సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగభద్ర నదీ జలాలను వినియోగించుకుంటూ అక్రమంగా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపడుతోందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు చేశారు. ఏ అనుమతులు లేకుండా చేపడుతున్న ఈ నిర్మాణాన్ని అడ్డుకోవాలని విన్నవించారు. ఈ మేరకు మంగళవారం హరీశ్‌రావు కేంద్ర మంత్రికి లేఖ రాశారు.
ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్, సుంకేశులకు మధ్య ప్రాంతంలో తుంగభద్ర నది నుంచి 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అనంతపురం జిల్లా కు నీరిచ్చేలా పెన్నా అహోబిలం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. తుంగభద్ర పరీవాహకం నుంచి కృష్ణా ప్రధాన నదికి స్థిరమైన ప్రవాహాలు ఉంటాయని కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–1 తేల్చి చెప్పిందని, రెండో ట్రిబ్యునల్ దీన్ని ధ్రువీకరించిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో తుంగభద్ర నది నుంచి ఏపీ 40 టీఎంసీల మేర నీటిని తరలిస్తే, దిగువన తెలంగాణలోని కల్వకుర్తి, ఏఎమ్మార్ ఎస్‌ఎల్‌బీసీ, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింది నీటి అవసరాలకు తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని ప్రస్తావించారు. అదీగాక రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఎలాంటి కొత్త ప్రాజెక్టును చేపట్టినా, ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు, తెలంగాణ రాష్ట్రానికి పంపాలని పేర్కొన్నారు. బోర్డు పరిశీలించిన తర్వాత అపెక్స్ కౌన్సిల్‌కు నివేదించాలని ప్రస్తావించారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందిన తర్వాతనే ప్రాజెక్టు పనులను సాగించాలని వివరించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి డీపీఆర్‌ను పంపించే ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment