అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యోగులు చేపట్టిన సమ్మె సూక్ష్మ సేద్యంపై ప్రభావం చూపుతోంది. డ్రిప్ యూనిట్లు కావాలంటే దరఖాస్తుతో పాటు మట్టి, నీటి పరీక్షలకు సంబంధించి నమూనా పత్రాలు జత చేయాల్సిరావడంతో రైతుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
డ్రిప్‌తో పాటు సెమి పర్మనెంట్ స్ప్రింక్లర్ల యూనిట్లకూ అదే పరిస్థితి. దీంతో ఈ ఏడాది సకాలంలో డ్రిప్ యూనిట్లు మంజూరయ్యేలా కనిపించడం లేదు. 2013-14 సంవత్సరానికి సంబంధించి సరిగ్గా ఆరు నెలల తరువాత ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ)కి కమిషనరేట్ నుంచి టార్గెట్లు ఖరారయ్యాయి. జిల్లా అధికారులు 20 వేల హెక్టార్లకు డ్రిప్ అవసరమని పంపిన ప్రతిపాదనలు పక్కనపెట్టి తొలివిడతగా 5,900 హెక్టార్లకు సరిపడా డ్రిప్ యూనిట్లు కేటాయించారు. 1700 హెక్టార్లకు సెమి పర్మనెంట్ స్ప్రింక్లర్లు కేటాయించినా వాటిపై రైతులు అనాసక్తి ప్రదర్శిస్తూ వస్తున్నారు.
గతేడాది కూడా జిల్లాకు 1,100 హెక్టార్లు టార్గెట్ ఇచ్చినా అందులో 100 హెక్టార్లకు కూడా రైతులు వినియోగించుకోలేదు. దీన్ని బట్టి చూస్తే వీటి అవసరం రైతులకు లేదనే విషయం అర్థమవుతుంది. వాటి ప్రయోజనాల గురించి ఆ శాఖ అధికారులు అవగాహన కల్పించడం లేదు. ఈ కారణంగా 90 శాతం మంది రైతులు డ్రిప్ కోసం ఎగబడుతున్నారు. గత జనవరి నుంచి దాదాపు 9 నెలల పాటు డ్రిప్ యూనిట్ల మంజూరు ప్రక్రియను ఆపేశారు. దీంతో 8 నుంచి 9 వేల మంది రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఎపుడెపుడా అని ఎదురుచూసే క్రమంలో కమిషనరేట్ నుంచి టార్గెట్లు ఖరారు చేయడంతో రైతులు సంబరపడ్డారు. కానీ... ఈ సారి కొత్త నిబంధన పెట్టడంతో మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది.
దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా మట్టి, నీటి పరీక్షలు చేయించి వాటి నమూనా పత్రాలు జత చేయాలనే షరతు విధించారు. గతంలో మట్టి, నీటి నమూనాలు ఎప్పుడిచ్చినా దాంతో సంబంధం లేకుండా డ్రిప్ యూనిట్లు మంజూరయ్యేవి.
ఇప్పటికే వాటి నమూనాలు లేకుండా వేలాది మంది రైతులు దరఖాస్తులు సమర్పించారు. ఇపుడు వాటిని వెనక్కి తీసుకుని నమూనా పత్రాలు జమ చేయాల్సి ఉంది. ఇప్పటికిపుడు మట్టి, నీటి పరీక్షలు చేయించుకోవాలనే అలాంటి సదుపాయం అందుబాటులో లేదు. అధికారులు సమైక్య సమ్మెలో ఉన్నందున భూసార, నీటి పరీక్ష ప్రయోగాలలు నిరవధికంగా మూతబడ్డాయి. ప్రయోగశాల తెరచినా సిబ్బంది కొరత కారణంగా వేగంగా పరీక్షలు చేసే పరిస్థితి లేదు. కొత్త నిబంధన వల్ల డ్రిప్ రైతులకు సకాలంలో యూనిట్లు అందడం కష్టంగా మారింది.
సూక్ష్మ సేద్యానికి బ్రేక్
Published Mon, Oct 14 2013 1:38 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement