రాష్ట్రవిభజన నిరసిస్తూ, సమైక్యరాష్ట్ర సాధన కోసం సాగుతున్న పోరుకు ‘రాయచోటిరణభేరి’ విజయంతో రెట్టించిన ఉత్సాహం వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గురువారం రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ‘రణభేరి’ పేరుతో సభను నిర్వహించారు.
సాక్షి, కడప/రాయచోటి: రాష్ట్రవిభజన నిరసిస్తూ, సమైక్యరాష్ట్ర సాధన కోసం సాగుతున్న పోరుకు ‘రాయచోటిరణభేరి’ విజయంతో రెట్టించిన ఉత్సాహం వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గురువారం రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ‘రణభేరి’ పేరుతో సభను నిర్వహించారు. ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి ఆర్డీవో వీరబ్రహ్మం అధ్యక్షత వహించారు. వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు. ఉదయం 11.05 గంటలకు మొదలైన సభలో మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు.
అశోక్‌బాబు ఢంకా మోగించి సమైక్యవాణి ఢిల్లీకి వినపడేలా రణభేరిని మొదలెట్టారు. 58రోజులుగా శాంతియుతంగా సమైక్య ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా నల్లపావురాలు ఎగరేశారు. సభ మొదలవగానే వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగపండు ఉష, బృందం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ‘వామ్మో..ఓ సోనియమ్మా..మా ఇండియాలో ఇటలీ బొమ్మ, ఏం పిల్లడో ఎల్దమొస్తవా!’ అంటూ ఆటపాటలతో అలరించారు.
మండుటెండను లెక్కచేయక.
గురువారం రాయచోటిలో విపరీతమైన ఎండకాసింది. అయినా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విద్యార్థులు, మహిళలు, వృద్ధులు సభాప్రాంగణంలోనే కూర్చుండిపోయారు. సమైక్యనేతల మాటలను నిశితంగా ఆలకించారు. రాయలసీమకు వాటిల్లే కష్టం, అందులోనూ వైఎస్సార్‌జిల్లాకు కలిగే నష్టం, సీమ కరువు పరిస్థితులు, సమైక్యరాష్ట్రం ఆవశ్యకతపై అశోక్‌బాబు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. అలాగే సాగునీటి వనరులు, విడిపోతే తలెత్తే ఇబ్బందులు, ఆర్టీసీ మనుగడపై ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖరరెడ్డి వివరణాత్మకంగా ప్రసంగించారు. ఉద్యోగసంఘాల రాష్ట్ర, జిల్లా నేతలు, సమైక్యాంధ్ర ఉద్యమం, ఆవశ్యకతలను వివరించారు. సభలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు సమైక్యవాదంపై పాటపాడి అభినయించారు.
సమైక్యవాదానికి కొత్త ఊపిరి:
రాయచోటి రణభేరి ఊహించినదానికంటే విజయం సాధించడంతో జిల్లాలో జరుగుతున్న సమైక్య ఉద్యమానికి కొత్త ఊపిరి, సమైక్యవాదుల్లో రెట్టించిన ఉత్సాహం వచ్చింది.58 రోజులుగా సాగుతున్న ఉద్యమం సమైక్య ప్రకటన వచ్చేవరకూ ఆగే ప్రసక్తే లేదని అశోక్‌బాబు ఉద్ఘాటించారు. జీతాలు రాకపోయినా బెదరమని, సమైక్య ఉద్యమం గురించి అవాకులు, చెవాకులు పేలితే నాలుకలు చీల్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలదని సమైక్య పరిరక్షణవేదిక అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి అన్నారు.
రణభేరి విజయవంతం అయ్యేందుకు రాయచోటి జేఏసీ కన్వీనర్ నాగిరెడ్డి వారంరోజులుగా శ్రమించారు. సభలో జేఏసీ కోకన్వీనర్ డీఆర్వో ఈశ్వరయ్య, జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి, సమైక్య ఉద్యమ నాయకులు గంగిరెడ్డి, రవికుమార్, శివకుమార్, శివారెడ్డి రాష్ట్ర వీఆర్వోల సంఘం అధ్యక్షుడు భత్సవత్సం నాయుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వినాయకం, గెజిటెడ్ అధికారులు సంఘం అధ్యక్షుడు రామ్మూర్తినాయుడు పాల్గొన్నారు.