కళ్యాణదుర్గం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి మరోసారి ‘సమైక్య’ సెగ తగిలింది. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి, సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు ఆదివారం కళ్యాణదుర్గంలోని రఘువీరా ఇంటిని ముట్టడించారు. మంత్రి కళ్యాణదుర్గానికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న జేఏసీ నాయకులు ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. గంట పాటు అక్కడే బైఠాయించారు. మంత్రి బయటకు రావాలని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే, మంత్రి స్పందించలేదు. దీనికి ఆగ్రహించిన జేఏసీ నాయకులు.. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు.
వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు తోపులాట జరిగింది. జేఏసీ నాయకులు పెద్దఎత్తున సమైక్య నినాదాలు చేస్తూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. చివరకు మంత్రి రఘువీరా జేఏసీ నాయకుల వద్దకు వచ్చారు. ఆయన రాగానే ఉద్యమకారులు ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని మరింత హోరెత్తించారు. ఉద్యమంలో పాల్గొనాలని మంత్రిని పట్టుబట్టారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. మంత్రి మాత్రం గంట పాటు మౌనం వీడలేదు. చివరకు ఇలా నినాదాలు చేస్తే ఫలితం లేదని, అందరం కూర్చుని సమస్యపై చర్చించుకుందామని జేఏసీ నాయకులను కోరారు.
అనంతరం మంత్రి నివాసంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు రాయల్ వెంకటేశులు, కన్వీనర్ మాధవ్, కో-కన్వీనర్లు జె.నాగరాజు, పోతుల రాధాకృష్ణ, మల్లారెడ్డి, చల్లా కిశోర్, అశోక్, ఈశ్వరయ్య, నరసింహులు, మోరేపల్లి నారాయణ, పాల్గుణప్రసాద్ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజులకు పైగా సమైక్య ఉద్యమం సాగుతున్నా స్థానిక ఎమ్మెల్యే అయిన మీరు ఇక్కడి స్థితిగతులను పట్టించుకోకపోవడం బాధాకరమని మంత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి స్పందిస్తూ తాను ముమ్మాటికీ సమైక్యవాదినేనని అన్నారు. దీంతో ఉద్యమకారులు శాంతించారు.
రాజీనామాలతో సాధించేదేమీ లేదు
‘మా రాజీనామాలతో సాధించేదేమీ లేదు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఇప్పటికీ కృషి చేస్తున్నాం. అసెంబ్లీకి తీర్మానం వస్తే మా అభిమతం వ్యక్తం చేస్తాం. విభజన జరిగితే మేం శిక్షార్హులం. ప్రజలు ఏ శిక్ష విధించినా శిరసావహిస్తాం. పదవుల కోసం డ్రామాలాడాల్సిన దౌర్భాగ్యస్థితిలో నేను లేన’ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. సొంత నియోజకవర్గం కళ్యాణదుర్గం వైపు మూడు నెలలకుపైగా కన్నెత్తి చూడని మంత్రి రఘువీరా ఆదివారం ఇక్కడికి వచ్చారు. ఆయనకు సమైక్యవాదుల నుంచి నిరసన సెగ తగిలింది.
మంత్రి రఘువీరాకు సమైక్య సెగ
Published Mon, Nov 11 2013 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
Advertisement
Advertisement