అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: బ్రిటిష్ సామ్రాజ్యపు బానిస సంకెళ్ల నుంచి భరతమాతకు విముక్తి కల్పించి ప్రజలకు స్వాతంత్య్రం ప్రసాదించిన జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ఎందరో మహనీయుల త్యాగాలే మనందరికీ ఆదర్శమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. మహనీయుల స్ఫూర్తితో అభివృద్ధికి పునరంకితులై అందరం కలిసి ‘అనంత’ ప్రగతి చక్రాలను విజయవంతంగా ముందుకు నడిపిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
స్థానిక పోలీస్ పరెడ్ మైదానంలో గురువారం నిర్వహించిన 67వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులు సాంబమూర్తి, గంగిరెడ్డిలను సన్మానించారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎన్.లోకేష్‌కుమార్, ఎస్పీ ఎస్.శ్యాంసుందర్‌తో పాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
మంత్రి రఘువీరా ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
= జిల్లా రైతులను ఆదుకునేందుకు భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్, మరో 25 మంది జాతీయ అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సిఫారసులతో రూ.7,676 కోట్లతో ‘ప్రాజెక్టు అనంత’ను రూపొందించి కేంద్ర ప్రణాళిక కమిషన్‌కు సమర్పించాం. అమలు కోసం నిధులు కావాలని కోరాం.
ఈ ఖరీఫ్‌లో 52 శాతం తక్కువగా వర్షాలు నమోదైనా 9.24 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో ఇప్పటివరకు 6.23 లక్షల హెక్టార్లలో పంటలు విత్తుకున్నారు. తక్కిన విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటలు వేయించడానికి చర్యలు చేపడుతాం. 3.28 లక్షల మంది రైతులకు రూ.62 కోట్ల రాయితీతో 2.94 లక్షల క్వింటాళ్లు విత్తన వేరుశనగ పంపిణీ చేశాం. వడ్డీలేని పంట రుణాల కింద 5.21 లక్షల మంది రైతులకు రూ.2,179 కోట్లు అందించాం. 2012లో వర్షాభావం వల్ల నష్టపోయిన వేరుశనగ రైతులకు రూ.648.88 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ కింద విడుదల చేశాం. అందులో ఇప్పటికే 3.27 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.333 కోట్లు జమ అయింది. వాతావరణ బీమా పథకం కింద రూ.181 కోట్లు రైతు ఖాతాల్లోకి వేశాము. 1.90 లక్షల పంపుసెట్లకు 7 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.
= జలయజ్ఞం కింద రూ.6,850 కోట్లతో చేపట్టిన హంద్రీ-నీవా మొదటి దశను పూర్తి చేసి కర్నూలు జిల్లా మల్యాల నుంచి 8 పంపుహౌస్‌ల ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు తెచ్చాం. వారం రోజుల క్రితం 700 క్యూసెక్కులు కృష్ణానీటిని హంద్రీనీవాకు వదిలాం. జీడిపల్లి రిజర్వాయర్, గుంతకల్లు ప్రాంతంలో ఉన్న మూడు చెరువులను నింపి 10 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం. పీఏబీఆర్ రెండో దశ కింద 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించడానికి చేపట్టిన యాడికి కాలువ పనులకు దాదాపు రూ.493 కోట్లు ఖర్చు పెట్టి 90 శాతం పనులు పూర్తి చేశాం. అన్ని మున్సిపాల్టీలలో దాదాపు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం.
పాలనా సౌలభ్యం కోసం కొత్తగా కళ్యాణదుర్గం, కదిరి రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశాం. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 32,496 ఆర్జీలను పరిష్కరించాం. ఐకేపీ ద్వారా ఈ ఏడాది 20,398 మహిళా స్వయం సంఘాల గ్రూపులను రూ.595 కోట్లు వడ్డీలేని రుణాలు బ్యాంకుల ద్వారా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఇందిరమ్మ పచ్చతోరణం కింద 6,936 ఎకరాల ప్రభుత్వ భూమిని 3,820 మంది ఎస్సీ ఎస్టీ లబ్దిదారులకు కేటాయించి పట్టాలు పంపిణీ చేశాం. ఉపాధిహామీ పథకం ద్వారా ఈ ఏడాది ఇప్పటివరకు రూ.188 కోట్లు ఖర్చు చేసి 4.46 లక్షల మంది కూలీలను పనులు కల్పించాం.
జిల్లాలో 61 మోడల్‌స్కూల్స్‌ను ప్రారంభించి 8 వేల మంది నిరుపేద విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాం. మధ్యాహ్న భోజన పథకం ద్వారా 4,055 ప్రభుత్వ పాఠశాలల్లో 3.77 లక్షల మందికి పౌష్టికాహారం అందిస్తున్నాం. రాజీవ్ విద్యామిషన్ ద్వారా రూ.21.31 కోట్లతో 3.07 లక్షల మందికి రెండు జతల యూనిఫాంలు అందించాము.
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పడకల సంఖ్య 350 నుంచి 500కు పెంచాం.
బీఆర్‌జీఎఫ్ కింద రూ.38.56 కోట్లతో 2571 పనులు చేపట్టడానికి ప్రణాళిక రూపొందించాం.
27 వేల మంది చేనేత కార్మికులకు ప్రతి నెలా రూ.600 విలువ చేసే పట్టుదారం రాయితీ ఇప్పటివరకు రూ.2 కోట్లు ఇచ్చాం. వీవర్స్ క్రెడిట్ కార్డు పథకం కింద 430 మంది లబ్ధిదారులకు రూ.1.30 కోట్లు రుణసదుపాయాన్ని కల్పించాం.
మహనీయుల త్యాగాలు ఆదర్శం
Published Fri, Aug 16 2013 5:33 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement