అక్రమార్కుల దెబ్బకు తరిగిపోతున్న ఇసుక దిబ్బలు
తుంగభద్ర నదీతీరప్రాంత గ్రామాలకు పెట్టని కోటగా.. ప్రకృతి ప్రసాదించిన రక్షాకవచంగా నిలిచిన ఇసుక దిబ్బలు అక్రమార్కుల దెబ్బకు కరిగిపోతున్నాయి. వారికి కాసులు కురిపిస్తూ.. జనాన్ని కష్టాల్లోకి నెడుతున్నాయి. వీటికి అడ్డుకట్ట పడకపోతే.. భారీ వర్షాలకు ఊళ్లన్నీ జలఖడ్గానికి బలయిపోతాయి. అప్పుడు ప్రజలకు మిగిలేది కన్నీళ్లే.. పర్యావరణవేత్తలు చేస్తున్న ప్రమాద హెచ్చరికలివి. అయినా కొందరు అధికారులు పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక్క పంచలింగాల గ్రామంలోనే ఇసుక అక్రమరవాణా వ్యాపారం నెలకు రూ. 20కోట్లపైమాటే. ఇసుకాసురుల నుంచి వచ్చే నజరానాలు వారి కళ్లు కప్పేస్తున్నాయని జనం దుమ్మెతిపోస్తున్నారు. జాతీయ రహదారిపైనే నిత్యం వందల వాహనాల్లో ఇసుక తరలిపోతున్నా సంబంధిత శాఖలేవీ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
జేసీ ఆదేశాలు బేఖాతర్..
తుంగభ్రద నుంచి భారీగా ఇసుక తరలిపోతోంది. అక్రమార్కులు అనుమతులు లేకుండా తవ్వుతున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు రంగంలోకి దిగారు. తానే స్వయంగా అర్ధరాత్రి వేళ తనిఖీలు చేశారు. నిజమేనని నిర్ధారించారు. ఇసుక మాఫియాకు అధికారుల సహకారాన్ని నిగ్గు తేల్చారు. పద్ధతి మార్చుకోవాలని కఠినంగా హెచ్చరించారు. అయినా ఆయన ఆదేశాలను పట్టించుకోలేదు. ఇసుక రవాణాదారులతో చేతులు కలిపి ‘రాత్రి వేళల్లో తరలించండి.. తనిఖీలుండవు’ అని అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే జేసీ తనిఖీల తర్వాత కూడా అక్రమ రవాణా ఆగలేదు. పైగా మాఫియానే ఉన్నతాధికారుల కదిలికలపై కౌంటర్ నిఘా బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం విశేషం. వీరికి రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల నుంచి మంచి తోడ్పాటు అందుతోంది. పంచలింగాల, మునగాలపాడు, దేవమడ గ్రామాల వద్ద నుంచి రోజూ రాత్రి వేళ 50 నుంచి వంద లారీల ఇసుక తరలిస్తున్నారు. నిజానికి పంచలింగాలలో అధికారికంగా ఇసుక రేవులు లేవు. ఇక్కడ తవ్వుతున్నవన్నీ అనధికారిక క్యారీలే. ఇక్కడ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి రాత్రి వేళ క్షణాల్లో జేసీబీల ద్వారా లారీలకు లోడింగ్ చేసి హైదరాబాద్‌కు పంపుతున్నారు.
ప్రైవేటు స్థలాల్లో డంపింగ్.. ఉన్నతాధికారులు తనిఖీ చేసినా దొరకకుండా ఇసుకాసురులు ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రైవేటు స్థలాల్లో డంప్ చేసి రహస్యంగా అక్కడి నుంచి అవసరం మేరకు తరలిస్తున్నారు. పంచలింగాలలో నిత్యం మూడు, నాలుగు డంప్‌లలో 40, 50 లారీలకు సరిపడా ఇసుక నిల్వలు ఉంటాయి. ఈ ఇసుకను స్థానిక నిర్మాణాల కోసం అన్నట్లుగా ఇసుక కుప్పలు పోస్తున్నారు. రాత్రివేళ తరలిస్తున్నారు. ఇటీవల అక్రమార్కులపై ఉన్నతాధికారులు నిఘా పెట్టడడంతో పంచలింగాల నదిలో నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అవతలి గట్టున ఉన్న పుల్లూరు గ్రామంలోని బీడు భూములను లీజుకు తీసుకొని అక్కడ డంపింగ్ చేసి.. అక్కడ్నుంచి లారీల్లోకి లోడింగ్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతం నుంచి ప్రతి రోజు 50 లారీలకు పైగా అక్రమంగా తరలిస్తున్నారు. జాతీయ రహదారికి 500 మీటర్ల లోపు దూరంలోనే ఇదంతా జరుగుతున్నా.. కర్నూలు నుంచి జేసీ కన్నబాబు వచ్చి తనిఖీ చేయడం మినహా.. ఏ అధికారీ పట్టించుకోవట్లేదు.
ఇసుక డంపులను సీజ్ చేసిన కలెక్టర్... అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్టే వేసేందుకు స్వయంగా కలెక్టర్ సుదర్శనరెడ్డి నడుంబిగించారు. గురువారం కలెక్టర్, ఎస్పీ రఘురామిరెడ్డితో కలిసి పంచలింగాల గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఆ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు డంపులను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని, రవాణా శాఖ అధికారుల సహకారంతో గురువారమే అక్కడ్నుంచి వీలైనంత ఇసుకను తరలించాలని హౌసింగ్ పీడీ రామసుబ్బుకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక తనిఖీలు చేయాలని కలెక్టర్ నిర్ణయించడంతో.. జాతీయ రహదారిపైన నిరంతరం నిఘా పెట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.