కోడి పందేలను అడ్డుకుని తీరుతామన్న పోలీసులు
ఈసారి డ్రోన్లను రంగంలోకి దించిన వైనం
బరులు గుర్తింపు.. నిర్వాహకుల ఏర్పాట్లుపై నిఘా
మూడు రోజులుగా కోళ్లకు కత్తులు కట్టేవారి బైండోవర్
తీరా వారి ఆంక్షలను కాదని జోరుగా కోడి పందేల ఏర్పాట్లు
అధికార పార్టీ నేతల ఆశీస్సులతో రంగంలోకి దిగిన నిర్వాహకులు
ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బరులు సిద్ధం
పొరుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న పందేల రాయుళ్లు
ఈ మూడు రోజులు ఎక్కడి పోలీసులక్కడే గప్‌చుప్!
సాక్షి, అమరావతి: టెక్నాలజీ పేరుతో హడావుడి చేయడంలో రాష్ట్ర పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబును మించిపోయారు. చంద్రబాబు మాట్లాడితే డ్రోన్ల ప్రస్తావన చేస్తుంటారు. ఆయన కంటే తామేమి తక్కువ తినలేదన్నట్టుగా పోలీసులు ఈసారి కోడి పందాల కట్టడికి డ్రోన్లను రంగంలోకి దించారు. ప్రతి యేటా సంక్రాంతికి ముందు కోడి పందాల కట్టడి పేరుతో పోలీసులు హడావుడి చేయడం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది సంక్రాంతి కోడి పందేలను అడ్డుకుంటామని విజయవాడ పోలీస్ కమిషనరేట్‌తోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పోలీసులు డ్రోన్లను ఎగుర వేశారు.
బరుల గుర్తింపు, వాటి వద్ద నిర్వాహకుల ఏర్పాట్లను వాటితో చిత్రీకరించారు. పలు ప్రాంతాల్లో కోళ్లకు కత్తులు కట్టే వారిని, నిర్వాహకులను అదుపులోకి తీసుకుని బైండోవర్ చేశారు. కోడి పందేలు చట్ట రీత్యా నేరం అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు మైక్ ప్రచారాన్ని నిర్వహించారు. రెండు రోజులుగా కొన్ని చోట్ల కోడి పందేల బరులను ట్రాక్టర్లతో దున్నించి ధ్వంసం చేశారు. ఇంతా చేసి చివరకు చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రం నుంచి ఆయా ప్రాంతాల్లో బరులు సిద్ధమైపోతుండటం గమనార్హం.
సీన్ కట్ చేస్తే..
కోడి పందేల నిర్వాహకులు పోలీసుల ఎత్తుకు పై ఎత్తు వేస్తూ అధికార పార్టీ నేతలను రంగంలోకి దించి వారి ఆశీస్సులతో ఏర్పాట్లు పూర్తి చేశారు. చిన్నపాటి బరుల నుంచి భారీ బరుల వరకు వందల సంఖ్యలో సిద్ధం చేశారు. భోగి రోజునే పందేలు మొదలుపెట్టి మూడు రోజులపాటు అడ్డు అదుపు లేకుండా నిర్వహించుకునేలా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా కోడి పందేలకు బ్రాండ్‌గా నిలిచిన భీమవరం, ఐభీమవరం, వెంప, ఏలూరు, అమలాపురం, కోనసీమ కొబ్బరి తోటల్లో భారీ బరులు సిద్ధం చేశారు. ఒక్కొక్క బరిని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల ఖర్చుతో తీర్చిదిద్దారు.
బరుల్లో భారీ స్క్రీన్‌లు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయగా, బరులకు ఆనుకుని మద్యం బెల్ట్ షాపులు, గుండాట, పేకాట నిర్వహించుకునే ఏర్పాట్లతోపాటు కూల్ డ్రింక్స్, బిర్యానీ, కోడి పకోడి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందేలను చూసేందుకు, బెట్టింగ్‌లు వేసేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పందేల రాయుళ్లు ఈ ప్రాంతాలకు తరలి వస్తున్నారు. వారి కోసం భీమవరం తదితర పట్టణాల్లో మూడు నెలల ముందు నుంచే లాడ్జీలు, హోటళ్లు బుక్ చేశారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లకు తోడు చేపల చెరువుల వద్ద మకాంలను కూడా సిద్ధం చేశారు. ఇప్పటి దాకా ఇంత చేసిన పోలీసులు ఆ మూడు రోజులు మాత్రం గప్‌చిప్ అని నిర్వాహకులు బాహాటంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment