తుంగభద్రకు తూట్లు | illegal transportation of sand from tungabhadra river | Sakshi
Sakshi News home page

తుంగభద్రకు తూట్లు

Published Tue, Jun 3 2014 12:31 AM | Last Updated on Mon, Oct 22 2018 2:02 PM

illegal transportation of sand from tungabhadra river

కర్నూలు రూరల్, న్యూస్‌లైన్ : ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నదీ తీర ప్రాంతాల్లో మాఫీయా మాటేసింది. లాభాలు అధికం కావడంతో అక్రమార్కులు ఎంతకైనా తెగించేందుకు వెనుకాడటం లేదు. అధికారులను నయానోభయానో దారికి తెచ్చుకుంటూ బేరం కుదుర్చుకుంటున్నారు. ఎవరి స్థాయిలో వారికి వాటాలు ముడుతుండటంతో వ్యవహారం గుట్టుగా సాగిపోతోంది. ప్రధానంగా నదీ తీర గ్రామాలైన నిడ్జూరు, మనగాలపాడు, పంచలింగాల, ఇ.తాండ్రపాడు, దేవమాడ, పడిదెంపాడు, పూడూరు నుంచి రాత్రి 10 గంటల తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు ఇసుక తరలింపు జోరందుకుంటోంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇసుకను డంప్ చేస్తూ.. ఆ తర్వాత జేసీబీలతో లారీల్లోకి నింపి హైదరాబాద్, శంషాబాద్, బళ్లారి తదితర సుదూర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

హైరదాబాద్‌లో డిమాండ్ దృష్ట్యా లారీ ఇసుక ధర లక్ష రూపాయలకు పైనే పలుకుతోంది. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన ప్రత్యేక టీములు ప్రతి రోజూ రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జాతీయ రహదారి, ఇసుక తరలించేందుకు అవకాశమున్న ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉంది. అయితే టీమ్ సభ్యులు తీరిక సమయాల్లో చుట్టపుచూపుగా వచ్చి వెళ్తుండటంతో ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగిపోతోంది. కొందరు సభ్యులు ఒక్కో వాహనానికి రేటు కట్టి వసూలు చేస్తుండటం కూడా తరలింపునకు మార్గం సుగమం చేస్తోంది. తనిఖీల్లో ట్రాక్టర్లు పట్టుబడితే ఆయా ప్రాంతాల్లోని వీఆర్వోలు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు దండుకుంటున్నారు. గత నెల 18న ఏర్పాటైన టీమ్ ఇప్పటి వరకు 24 ట్రాక్టర్లు, రెండు లారీలను మాత్రమే సీజ్ చేయడం వారి పనితీరుకు నిదర్శనం.

 ఆదాయం అధికంగా ఉండటంతో ఓ ఆర్‌ఐ తన విధులను పక్కనపెట్టి ఇసుక లారీలపైనే అధికంగా దృష్టి సారిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. మరో సీనియర్ అసిస్టెంట్.. పట్టణం, గ్రామీణ ప్రాంతానికి చెందిన వీఆర్వోలు.. ఇటీవల వీఆర్వోలుగా విధుల్లో చేరిన మరో ఇద్దరు అక్రమ వసూళ్లలో తలమునకలవుతున్నారు. నదీ తీర గ్రామాల నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నా వీరు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. పత్రికల్లో వార్తలు ప్రచురితమైన మరుసటి రోజు ఆర్డీఓ, తహశీల్దార్లు హడావుడి చేస్తున్నా ఆ తర్వాత షరా మామూలే. వారం రోజుల క్రితం ఏపీ28 టీఈ 2349 లారీని సీజ్ చేశారు. నాలుగు రోజులకే ఆ వాహన యజమానితో ఓ ఆర్‌ఐ రూ.25 వేల జరిమానా కట్టించి.. సుమారు రూ.75 వేలు తన ఖాతాలోకి వేసుకున్నట్లు ఆ శాఖ సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు.

పంచలింగాల, దేవమాడ గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులే నేరుగా హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన బిల్డర్లతో మాట్లాడుకుని మొబైల్ టీమ్ సభ్యుల సహకారంతో రోజూ పదుల సంఖ్యలో లారీలను తరలించేస్తున్నారు. నిబంధనల ప్రకారం వాహనాలను సీజ్ చేస్తే రవాణాకు అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సి ఉంది. భూగర్భ, గనుల శాఖ అధికారులతో పాటు తహశీల్దార్లకు ఆ వివరాలను తెలియజేసి వారి స్పందన మేరకు వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. ట్రాక్టరుకు రూ.12 వేల నుంచి రూ.25 వేలు.. లారీకి రూ.25 వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా వేసి 30 రోజుల పాటు సీజ్ చేసిన అధికారి పరిధిలోనే వాహనం ఉంచుకోవాల్సి ఉన్నా పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement