
సాక్షి, కర్నూలు : రాష్ట్రంలో టీడీపీ నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హెచ్చరించారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.
చెరుకులపాడులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్నందుకే వైఎస్సార్‌సీపీ నాయకుడు, తన భర్త నారాయణరెడ్డిని, ఆయన అనుచరుడు సాంబశివుడిని పట్టపగలు శ్యాంబాబు హత్య చేయించిన విషయం నారాలోకేష్ తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమార్కులను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ నేతలే దాడి చేసిన విషయం లోకేష్ మరవడం సిగ్గుచేటని విమర్శించారు.
పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామ మాజీ సర్పంచ్ ట్రాక్టర్ ఇసుక కోసం రూ.1,550 ప్రభుత్వానికి చలానా కట్టి దాంతో డూప్లికేట్ సృష్టించి రోజుకు 70 ట్రాక్టర్ల ఇసుకను తరలించి నెలకు రూ.21 లక్షలు చొప్పున దండుకున్న విషయం లోకేష్ తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల నదులు నిండి ఇసుక సమస్య తలెత్తిందన్నారు. వర్షాలు తగ్గగానే ఇసుక కొరత ఉండదన్నారు.
సమావేశంలో కేడీసీసీ బ్యాంకు జిల్లా మాజీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, మండల కన్వీనర్లు బజారప్ప, జిట్టా నాగేశ్, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు రామచంద్ర, రహిమాన్, పల్లె ప్రతాప్‌రెడ్డి, సింగిల్ విండో ప్రసిడెంట్ అట్లా గోపాల్ రెడ్డి, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు బద్రయ్య, నేత్రజిల్లా కోఆర్డినేటర్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment