కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: నగర సమీపంలో తుంగభద్ర నదిపై ఆనకట్ట, రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. డీటైల్ ప్రాజెక్టు సర్వే చేసేందుకు నిధులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. ఈ నిర్మాణంతో నదికి అవల వైపు గ్రామాల ప్రజలు గ్రామాలకు రాకపోకలు సులభం కానున్నాయి. ఈ.తాండ్రపాడు, గొందిపర్ల, దేవమడ, పూలతోట, సుందరయ్య నగర్, వసంతనగర్, దొడ్డిపాడు, మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్ద శింగవరం, అలంపూర్, చిన్న శింగవరం, భైరాపురం, కాశాపురం తదితర గ్రామాల ప్రజలు నిత్యం లాంచీలు, పుట్టిల సహాయంతో తుంగభద్ర నదిపై కర్నూలు నగరానికి చేరుకుంటున్నారు.
ఆయా గ్రామాల ప్రజలు నగరానికి రోడ్డు మార్గంలో నగరానికి రావాలంటే 18 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. బస్సు చార్జీలు ఖర్చు అధికమవుతుండటంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నదిపైనే ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం ద్వారా ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. 2009లో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు నదీ తీర గ్రామాల్లో పర్యటించారు. ప్రజలు నదిపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించగా సానుకూలంగా స్పందించారు.
ప్రజల మాటున ప్రజాప్రతినిధి కోసం:
నదీ తీర ప్రాంత ప్రజల అవసరాల కోసమైతే వంతెన మాత్రమే నిర్మించాల్సి ఉంది. అయితే ఓ ప్రజాప్రతినిధి తన ఫ్యాక్టరీలకు శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం కోసమే ఆనకట్ట, రోడ్డు నిర్మిస్తున్నారని ప్రతి పక్షపార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆనకట్ట నిర్మాణంపై నదీ తీర గ్రామాల ప్రజలు, ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పంతాన్ని నెగ్గించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నదిపై రూ. 64 కోట్లతో ఆనకట్ట, రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు మే నెలలో కర్నూలు బహిరంగ సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.
ఈమేరకు సర్వే చేసేందుకు జూలైలో నీటిపారుదల శాఖ అంచనా వేసింది. దీంతో ప్రభుత్వం రూ. 30 లక్షలు మంజూరు చేసి టెండర్లు ఆహ్వానించింది. ఇటీవల హైదరాబాద్‌కి చెందిన ఐడియల్ ఏజెన్సీ రూ.27 లక్షలకే సర్వే టెండరును దక్కించుకుంది. సర్వే చేసేందుకు ప్రభుత్వం మూడు నెలలు మాత్రమే గడువు విధించినట్లు ఇరిగేషన్ ఎస్‌ఈ ఆర్. నాగేశ్వరరావు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ కంటే ముందుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా గుండ్రేవుల ప్రాజెక్టు సర్వే, సుంకేసుల జలాశయ పూర్తి స్థాయి మరమ్మతులకు నిధులు రెండులు మంజూరు చేయడం లేదు.