minister raghu veera reddy
-
మంత్రి రఘువీరాకు సమైక్య సెగ
కళ్యాణదుర్గం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి మరోసారి ‘సమైక్య’ సెగ తగిలింది. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి, సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు ఆదివారం కళ్యాణదుర్గంలోని రఘువీరా ఇంటిని ముట్టడించారు. మంత్రి కళ్యాణదుర్గానికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న జేఏసీ నాయకులు ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. గంట పాటు అక్కడే బైఠాయించారు. మంత్రి బయటకు రావాలని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే, మంత్రి స్పందించలేదు. దీనికి ఆగ్రహించిన జేఏసీ నాయకులు.. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు తోపులాట జరిగింది. జేఏసీ నాయకులు పెద్దఎత్తున సమైక్య నినాదాలు చేస్తూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. చివరకు మంత్రి రఘువీరా జేఏసీ నాయకుల వద్దకు వచ్చారు. ఆయన రాగానే ఉద్యమకారులు ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని మరింత హోరెత్తించారు. ఉద్యమంలో పాల్గొనాలని మంత్రిని పట్టుబట్టారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. మంత్రి మాత్రం గంట పాటు మౌనం వీడలేదు. చివరకు ఇలా నినాదాలు చేస్తే ఫలితం లేదని, అందరం కూర్చుని సమస్యపై చర్చించుకుందామని జేఏసీ నాయకులను కోరారు. అనంతరం మంత్రి నివాసంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు రాయల్ వెంకటేశులు, కన్వీనర్ మాధవ్, కో-కన్వీనర్లు జె.నాగరాజు, పోతుల రాధాకృష్ణ, మల్లారెడ్డి, చల్లా కిశోర్, అశోక్, ఈశ్వరయ్య, నరసింహులు, మోరేపల్లి నారాయణ, పాల్గుణప్రసాద్ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజులకు పైగా సమైక్య ఉద్యమం సాగుతున్నా స్థానిక ఎమ్మెల్యే అయిన మీరు ఇక్కడి స్థితిగతులను పట్టించుకోకపోవడం బాధాకరమని మంత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి స్పందిస్తూ తాను ముమ్మాటికీ సమైక్యవాదినేనని అన్నారు. దీంతో ఉద్యమకారులు శాంతించారు. రాజీనామాలతో సాధించేదేమీ లేదు ‘మా రాజీనామాలతో సాధించేదేమీ లేదు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఇప్పటికీ కృషి చేస్తున్నాం. అసెంబ్లీకి తీర్మానం వస్తే మా అభిమతం వ్యక్తం చేస్తాం. విభజన జరిగితే మేం శిక్షార్హులం. ప్రజలు ఏ శిక్ష విధించినా శిరసావహిస్తాం. పదవుల కోసం డ్రామాలాడాల్సిన దౌర్భాగ్యస్థితిలో నేను లేన’ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. సొంత నియోజకవర్గం కళ్యాణదుర్గం వైపు మూడు నెలలకుపైగా కన్నెత్తి చూడని మంత్రి రఘువీరా ఆదివారం ఇక్కడికి వచ్చారు. ఆయనకు సమైక్యవాదుల నుంచి నిరసన సెగ తగిలింది. -
మహనీయుల త్యాగాలు ఆదర్శం
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: బ్రిటిష్ సామ్రాజ్యపు బానిస సంకెళ్ల నుంచి భరతమాతకు విముక్తి కల్పించి ప్రజలకు స్వాతంత్య్రం ప్రసాదించిన జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ఎందరో మహనీయుల త్యాగాలే మనందరికీ ఆదర్శమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. మహనీయుల స్ఫూర్తితో అభివృద్ధికి పునరంకితులై అందరం కలిసి ‘అనంత’ ప్రగతి చక్రాలను విజయవంతంగా ముందుకు నడిపిద్దామని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ పరెడ్ మైదానంలో గురువారం నిర్వహించిన 67వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులు సాంబమూర్తి, గంగిరెడ్డిలను సన్మానించారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎన్.లోకేష్‌కుమార్, ఎస్పీ ఎస్.శ్యాంసుందర్‌తో పాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి రఘువీరా ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. = జిల్లా రైతులను ఆదుకునేందుకు భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్, మరో 25 మంది జాతీయ అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సిఫారసులతో రూ.7,676 కోట్లతో ‘ప్రాజెక్టు అనంత’ను రూపొందించి కేంద్ర ప్రణాళిక కమిషన్‌కు సమర్పించాం. అమలు కోసం నిధులు కావాలని కోరాం. ఈ ఖరీఫ్‌లో 52 శాతం తక్కువగా వర్షాలు నమోదైనా 9.24 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో ఇప్పటివరకు 6.23 లక్షల హెక్టార్లలో పంటలు విత్తుకున్నారు. తక్కిన విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటలు వేయించడానికి చర్యలు చేపడుతాం. 3.28 లక్షల మంది రైతులకు రూ.62 కోట్ల రాయితీతో 2.94 లక్షల క్వింటాళ్లు విత్తన వేరుశనగ పంపిణీ చేశాం. వడ్డీలేని పంట రుణాల కింద 5.21 లక్షల మంది రైతులకు రూ.2,179 కోట్లు అందించాం. 2012లో వర్షాభావం వల్ల నష్టపోయిన వేరుశనగ రైతులకు రూ.648.88 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద విడుదల చేశాం. అందులో ఇప్పటికే 3.27 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.333 కోట్లు జమ అయింది. వాతావరణ బీమా పథకం కింద రూ.181 కోట్లు రైతు ఖాతాల్లోకి వేశాము. 1.90 లక్షల పంపుసెట్లకు 7 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. = జలయజ్ఞం కింద రూ.6,850 కోట్లతో చేపట్టిన హంద్రీ-నీవా మొదటి దశను పూర్తి చేసి కర్నూలు జిల్లా మల్యాల నుంచి 8 పంపుహౌస్‌ల ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు తెచ్చాం. వారం రోజుల క్రితం 700 క్యూసెక్కులు కృష్ణానీటిని హంద్రీనీవాకు వదిలాం. జీడిపల్లి రిజర్వాయర్, గుంతకల్లు ప్రాంతంలో ఉన్న మూడు చెరువులను నింపి 10 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం. పీఏబీఆర్ రెండో దశ కింద 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించడానికి చేపట్టిన యాడికి కాలువ పనులకు దాదాపు రూ.493 కోట్లు ఖర్చు పెట్టి 90 శాతం పనులు పూర్తి చేశాం. అన్ని మున్సిపాల్టీలలో దాదాపు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. పాలనా సౌలభ్యం కోసం కొత్తగా కళ్యాణదుర్గం, కదిరి రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశాం. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 32,496 ఆర్జీలను పరిష్కరించాం. ఐకేపీ ద్వారా ఈ ఏడాది 20,398 మహిళా స్వయం సంఘాల గ్రూపులను రూ.595 కోట్లు వడ్డీలేని రుణాలు బ్యాంకుల ద్వారా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందిరమ్మ పచ్చతోరణం కింద 6,936 ఎకరాల ప్రభుత్వ భూమిని 3,820 మంది ఎస్సీ ఎస్టీ లబ్దిదారులకు కేటాయించి పట్టాలు పంపిణీ చేశాం. ఉపాధిహామీ పథకం ద్వారా ఈ ఏడాది ఇప్పటివరకు రూ.188 కోట్లు ఖర్చు చేసి 4.46 లక్షల మంది కూలీలను పనులు కల్పించాం. జిల్లాలో 61 మోడల్‌స్కూల్స్‌ను ప్రారంభించి 8 వేల మంది నిరుపేద విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాం. మధ్యాహ్న భోజన పథకం ద్వారా 4,055 ప్రభుత్వ పాఠశాలల్లో 3.77 లక్షల మందికి పౌష్టికాహారం అందిస్తున్నాం. రాజీవ్ విద్యామిషన్ ద్వారా రూ.21.31 కోట్లతో 3.07 లక్షల మందికి రెండు జతల యూనిఫాంలు అందించాము. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పడకల సంఖ్య 350 నుంచి 500కు పెంచాం. బీఆర్జీఎఫ్ కింద రూ.38.56 కోట్లతో 2571 పనులు చేపట్టడానికి ప్రణాళిక రూపొందించాం. 27 వేల మంది చేనేత కార్మికులకు ప్రతి నెలా రూ.600 విలువ చేసే పట్టుదారం రాయితీ ఇప్పటివరకు రూ.2 కోట్లు ఇచ్చాం. వీవర్స్ క్రెడిట్ కార్డు పథకం కింద 430 మంది లబ్ధిదారులకు రూ.1.30 కోట్లు రుణసదుపాయాన్ని కల్పించాం. -
ఒకే లక్ష్యం.. ఒకటే గమ్యం
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడం కోసం 16 రోజులుగా సాగుతున్న ఉద్యమం జిల్లాలో పతాక స్థాయికి చేరింది. సమైక్యాంధ్ర కోసం ప్రజలు గాంధేయ మార్గాన్ని ఎంచుకున్నారు. స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న రాష్ర్ట విభజన నిర ్ణయంపై మండిపడుతున్నారు. గురువారం అనంతపురంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డికి న్యాయవాదుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ‘గో బ్యాక్ రఘువీరా.. చీమూ, నెత్తురు లేని రఘువీరా’ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల వలయంలో మంత్రి రఘువీరా పరేడ్ గ్రౌండ్‌లోని వేదిక వద్దకు చేరారు. మంత్రిని అడ్డుకునేందుకు యత్నించిన న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం విడుదల చేశారు. మువ్వన్నెల జెండా ఎగురవేసిన మంత్రి రఘువీరా ప్రసంగం మొదలుపెట్టగానే ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి అడ్డుకున్నారు. పరేడ్ గ్రౌండ్లోకి ప్రజలను రానివ్వకుండా ఎక్కడికక్కడ నియంత్రించి.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారని మంత్రిని నిలదీశారు. కింద కూర్చొని నిరసన తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద పంచాయతీరాజ్ ఉద్యోగుల జేఏసీ నేతృత్వంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి మద్దతు పలికారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని, అలాంటప్పుడు ఆ కమిటీని ఎందుకు నియమించారని ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్యం కోసం ఉద్యోగులు పోరాటాలు చేయడం అభినందనీయమన్నారు. జిల్లా కేంద్రంలో జాక్టో నేతలు, పెన్నార్భవన్ ఉద్యోగులు, నాన్పొలిటకల్ జేఏసీ, న్యాయవాదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు నిరసన ర్యాలీలతో హోరెత్తించారు. నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు నడిరోడ్డుపై క్షవరాలు చేసి నిరసన తెలిపారు. ఈ నెల 19 నుంచి జరగనున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని ఎస్కేయూ విద్యార్థి జేఏసీ నాయకులు ప్రకటించారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలన్నదే తమ అభిమతమని ఎస్కేయూ ప్రొఫెసర్లు రాజేశ్వరరావు, మురళీకృష్ణ, సదాశివరెడ్డి స్పష్టీకరించారు. శుక్రవారం నుంచి అత్యవసర వైద్యసేవలు మినహా తతిమా సేవలన్నీ బంద్ చేస్తున్నామని వైద్య ఆరోగ్య జేఏసీ నాయకులు ప్రకటించారు. గురువారం జరిగిన వైద్యుల ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు. ధర్మవరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సమైక్యవాదం ఢిల్లీకి వినిపించేలా ప్రజలందరూ కలిసి కట్టుగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని సూచించారు. గుంతకల్లులో కాంగ్రెస్ నాయకులు గురువారం నుంచి ఆమరణ దీక్షలు ప్రారంభించారు. సమైక్యాంధ్రను కోరుతూ విద్యార్థులు గుత్తిలో 1067 అడుగుల పొడవున్న జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు దీక్షను కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్రను కోరుతూ న్యాయవాదులు పావురాలను ఎగురవేశారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్ విజయమ్మ విజయవాడలో చేపట్టనున్న దీక్షకు మద్దతుగా కళ్యాణదుర్గంలో గురువారం వైఎస్సార్ సీపీ ట్రే డ్ యూనియన్ నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. అమరాపురంలో సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీపీ నేత త్రిలోక్‌నాథ్ ఆమరణ దీక్ష రెండోరోజుకు చేరింది. పుట్టపర్తి నియోజకవర్గంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీలు మిన్నంటాయి. రాయదుర్గంలో సమైక్యాంధ్ర కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఎస్ఎస్ వలికి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. రాయదుర్గం గార్మెంట్స్ కార్మికులు నడిరోడ్డుపై జీన్స్ ప్యాంట్లు కుట్టి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్టీల్ వ్యాపారులు, గుజరీ వ్యాపారులు, విద్యార్థులు, గార్మెంట్స్ యజమానులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రాప్తాడులో ఎమ్మార్పీఎస్ నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. తాడిపత్రిలో లయన్స్‌క్లబ్, రోటరీ క్లబ్, వాసవీ క్లబ్ సభ్యుల రిలే దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. యాడికిలో ఉపాధి కూలీలు ర్యాలీ నిర్వహించారు. గోరంట్లలో 1200, ధర్మవరంలో వెయ్యి అడుగుల పొడవున్న జాతీయ పతాకాలతో సమైక్యవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు.