కర్నూలు, న్యూస్‌లైన్: విభజన నిర్ణయంపై సమైక్య పోరు హోరెత్తుతోంది. మరింత తీవ్రతరం చేసేందుకు అన్ని వర్గాల ఉద్యోగులు, ప్రజా సంఘాలను ఒక్క వేదికపైకి తీసుకొచ్చేందుకు ఉమ్మడి కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాయలసీమ స్థాయి విస్తృత సమావేశం ఈనెల 13న కర్నూలులో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్రం నుంచి సమైక్య హామీ వెలువడే వరకు ఆందోళన బాట వీడేది లేదని బుధవారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు నిరసన గళం వినిపించారు.
చాలా ప్రాంతాల్లో నాయకులకు సద్బుద్ధి ప్రసాదించాలంటూ వినాయక విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి సమైక్య ఉద్యమంలో మమేకం కాగా.. ఆర్టీసీ బస్సులు గత 42 రోజులుగా డిపోలు దాటని పరిస్థితి.
కర్నూలులో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. దంత వైద్యుల సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర మంత్రులు, ఎంపీలను ప్రజా కోర్టులో ఉరి తీయాలంటూ వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
లెక్చరర్ల జేఏసీ ఆధ్వర్యంలో రాజ్‌విహార్ సెంటర్‌లో సోనియాగాంధీ, చిదంబరం, షిండే, కేసీఆర్, బొత్స చిత్ర పటాలకు పిండ ప్రదానం చేసి మురుగు కాల్వలో పడేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బళ్లారి చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి మానవహారం నిర్మించారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులను ఎస్‌ఈకి అప్పగించి గురువారం నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్‌లో రిలే నిరాహరదీక్షలు చేపట్టారు. చాగలమర్రి మెయిన్ బజార్‌లో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. రుద్రవరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నంద్యాల పట్టణంలోని దంత వైద్యులు ఆసుపత్రులను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని కాలేజీలను బంద్ చేయించి ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. నంద్యాల డివిజన్‌లో ఎయిడెడ్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. మహిళా రెవెన్యూ ఉద్యోగులు తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఫరూక్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట మైనార్టీ ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు.
ఆలూరులో క్రైస్తవులు ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. మాజీ ఎమ్యెల్యేలు మసాల ఈరన్న, లోక్‌నాథ్ మద్దతు ప్రకటించారు. ఆత్మకూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. డోన్‌లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 43వ రోజుకు చేరుకున్నాయి.
ఆర్టీసీ మహిళా కార్మికులు దీక్ష చేపట్టారు. ప్యాపిలిలో వస్త్ర వ్యాపారులు 200 అడుగుల జాతీయ జెండాతో సమైక్యాంద్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా 30వ రోజున నాల్గో తరగతి ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మద్దికెరలో జేఏసీ చేపట్టిన ఉద్యమానికి ఉపాధ్యాయులు సంఘీభావం ప్రకటించి దీక్ష చేపట్టారు. ఎమ్మిగనూరులో ఏపీ ఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు స్థానిక సోమప్ప సర్కిల్ నుండి శివ సర్కిల్ వరకు రోడ్లను శుభ్రం చేసి నిరసన తెలిపారు.
సమైక్య పోరులో భాగస్వామ్యం
Published Thu, Sep 12 2013 3:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
Advertisement
Advertisement