అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడం కోసం 16 రోజులుగా సాగుతున్న ఉద్యమం జిల్లాలో పతాక స్థాయికి చేరింది. సమైక్యాంధ్ర కోసం ప్రజలు గాంధేయ మార్గాన్ని ఎంచుకున్నారు. స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న రాష్ర్ట విభజన నిర ్ణయంపై మండిపడుతున్నారు.
గురువారం అనంతపురంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డికి న్యాయవాదుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ‘గో బ్యాక్ రఘువీరా.. చీమూ, నెత్తురు లేని రఘువీరా’ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల వలయంలో మంత్రి రఘువీరా పరేడ్ గ్రౌండ్‌లోని వేదిక వద్దకు చేరారు.
మంత్రిని అడ్డుకునేందుకు యత్నించిన న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం విడుదల చేశారు. మువ్వన్నెల జెండా ఎగురవేసిన మంత్రి రఘువీరా ప్రసంగం మొదలుపెట్టగానే ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి అడ్డుకున్నారు. పరేడ్ గ్రౌండ్‌లోకి ప్రజలను రానివ్వకుండా ఎక్కడికక్కడ నియంత్రించి.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారని మంత్రిని నిలదీశారు. కింద కూర్చొని నిరసన తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద పంచాయతీరాజ్ ఉద్యోగుల జేఏసీ నేతృత్వంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి మద్దతు పలికారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని, అలాంటప్పుడు ఆ కమిటీని ఎందుకు నియమించారని ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్యం కోసం ఉద్యోగులు పోరాటాలు చేయడం అభినందనీయమన్నారు.
జిల్లా కేంద్రంలో జాక్టో నేతలు, పెన్నార్‌భవన్ ఉద్యోగులు, నాన్‌పొలిటకల్ జేఏసీ, న్యాయవాదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు నిరసన ర్యాలీలతో హోరెత్తించారు. నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు నడిరోడ్డుపై క్షవరాలు చేసి నిరసన తెలిపారు. ఈ నెల 19 నుంచి జరగనున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని ఎస్కేయూ విద్యార్థి జేఏసీ నాయకులు ప్రకటించారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలన్నదే తమ అభిమతమని ఎస్కేయూ ప్రొఫెసర్లు రాజేశ్వరరావు, మురళీకృష్ణ, సదాశివరెడ్డి స్పష్టీకరించారు.
శుక్రవారం నుంచి అత్యవసర వైద్యసేవలు మినహా తతిమా సేవలన్నీ బంద్ చేస్తున్నామని వైద్య ఆరోగ్య జేఏసీ నాయకులు ప్రకటించారు. గురువారం జరిగిన వైద్యుల ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు. ధర్మవరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సమైక్యవాదం ఢిల్లీకి వినిపించేలా ప్రజలందరూ కలిసి కట్టుగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని సూచించారు. గుంతకల్లులో కాంగ్రెస్ నాయకులు గురువారం నుంచి ఆమరణ దీక్షలు ప్రారంభించారు.
సమైక్యాంధ్రను కోరుతూ విద్యార్థులు గుత్తిలో 1067 అడుగుల పొడవున్న జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు దీక్షను కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్రను కోరుతూ న్యాయవాదులు పావురాలను ఎగురవేశారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్ విజయమ్మ విజయవాడలో చేపట్టనున్న దీక్షకు మద్దతుగా కళ్యాణదుర్గంలో గురువారం వైఎస్సార్ సీపీ ట్రే డ్ యూనియన్ నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. అమరాపురంలో సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్‌సీపీ నేత త్రిలోక్‌నాథ్ ఆమరణ దీక్ష రెండోరోజుకు చేరింది. పుట్టపర్తి నియోజకవర్గంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీలు మిన్నంటాయి.
రాయదుర్గంలో సమైక్యాంధ్ర కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఎస్‌ఎస్ వలికి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. రాయదుర్గం గార్మెంట్స్ కార్మికులు నడిరోడ్డుపై జీన్స్ ప్యాంట్లు కుట్టి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్టీల్ వ్యాపారులు, గుజరీ వ్యాపారులు, విద్యార్థులు, గార్మెంట్స్ యజమానులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రాప్తాడులో ఎమ్మార్పీఎస్ నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. తాడిపత్రిలో లయన్స్‌క్లబ్, రోటరీ క్లబ్, వాసవీ క్లబ్ సభ్యుల రిలే దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. యాడికిలో ఉపాధి కూలీలు ర్యాలీ నిర్వహించారు. గోరంట్లలో 1200, ధర్మవరంలో వెయ్యి అడుగుల పొడవున్న జాతీయ పతాకాలతో సమైక్యవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఒకే లక్ష్యం.. ఒకటే గమ్యం
Published Fri, Aug 16 2013 5:29 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement