పెండింగ్‌ పెడితే ఒప్పందం రద్దే..! | Undertaking a review of projects | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పెడితే ఒప్పందం రద్దే..!

Published Mon, Jan 30 2017 2:30 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

పెండింగ్‌ పెడితే ఒప్పందం రద్దే..! - Sakshi

పెండింగ్‌ పెడితే ఒప్పందం రద్దే..!

  • రహదారులు, వంతెనల విషయంలో సర్కారు కీలక నిర్ణయం
  • నాలుగేళ్లుగా కదలిక లేని అలంపూర్‌ వంతెన నిర్మాణం
  • పాత కాంట్రాక్టర్‌తో తెగతెంపులు కొత్త సంస్థకు పనుల అప్పగింత
  • ఐదు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశం.. పనులు షురూ
  • ఇదే బాటలో మరిన్ని ప్రాజెక్టుల పనులపై సమీక్ష
  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ– ఆంధ్రప్రదేశ్‌ను అనుసంధానిస్తూ తుంగభద్ర నదిపై నిర్మించతలపెట్టిన వంతెన అది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 2010 సంవత్సరంలో దీని పనులు మొదలయ్యాయి. ఇప్పటికీ పనులు పూర్తి కాక పిల్లర్లు వెక్కిరిస్తున్నాయి. ఫలితం.. అదనంగా 50 కిలోమీటర్లు ప్రయా ణించి కర్నూలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి. ఇది ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అలంపూర్‌ జోగుళాంబ దేవాలయం చెంత ఉన్న అసంపూర్తి వంతెన నిర్మాణం కథ. ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఎన్నో పనులు ఏళ్ల తరబడి పడకేసి జనానికి తిప్పలు పెడుతున్నాయి. ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు దక్కించుకో వటం.. ఆ తర్వాత పనులు చేయలేక చతికిలపడటం.. ఏళ్లుగా ప్రజలు ఇబ్బంది పడటం సాధారణంగా కనిపించే విషయం. ఇలాంటి వాటిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. సకాలంలో పనులు పూర్తి చేయక పెండింగ్‌లో పడిన ప్రాజెక్టుల తీరును సమీ క్షించి నిర్మాణ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకుని కొత్త సంస్థలకు పనులు అప్పగిం చాలని నిర్ణయించింది.

    వెసులుబాటు ఉన్నా..
    ప్రతి ప్రాజెక్టుకు గడువుంటుంది. అది ఎప్పట్లోగా పూర్తి చేయాలో ముందే నిర్ణయి స్తారు. సాంకేతిక సమస్య ఏర్పడితే గడువును ప్రభుత్వం పొడిగిస్తుంది. సాంకేతిక సమస్య లేకుండా, సొంత ఇబ్బందులతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగితే ఒప్పందం రద్దు చేసుకువే వెసులుబాటు చట్టంలోనే ఉంది. కానీ ఇప్పటి వరకూ ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా కొన్ని పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం కొనసాగుతోంది. దీనిపై సమీక్షించిన ప్రభుత్వం పనుల్లో వేగం పెంచేందుకు ఒప్పందాలను పునఃసమీక్షిం చాలని నిర్ణయించింది. ఈ మేరకు అలంపూర్‌ వంతెన నిర్మాణాన్ని మరో సంస్థకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేయాలని కొత్త గడువు విధించింది. పనుల్లో నాణ్యతతో పాటు, కొత్త సంస్థ పనులు ప్రారంభించిన తీరును ఆదివారం రోడ్లు భవనాల శాఖ క్వాలిటీ విభాగం ఈఎన్‌సీ బిక్షపతి పరిశీలించారు. మళ్లీ వానలు కురిసి నదిలో నీటిమట్టం పెరిగేలోపు పనులు పూర్తి చేయాలని సంబంధిత నిర్మాణ సంస్థను ఆదేశించారు.

    ఇదీ కథ..
    తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ను అనుసం «ధానిస్తూ కృష్ణా నదిపై కర్నూలు వద్ద వం తెన ఉంది. జాతీయ రహదారి కావటంతో అదే ప్రధాన మార్గం. అలంపూర్‌కు చేరువలో ఉన్న ఏపీ పరిధిలోని నందికొట్కూరు తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే వెనక్కు మళ్లి జాతీయ రహదారి మీదుగా కర్నూలు దాటి వెళ్లాల్సి వస్తోంది. దీంతో 50 కిలోమీటర్ల మేర చుట్టూ తిరగాలి. ఇక తుంగభద్ర నది ఆవల కూడా తెలంగాణ పరిధిలోకి మూడు నాలుగు గ్రామాలు వస్తాయి. ఆ గ్రామాలవారు అలంపూర్‌ రావాలంటే కర్నూలు చుట్టూ తిరిగి రావాలి. 7 కిలోమీటర్ల దూరం రావటానికి 70 కి.మీ. ప్రయాణించాలి. ఈ నేపథ్యంలో అలంపూర్‌ వద్ద తుంగభద్ర నదిపై రూ.40 కోట్ల అంచనా వ్యయంతో 600 మీటర్ల వంతెనకు 2009లో ప్రణాళిక సిద్ధం చేశారు. 2010లో పనులు మొదలుకాగా నాలుగేళ్లక్రితం 24 పిల్లర్లు, వాటిపై 72 గర్డర్లు ఏర్పాటు చేశారు. వాటి మీదుగా స్లాబ్‌ నిర్మించి రోడ్డు వేయాలి. వంతెనకు అలంపూర్‌ వైపు 900 మీటర్లు, ఆవలివైపు 1,300 మీటర్ల అనుసంధాన రహదారి నిర్మించాలి. కానీ నాలుగేళ్లుగా పనులు ముందుకు సాగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement