ఉధృతంగా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం
Published Thu, Oct 10 2013 3:08 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
సాక్షి, అనంతపురం :రోజులు గడిచే కొద్దీ సమైక్య ఉద్యమం మరింత బలపడుతోంది. 71వ రోజైన బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మె చేపట్టిన విద్యుత్ ఉద్యోగులు ఉదయం ఆరు నుంచి రాత్రి వరకు కరెంటు సరఫరా నిలిపేశారు. విద్యుత్ కోత, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సమ్మె వల్ల మూడో రోజు కూడా జిల్లా సర్వజనాస్పత్రిలో రోగులకు ఇక్కట్లు తప్పలేదు. జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా అంతటా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాం కులు, ఏటీఎంలను బంద్ చేశారు. అనంతపురం నగరంలో విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ నాయకులు ర్యాలీలు నిర్వహించా రు. కలిసుంటే కలదు సుఖం, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అందరి జీవితాల్లో వెలుగులు.. అంటూ నినదించారు. సమైక్యవాది మల్లికార్జున నాయక్ మృతికి సంతాపసూచికంగా ఉద్యోగ సంఘాలు శాంతి ర్యాలీ నిర్వహించాయి. స్థానిక టవర్ క్లాక్
కూడలిలో ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు కేంద్ర మంత్రులకు పిండప్రదానం చేశారు. ఆర్య వైశ్యులు భారీ ర్యాలీ.. ఆటపాటలతో సమైక్య వాణి వినిపించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి.. సప్తగిరి, టవర్ క్లాక్ కూడళ్లలో మానవహారం నిర్మించారు. పంచాయతీ రాజ్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆ శాఖ నాల్గో తరగతి ఉద్యోగులకు దసరా పండుగ సరుకులను ఎస్‌ఈ అందజేశారు. సమైక్యవాదులు ఎస్కేయూ నుంచి ఆకుతోటపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో కాసేపు తోపులాట జరిగింది. ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిమర్రిలో జేఏసీ ఆధ్వర్యాన కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలకు సమాధి కట్టి.. పిండప్రదానం చేశారు. రాష్ట్రం విడి పోతే నీటి చుక్క కూడా దొరకదంటూ గుంతకల్లులో జేఏసీ నాయకులు బిందె నీరు రూ.500లకు విక్రయిస్తూ నిరసన తెలిపారు.
పామిడిలో జేఏసీ నాయకులు చిరంజీవి, బొత్స, కావూరి వేషధారణలో సోనియాగాంధీ చుట్టూ భజన చేస్తున్నట్లుగా ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంత్రుల మాస్కులు ధరించి ర్యాలీ చేశారు. స్థానిక సద్భావన సర్కిల్‌లో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు రోడ్లు ఊడ్చారు. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్‌లో హాస్టల్ వార్డెన్లు ఒక్క రోజు సామూహిక దీక్ష చేపట్టారు. వీరికి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మద్దతు తెలిపారు. తలుపులలో సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు. కళ్యాణదుర్గంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్య నినాదాలు చేస్తూ.. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు.
మడకశిరలో జేఏసీ నాయకులు ఇండేన్ గ్యాస్ గోదామును ముట్టడించారు. అమరాపురం, రొళ్లలో విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ నాయకులు ర్యాలీలు, మానవహారం చేపట్టారు. సెల్‌టవర్ ఎక్కి సమైక్య నినాదాలు చేశారు. పుట్టపర్తిలో విద్యుత్ సరఫరా లేక సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యసేవలు బంద్ అయ్యాయి. బుక్కపట్నంలో ఆమరణ దీక్ష చేపట్టిన విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది. మల్లికార్జున నాయక్ మృతికి సంతాపంగా పెనుకొండలో ఉపాధ్యాయులు శాంతి ర్యాలీ, భిక్షాటన చేపట్టారు. కేసీఆర్, దిగ్విజయ్, సోనియా దిష్టిబొమ్మలకు సమాధి కట్టి పిండప్రదానం చేశారు. పెనుకొండ, పుట్టపర్తి, శింగనమల, గార్లదిన్నె, ఉరవకొండలో జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూసివేయించారు.
పరిగిలో భారీ ర్యాలీ చేశారు. తాడిపత్రిలో మానవహారం నిర్మించారు. కణేకల్లులో ముస్లింల సమైక్య గర్జనకు వేలాది మంది తరలివచ్చారు. కనగానపల్లిలో సమైక్యవాది రామచంద్రారెడ్డి చేపట్టిన 48గంటల దీక్షను విరమించారు. రాప్తాడులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పుట్లూరులో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించి.. కార్యాలయాలు బంద్ చేయించారు. వజ్రకరూరులో పందికుంట గ్రామస్తులు సైకిల్ ర్యాలీ చేపట్టారు. కూడేరు, బెళుగుప్పలో రహదారిపై ఆందోళన చేశారు.
Advertisement