుమున్నీరయ్యారు. పైకి లేవమని కోరుతూ భార్య, కుమారుడు తట్టితట్టి లేపడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది.
పలువురు నివాళి : ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖర్‌రాజు మృతదేహాన్ని ఏజేసీ పెంచలరెడ్డి, ఆర్‌ఎం చింతా రవికుమార్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు, ఎన్‌జీఓ సంఘ నాయకులు సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
భౌతికకాయానికి ఊరేగింపు... : మరో సమిధనగరంలోని ప్రధాన బస్‌స్టేషన్ నుంచి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల వరకు రాజు మృతదేహాన్ని ఊరేగించారు. ఎన్‌జీఓలు, ఆర్టీసీ కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జోహార్లర్పించారు.
ఎన్‌జీఓల ప్రతిన : సోమశేఖర్‌రాజు మృతి సమాచారం తెలుసుకున్న ఎన్‌జీఓలు అధికసంఖ్యలో మోటార్ సైకిళ్లలో ఎన్‌జీఓ భవన్ నుంచి బస్‌స్టేషన్ ప్రాంగణానికి చేరుకున్నారు. జోహార్ సోమశేఖర్‌రాజు, జై సమైక్యాంధ్ర నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. సోమశేఖరరాజు ఆత్మార్పణను వృథా కానివ్వబోమని, ఆయన ఆశయ సాధన కోసం విశ్రమించకుండా పోరాటం సాగిస్తామని ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో నారాయణరావు, శామ్యూల్, మహబూబ్, రమణరాజు, పెంచలరెడ్డి, ఏఎస్‌ఆర్ కుమార్, ఏవీ గిరిధర్, రమేష్‌రెడ్డి, శేఖర్, మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.